71వ రోజూ.. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు | Samaikya andhra agitations raised in seemandhra Regions | Sakshi
Sakshi News home page

71వ రోజూ.. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు

Published Thu, Oct 10 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

71వ రోజూ.. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు

71వ రోజూ.. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు

సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలి నినదిస్తూ  కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వరుసగా 71వ రోజైన బుధవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు హోరెత్తాయి. ఏపీఎన్‌జీవోల పిలుపు మేరకు రెండోరోజూ కేంద్ర కార్యాలయాల్ని, బ్యాంకుల్ని సమైక్యవాదులు మూయించారు. కార్మిక సంఘాలూ మద్దతుపలికి బంద్ పాటించాయి. వైద్య వర్గాల బంద్‌తో సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో  అత్యవసర సేవలు మినహా ఓపీలు, ఇతర సేవలు నిలిచిపోయాయి.
 
 జాతీయ రహదారి దిగ్బంధం
 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 216 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రాజమండ్రిలో విద్యుత్ ఉద్యోగులు ‘దుర్గమ్మ, బతుకమ్మ మాకు ఒక్కటే’ అంటూ ఇద్దరు దేవతలకు పూజలు చేశారు. బొమ్మూరు 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ ఉద్యోగులు టవర్ లైన్ ఎక్కి సమైక్య నినాదాలు చేశారు. ఏలేశ్వరంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్నంగా ఆకులు తింటూ, రాష్ట్రం విడిపోతే తమ బతుకులు ఇంతేనని చాటి చెప్పారు. జగన్ దీక్షకు మద్దతుగా కొత్తపేటలో సమైక్యవాదులు ‘జై సమైక్యాంధ్ర,  జై జగన్’ పేర్లతో పేపరు బెలూన్‌లను గాలిలోకి వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సమైక్య శంఖారావం నిర్వహించారు. 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరై సమైక్య నినాదాలు మార్మోగించారు. గురువారం భీమవరంలో గోదావరి ప్రజాగర్జన పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
 
 ఎయిర్‌పోర్టుకూ ఉద్యమ సెగ
 కృష్ణాజిల్లాలో గన్నవరం విమానాశ్రయానికి సమైక్య సెగ తగిలింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్తు కోత విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్లను ఏర్పాటు చేయడంతో కొంత వెసులుబాటు కలిగింది. విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా అధికారులు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలును అడ్డుకోవడంతో పోలీసులు సమైక్యవాదులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులు కేంద్ర మంత్రుల కమిటీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో పొదుపు మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట నిరసనలు చేపట్టారు. శ్రీకాకుళంలో పీఆర్ అండ్ ఆర్డీ ఉద్యోగులు కేంద్రమంత్రి కృపారాణి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజాంలో కాపు కన్నెర్ర పేరిట ఆ కులస్తులు పట్టణ బంద్, సభ నిర్వహించారు. విజయనగరం జిల్లా  గజపతినగరంలో మహిళా ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  విశాఖ నగరంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేతలు కళ్లకు గంతలు క ట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు.
 
 హిందువుల పూజలు, ముస్లింలు, క్రైస్తవుల ప్రార్ధనలు
 కర్నూలు జిల్లా నంద్యాలలో హిందువులు దేవాలయాల్లో పూజలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని కోరారు. క్రైస్తవులు చర్చిల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రార్థనలు చేపట్టారు. అనంతపురంలో విద్యుత్ ఉద్యోగులు, ఎస్కేయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కణేకల్లులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై ప్రార్థన చేశారు.  పెనుకొండలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలకు సమాధి కట్టి.. పిండప్రదానం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఐదు వేల పోస్టుకార్డులను రాష్ట్రపతికి పంపారు. ఆర్టీపీపీలో ఐదు యూనిట్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతోపాటు ఆరవ యూనిట్ పనులను సైతం విద్యుత్ జేఏసీ అడ్డుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మండుటెండలో గంటసేపు పడుకుని నిరసన తెలిపారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిపాలన భవ నాన్ని ముట్టడించారు. శ్రీకాళహస్తిలో విద్యార్థి గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.  
 
 ఎక్సైజ్ ఉద్యోగుల సమ్మెబాట...
 విజయవాడ : సీమాంధ్రలోని 13 జిల్లాల్లో గురువారం నుంచి మద్యం విక్రయాలకు బ్రేక్ పడనుంది. సమైక్యాంధ్ర సాధన కోసం ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులంతా సమ్మె బాట పట్టనున్నారు. వారంతా బుధవారం విజయవాడలో సమావేశమై ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతోపాటు చైర్మన్ ఆదినారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ,  బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం అర్ధరాత్రి నుంచి తాము సమ్మె చేస్తామని వెల్లడించారు.
 
 సీమాంధ్రలో 17న సాగునీరు బంద్
 ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలో వివిధ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న సాగునీటిని ఈ నెల 17న 24 గంటలపాటు నిలిపివేయాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నిర్ణయించారు. ఆ రోజు ఉ.7 గంటల నుంచి సాగునీటి నియంత్రణ వ్యవస్థలు (వాటర్ రెగ్యులేటరీ సిస్టమ్స్) అన్నింటినీ 24 గంటలపాటు బంద్ చేస్తామని ఇంజినీర్ల జేఏసీ నేతలు వెల్లడించారు. వీరు బుధవారం విజయవాడలో సమావేశమై, ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు.  
 
 విజయనగరం ప్రశాంతం
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరంలో బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బుధవారం రెండు గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అదనపు డీజీ పూర్ణచంద్రరావు, ఐజీ ద్వారకా తిరుమలరావు, డీఐజీలు ఉమాపతి, స్టీఫెన్ రవీంద్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇంతవరకూ 250 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా వీరిలో ఎక్కువమంది అమాయకులు, విద్యార్థులే ఉన్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు ఎస్పీ కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ, పత్రికలు, చానళ్లలో వచ్చిన ఫుటేజీ ఆధారంగా అరెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. యువతను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు అన్నారు. కర్ఫ్యూ ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
 
 ఎస్టేట్ ఆఫీసర్‌పై దాడి... : కలెక్టర్ సూచన మేరకు ఉదయాన్నే రైతుబజార్‌ను తెరచిన ఎస్టేట్ ఆఫీసర్ సతీష్‌ను అదనపు ఎస్పీ మోహన్‌రావు అకారణంగా చితకబాదారు. కర్ఫ్యూ సడలించిన సమయంలో రైతుబజార్‌ను తెరచి కూరగాయల విక్రయానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉదయం ఆరున్నరకే ఆర్‌అండ్‌బీ బజార్‌ను తెరచి రైతులతో మాట్లాడుతున్న సతీష్‌ను మోహన్‌రావు చితకబాదడమేగాక రెండు గంటలపాటు నేలపై కూర్చోబెట్టి అవమానించారు. దీంతో రైతులంతా ఆందోళన చేసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని రైతుబజార్లనూ గురువారం బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు గురువారం ఉ. 7 నుంచి 9 వరకు, మ.2నుంచి 4వరకు కర్ఫ్యూను సడలిస్తున్నారు.
 
  మరో ఇద్దరు మృత్యువాత
 సాక్షి నెట్‌వర్క్ : తెలంగాణ ఏర్పాటు ప్రక్రి య వేగవంతమవుతున్నట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి తట్టుకోలేక  బుధవారం తిరుపతిలోమనోహర్ (40) అనే ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మృతిచెందాడు. విభజన కలతతో మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన అనంతపురం జిల్లా  కంబదూరు మండలం చెన్నంపల్లికి చెందిన మల్లికార్జున నాయక్ (37) హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని, గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేయాలంటూ మంత్రి రఘువీరారెడ్డి అనుచరులు ఆశ చూపగా, ఇది గుప్పుమనడంతో స్థానికంగా కలకలం రేగింది. కాగా, మృతుని ఇతని కుటుంబాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement