‘సమైక్య’ దిగ్బంధం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్య దండు కదిలింది. వైఎస్‌ఆర్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు సైతం కదంతొక్కారు. విభజన నిర్ణయంపై గళం విప్పారు. గురువారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి. జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని గుత్తి పెట్రోల్ బంకు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు.
కర్నూలు, కోడుమూరు, పాణ్యం, పత్తికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, గౌరు చరిత, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాలతో నంద్యాలలోని నూనెపల్లె చౌరస్తా వద్ద కర్నూలు-కడప రోడ్డును దిగ్బంధించారు. దాదాపు నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఆదోనిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భీమాస్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఆళ్లగడ్డలో బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించి వంటావార్పు చేపట్టారు. శిరివెళ్లలో విద్యార్థులు మానవహారం నిర్మించారు.
ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో దేవనకొండ టర్నింగ్ వద్ద కర్నూలు-బళ్లారి రహదారిపై వంటావార్పు నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంకు కూడలిలో రహదారిని దిగ్బంధించారు. నందికొట్కూరులో నాయకులు ఐజయ్య, బండి జయరాజు ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ వద్ద కర్నూలు-గుంటూరు రహదారిలో రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడే వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. డోన్ శివారులోని కొత్తపల్లి వై.జంక్షన్‌లో డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు.