సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో బుధవారం రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
పాణ్యం రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో బుధవారం రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పాణ్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడుతున్నది తమ పార్టీ మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రకటనపై సీమాంధ్రలోని కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ప్యాకేజీలకు అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. విభజన దిశగా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే బుధవారం నియోజకవర్గాల వారీగా పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.