ఏపీ స్విచ్‌ ఆఫ్‌! | andhra pradesh switch off! | Sakshi
Sakshi News home page

ఏపీ స్విచ్‌ ఆఫ్‌!

Published Mon, Oct 7 2013 1:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

ఏపీ స్విచ్‌ ఆఫ్‌!

ఏపీ స్విచ్‌ ఆఫ్‌!

విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం తీవ్రరూపం దాల్చింది. దాంతో ఏకంగా 3,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దానికి తోడు పలు విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఉద్యోగులే ట్రిప్‌ చేయడంతో కరెంటు కోతతో రాష్ట్రం అల్లాడింది. సీమాంధ్రలోనైతే అంతటా అంధకారం నెలకొంది. తాగునీటికి కొరత ఏర్పడింది. ఆసుపత్రులకూ కరెంటు నిలిచిపోయింది. చివరికి విద్యుత్‌ సరఫరా లేక రైల్వే శాఖ కూడా పలు రైళ్లను నిలిపేయాల్సి వచ్చింది! విద్యుత్‌ సమ్మె తిరుమలనూ తాకింది. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వెలవెలబోయాయి. నవరాత్రుల సందర్భంగా శోభాయమానంగా వెలిగిపోయే విజయవాడ కనకదుర్గ గుడిలోనూ చీకట్లు అలముకున్నాయి. శ్రీశైలం దేవస్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక పలు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె ప్రభావంతో హైదరాబాద్‌లోనూ 2 నుంచి 3 గంటలు కోతలు అమలయ్యాయి. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్‌ సిబ్బంది కూడా సోమవారం ఉదయం నుంచి సమ్మెకు దిగనున్నారు. దాంతో సమస్య మరింత తీవ్రరూపు దాల్చనుంది.


సాక్షి, హైదరాబాద్‌: విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్‌ కోసం సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో అంధకారం నెలకొంది. సీమాంధ్రలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక చీకట్లు అలుముకున్నాయి. ఒకవైపు జెన్‌కోకు చెందిన వివిధ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని శనివారం నుంచి నిలిపివేసిన ఉద్యోగులు.... ఆదివారం మొత్తం విద్యుత్‌ సరఫరా లైన్లు, సబ్‌స్టే„షన్లను లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌)లో 500 మెగావాట్ల ప్లాంటుకు ఏకంగా చీఫ్‌ ఇంజనీరు సమ్మయ్యే డోజర్‌ నడుపుతూ బొగ్గు సరఫరా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగులు ఒక్కరూ రాకపోవడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు అక్కడ కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

మొత్తం మీద జెన్‌కో ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలోని వివిధ విద్యుత్‌ ప్లాంట్లలో ఏకంగా 3,780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి ట్రాన్‌‌సకో, విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సిబ్బంది కూడా సమ్మెకు దిగడంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించింది. సీమాంధ్రలోని అనేక ప్రాంతాల్లోని 400, 220, 133 కేవీ సబ్‌స్టే„షన్లతో పాటు 33/11 కేవీ సబ్‌స్టే„షన్లను ట్రిప్‌ చేయడం ద్వారా విద్యుత్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దాంతో జల విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి చేసి కరెంటును సరఫరా చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలో పూర్తిగా అంధకారం నెలకొంది. పల్లె, పట్నం తేడా లేకుండా చీకట్లు అలముకున్నాయి. దాంతో కనీసం తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆసుపత్రులకు కూడా సమ్మె సెగ తాకింది. ఘన్‌పూర్‌, శ్రీశైలం, గుత్తిల్లో 400 కేవీ స్టేషన్లను కూడా ట్రిప్‌ చేశారు. చిత్తూరులో 315 ఎంవీఏ, గుంటూరు జిల్లా నరసరావుపేట, వైఎస్సార్‌ జిల్లా పులివెందులల్లో 100 ఎంవీఏ సామర్థ్యమున్న సబ్‌స్టే„షన్లు పేలిపోయాయి. ఈపీడీసీఎల్‌ పరిధిలో 5,000 మంది సోమవారం ఉదయం నుంచి సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె ప్రభావం హైదరాబాద్‌నూ తాకింది. రాజధానిలో 2 నుంచి 3 గంటల పాటు కోతలు అమలయ్యాయి. సమ్మె నుంచి టీటీడీకి తొలుత మినహాయింపు ఇచ్చారు. అయితే రాత్రి వేళల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ సమయంలో విద్యుత్‌ను సరఫరా చేయాలని, పగలు యథావిధిగా కోతలు అమలు చేయాలని కొన్ని జిల్లాల్లోని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీలు నిర్ణయించాయి. ఆ మేరకు ఆదివారం రాత్రి 8 గంటల నుంచి పలు జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా సరఫరాను నిలిపేస్తామని ఉద్యోగులు అంటున్నారు. ఇంధన శాఖ వర్గాలు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్నాయి. గ్రిడ్‌కు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమ్మె విరమించేలా ఉద్యోగుల నేతలతో జెన్‌కో ఎండీ కె.విజయానంద్‌, ట్రాన్‌‌సకో సీఎండీ (ఇన్‌చార్జి) మునీంద్ర సోమవారం విద్యుత్‌ సౌధలో చర్చలు జరపనున్నారు.


3,780 మెగావాట్ల విద్యుత్‌ నష్టం...!: సమ్మెతో సీమాంధ్రలోని పలు ప్లాంట్లలో ఆదివారం రాత్రికల్లా ఏకంగా 3,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సోమవారం నుంచి మరో 265 మెగావాట్ల ఉత్పత్తికీ గండిపడే ప్రమాదముంది. విజయవాడలోని నార్లతాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌)లో 210 మెగావాట్ల సామర్థ్యమున్న 7 యూనిట్లు మొత్తం 1460 మెగావాట్ల విద్యుదుత్పత్తీ శనివారమే నిలిచిపోయింది. 500 మెగావాట్ల మరో యూనిట్లో ఆదివారం రాత్రి 8 గంటల దాకా కరెంటును ఉత్పత్తి చేశారు. బొగ్గును సరఫరా చేసేందుకు ఒక్క ఉద్యోగీ అందుబాటులో లేకపోవడంతో చీఫ్‌ ఇంజనీర్‌ సమ్మయ్యే డోజర్‌ ద్వారా బొగ్గును లోడ్‌ చేయాల్సి వచ్చింది! చివరికి ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ 500 మెగావాట్ల ఉత్పత్తినీ నిలిపేశారు. దాంతో ఒక్క ఎన్‌టీటీపీఎస్‌లోనే ఏకంగా 1,960 మెగావాట్ల విద్యుదుత్పత్తి వైస్సార్‌ జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లో 210 మెగావాట్ల సామర్థ్యమున్న 5 యూనిట్లలో మొత్తం 1,050 మెగావాట్ల ఉత్పత్తీ శనివారమే పడకేసింది. 770 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్కేంద్రం లోని ఉద్యోగులు కూడా ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దాంతో ఈ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సోమవారం ఉదయం ఆరింటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు విశాఖ కేంద్రంగా ఉన్న ఉద్యోగులు కూడా ప్రకటించడంతో 240 మెగావాట్ల సీలేరు, 25 మెగావాట్ల డొంకరాయి జల విద్యుత్కేంద్రాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోనుంది.

కరెంటున్నా తీసుకునే వారేరీ?: సమ్మెతో విద్యుదుత్పత్తికి నష్టం వాటిల్లడంతో రిజర్వాయర్లలో నీళ్లున్నందున జల విద్యుదుత్పత్తిని జెన్‌కో పెంచింది. శ్రీశైలం, జూరాల, సీలేరు, డొంకరాయి, మాచ్‌ఖండ్‌ వంటి జల విద్యుత్కేంద్రాలతో పాటు తెలంగాణలోని పలు థర్మల్‌ ప్లాంట్లలో కూడా పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, వరంగల్‌ జిల్లా కాకతీయ థర్మల్‌ ప్లాంట్లకు నాణ్యమైన సీ-గ్రేడ్‌ బొగ్గుతో పాటు ఒరిస్సా నుంచి వచ్చే వాష్‌డ్‌ కోల్‌నూ సరఫరా చేశారు.

 

ఇలా ఇబ్బడిముబ్బడిగా విద్యుదుత్పత్తి చేసినా సీమాంధ్రలో అనేక ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లను ట్రిప్‌ చేయడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ఆదివారం ఒకానొక సమయంలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ కేవలం 7,000 మెగావాట్లకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌కు వాస్తవంగా 1700 మెగావాట్లు అవసరం కాగా ఆదివారం మధ్యాహ్నం 300 మెగావాట్లనే తీసుకుంది. అంటే డిమాండ్‌ ఏకంగా 1,400 మెగావాట్ల మేర పడిపోయింది! కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ డిమాండ్‌ లేకపోవడంతో మరో 800 మెగావాట్ల విద్యుత్‌ అవసరం లేకుండా పోయింది. అంటే మొత్తం మీద 2,200 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిపోయింది. దాంతో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం ఎడమగట్టు, సీలేరు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి జరగకుండా ప్లాంట్లను నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి ఏడింటి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడంతో ఈ ప్లాంట్లలో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించారు.

విద్యుత్‌ సౌధలో కంట్రోల్‌ రూం: సమ్మె నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు విద్యుత్‌ సౌధలో కంట్రోల్‌ రూములను జెన్‌కో, ట్రాన్‌‌సకో ఏర్పాటు చేశాయి. సరఫరా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు వీలుగా డెరైక్టర్‌ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో కంట్రోల్‌ రూంను ట్రాన్‌‌సకో ఏర్పాటు చేసింది. రైల్వే శాఖ అధికారి కూడా అక్కడే ఉండి ఏయే లైన్లలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందనే వివరాలను తమ శాఖకు చేరవేశారు. జెన్‌కో కూడా విద్యుదుత్పత్తికి ఇబ్బంది కలగకుండా, సరఫరాకు అనుగుణం గా ఉత్పత్తి జరిగేలా చూసేందుకు డెరైక్టర్‌ (హెచ్‌ఆర్‌) ఏవీ రావు ఆధ్వర్యంలో చీఫ్‌ ఇంజనీర్లు సుందర్‌సింగ్‌, సుజయ్‌కుమార్‌లతో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది.

సబ్‌స్టే„షన్లే లక్ష్యంగా...!
విద్యుత్‌ ఉద్యోగుల అకస్మిక సమ్మె వల్ల సీమాంధ్ర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అంధకారం అలుముకుంది. అక్కడి పలు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపేసిన ఉద్యోగులు, తర్వాత విద్యుత్‌ సరఫరా వ్యవస్థపై దృష్టి సారించారు. ఎక్‌‌సట్రా హై-టెన్షన్‌ (400, 220, 132 కేవీ సబ్‌స్టే„షన్లను లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని అన్ని ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లనూ ట్రిప్‌ చేశారు. చిత్తూరు జిల్లాలో 132 కేవీ పుంగనూరు, కర్నూలు జిల్లాలోని 400 కేవీ నన్నూరు, 220 కేవీ ఏపీ కారై్బడ్‌‌స, వైఎస్సార్‌ జిల్లాలో అన్ని ఈహెచ్‌టీలతో పాటు 220 కేవీ రాజంపేట, 220 కేవీ ఎరగ్రుంట్ల విద్యుత్‌ సరఫరా లైన్లను ట్రిప్‌ చేశారు. గుంటూరు జిల్లాలో 132 కేవీ మాచర్ల, 132 కేవీ బాపట్ల స్టేషన్లనూ ట్రిప్‌ చేశారు. ఫలితంగా విద్యుత్‌ పంపిణీ చేసినా, సబ్‌స్టే„షన్లను ట్రిప్‌ చేయడంతో సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది! దాంతో సీమాంధ్రలోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. పెద్ద సబ్‌స్టే„షన్లకు సరఫరా లేకపోవడంతో గృహాలకు సరఫరా చేసే 33/11 కేవీ స్టేషన్లకు కూడా కరెంటు నిలిచిపోయింది. ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లను లక్ష్యంగా చేసుకోవడం వల్ల పరిశ్రమలు, ఆసుపత్రులకు కూడా విద్యుత్‌ ఆగిపోయింది. పలుచోట్ల 33/11 కేవీ స్టేషన్లలోని ఆపరేటర్లను కూడా బయటికి తీసుకెళ్లారు. వాటికి విద్యుత్‌ సరఫరా కాకుండా ట్రిప్‌ చేశారు. దాంతో కొన్నిచోట్ల పెద్ద సబ్‌స్టే„షన్ల నుంచి కరెంటు వచ్చినా స్థానికంగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. పైగా 33/11 కేవీ స్టేషన్లను ట్రిప్‌ చేయడంతో పై నుంచి విద్యుత్‌ సరఫరా జరిగిన ప్రాంతాల్లో ఓవర్‌లోడ్‌ వల్ల పలు ట్రాన్‌‌సఫార్మర్లు పేలిపోయాయి. ఇలా సీమాంధ్రలో వందలాది ట్రాన్‌‌సఫార్మర్లు పేలిపోయినట్టు సమాచారం. దీనికి తోడు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మెకు దిగనుండటంతో ఆ జిల్లాల్లోనూ సోమవారం విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కుప్పకూలడం ఖాయమంటున్నారు.

రక్షణ పూజ్యం...!
విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెను ఎదుర్కొనేందుకు కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా ఇంధన శాఖ విఫలమైంది. కనీసం 400, 220, 132 కేవీ సబ్‌స్టే„షన్ల వద్ద కూడా ఏమాత్రమూ ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయలేదనే విమర్శలున్నాయి. దాంతో సీమాంధ్రలో పలు ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లను ముట్టడించి సరఫరాను నిలిపేసినా అడ్డుకునే వారు లేకుండాపోయారు. సబ్‌స్టే„షన్‌కు ఒక పోలీసు చొప్పున రక్షణ కావాలని ఎస్పీలను ఇంధన శాఖ తాజాగా కోరింది. ఒక్క పోలీసు ఏం రక్షణ కల్పిస్తారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

పలు ప్రాంతాల్లోని సబ్‌స్టే„షన్ల రక్షణ ఇలా...
            జోన్‌    సబ్‌స్టేషన్ల సంఖ్య   రక్షణ ఉన్నది   రక్షణ లేనిది
            విజయవాడ        34             9                   25
            నెల్లూరు          34                34              --
            కడప               34           30                   4
            కర్నూలు            47          8                     30
            విశాఖపట్నం       33         2                      31
            రాజమండ్రి           31          2               29
            400 కేవీ సబ్‌స్టే„షన్‌- మాచ్‌ఖండ్‌1         -              1
            400 కేవీ సబ్‌స్టే„షన్‌- కల్పకం1               1           -

దక్షిణాది గ్రిడ్‌కు ఢోకా లేనట్టే!

సాక్షి, హైదరాబాద్‌: సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దక్షిణాది గ్రిడ్‌ కుప్పకూలుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఇంధన శాఖ అధికారులు మాత్రం వాటిని తోసిపుచ్చుతున్నారు. రాష్ట్రంలో గ్రిడ్‌ కుప్పకూలే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. ‘‘రాష్ట్రంలో ఏయే విద్యుత్కేంద్రాల్లో ఎంత విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అలాగే ఏయే సబ్‌స్టే„షన్లు పని చేయడం లేదో కూడా ఇప్పటికే పూర్తి సమాచారముంది. సమ్మె గురించి కూడా ముందే తెలిసిన కారణంగా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాం. నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం’’ అని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement