Seemandhra Agitations
-
71వ రోజూ.. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలి నినదిస్తూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వరుసగా 71వ రోజైన బుధవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు హోరెత్తాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు రెండోరోజూ కేంద్ర కార్యాలయాల్ని, బ్యాంకుల్ని సమైక్యవాదులు మూయించారు. కార్మిక సంఘాలూ మద్దతుపలికి బంద్ పాటించాయి. వైద్య వర్గాల బంద్‌తో సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా ఓపీలు, ఇతర సేవలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి దిగ్బంధం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 216 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రాజమండ్రిలో విద్యుత్ ఉద్యోగులు ‘దుర్గమ్మ, బతుకమ్మ మాకు ఒక్కటే’ అంటూ ఇద్దరు దేవతలకు పూజలు చేశారు. బొమ్మూరు 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ ఉద్యోగులు టవర్ లైన్ ఎక్కి సమైక్య నినాదాలు చేశారు. ఏలేశ్వరంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్నంగా ఆకులు తింటూ, రాష్ట్రం విడిపోతే తమ బతుకులు ఇంతేనని చాటి చెప్పారు. జగన్ దీక్షకు మద్దతుగా కొత్తపేటలో సమైక్యవాదులు ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ పేర్లతో పేపరు బెలూన్లను గాలిలోకి వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సమైక్య శంఖారావం నిర్వహించారు. 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరై సమైక్య నినాదాలు మార్మోగించారు. గురువారం భీమవరంలో గోదావరి ప్రజాగర్జన పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎయిర్‌పోర్టుకూ ఉద్యమ సెగ కృష్ణాజిల్లాలో గన్నవరం విమానాశ్రయానికి సమైక్య సెగ తగిలింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్తు కోత విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్లను ఏర్పాటు చేయడంతో కొంత వెసులుబాటు కలిగింది. విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా అధికారులు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలును అడ్డుకోవడంతో పోలీసులు సమైక్యవాదులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులు కేంద్ర మంత్రుల కమిటీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో పొదుపు మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట నిరసనలు చేపట్టారు. శ్రీకాకుళంలో పీఆర్ అండ్ ఆర్డీ ఉద్యోగులు కేంద్రమంత్రి కృపారాణి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజాంలో కాపు కన్నెర్ర పేరిట ఆ కులస్తులు పట్టణ బంద్, సభ నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో మహిళా ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ నగరంలో ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు కళ్లకు గంతలు క ట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. హిందువుల పూజలు, ముస్లింలు, క్రైస్తవుల ప్రార్ధనలు కర్నూలు జిల్లా నంద్యాలలో హిందువులు దేవాలయాల్లో పూజలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని కోరారు. క్రైస్తవులు చర్చిల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రార్థనలు చేపట్టారు. అనంతపురంలో విద్యుత్ ఉద్యోగులు, ఎస్కేయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కణేకల్లులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై ప్రార్థన చేశారు. పెనుకొండలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలకు సమాధి కట్టి.. పిండప్రదానం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఐదు వేల పోస్టుకార్డులను రాష్ట్రపతికి పంపారు. ఆర్టీపీపీలో ఐదు యూనిట్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతోపాటు ఆరవ యూనిట్ పనులను సైతం విద్యుత్ జేఏసీ అడ్డుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మండుటెండలో గంటసేపు పడుకుని నిరసన తెలిపారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిపాలన భవ నాన్ని ముట్టడించారు. శ్రీకాళహస్తిలో విద్యార్థి గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ ఉద్యోగుల సమ్మెబాట... విజయవాడ : సీమాంధ్రలోని 13 జిల్లాల్లో గురువారం నుంచి మద్యం విక్రయాలకు బ్రేక్ పడనుంది. సమైక్యాంధ్ర సాధన కోసం ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులంతా సమ్మె బాట పట్టనున్నారు. వారంతా బుధవారం విజయవాడలో సమావేశమై ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతోపాటు చైర్మన్ ఆదినారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ, బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం అర్ధరాత్రి నుంచి తాము సమ్మె చేస్తామని వెల్లడించారు. సీమాంధ్రలో 17న సాగునీరు బంద్ ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలో వివిధ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న సాగునీటిని ఈ నెల 17న 24 గంటలపాటు నిలిపివేయాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నిర్ణయించారు. ఆ రోజు ఉ.7 గంటల నుంచి సాగునీటి నియంత్రణ వ్యవస్థలు (వాటర్ రెగ్యులేటరీ సిస్టమ్స్) అన్నింటినీ 24 గంటలపాటు బంద్ చేస్తామని ఇంజినీర్ల జేఏసీ నేతలు వెల్లడించారు. వీరు బుధవారం విజయవాడలో సమావేశమై, ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు. విజయనగరం ప్రశాంతం సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరంలో బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బుధవారం రెండు గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అదనపు డీజీ పూర్ణచంద్రరావు, ఐజీ ద్వారకా తిరుమలరావు, డీఐజీలు ఉమాపతి, స్టీఫెన్ రవీంద్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇంతవరకూ 250 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా వీరిలో ఎక్కువమంది అమాయకులు, విద్యార్థులే ఉన్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు ఎస్పీ కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ, పత్రికలు, చానళ్లలో వచ్చిన ఫుటేజీ ఆధారంగా అరెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. యువతను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు అన్నారు. కర్ఫ్యూ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఎస్టేట్ ఆఫీసర్‌పై దాడి... : కలెక్టర్ సూచన మేరకు ఉదయాన్నే రైతుబజార్‌ను తెరచిన ఎస్టేట్ ఆఫీసర్ సతీష్‌ను అదనపు ఎస్పీ మోహన్‌రావు అకారణంగా చితకబాదారు. కర్ఫ్యూ సడలించిన సమయంలో రైతుబజార్‌ను తెరచి కూరగాయల విక్రయానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉదయం ఆరున్నరకే ఆర్అండ్బీ బజార్‌ను తెరచి రైతులతో మాట్లాడుతున్న సతీష్‌ను మోహన్‌రావు చితకబాదడమేగాక రెండు గంటలపాటు నేలపై కూర్చోబెట్టి అవమానించారు. దీంతో రైతులంతా ఆందోళన చేసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని రైతుబజార్లనూ గురువారం బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు గురువారం ఉ. 7 నుంచి 9 వరకు, మ.2నుంచి 4వరకు కర్ఫ్యూను సడలిస్తున్నారు. మరో ఇద్దరు మృత్యువాత సాక్షి నెట్వర్క్ : తెలంగాణ ఏర్పాటు ప్రక్రి య వేగవంతమవుతున్నట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి తట్టుకోలేక బుధవారం తిరుపతిలోమనోహర్ (40) అనే ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మృతిచెందాడు. విభజన కలతతో మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన అనంతపురం జిల్లా కంబదూరు మండలం చెన్నంపల్లికి చెందిన మల్లికార్జున నాయక్ (37) హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని, గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేయాలంటూ మంత్రి రఘువీరారెడ్డి అనుచరులు ఆశ చూపగా, ఇది గుప్పుమనడంతో స్థానికంగా కలకలం రేగింది. కాగా, మృతుని ఇతని కుటుంబాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. -
వైఎస్సార్సీపీ అలుపెరగని పోరు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు వద్ద ధర్నా నిర్వహించారు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు బైపాస్ రోడ్డులో భారీ ధర్నా చేపట్టారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. కలెక్టరేట్ నుంచి ర్యాలీగా నగరంపాలెంలోని మంత్రి నివాసం వద్దకు చేరుకున్న నేతలను పోలీసులు అడ్డగించారు. తోపులాటలో ఇద్దరు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోగా, వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నేతలందరినీ పోలీసులు అరెస్టుచేసి పట్టాభిపురం స్టేషన్‌కు తరలించారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో జల దీక్ష చేపట్టారు. వినుకొండలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిపై రాస్తారోకో, వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి కార్యకర్తలతో కలసి ధర్నా చేశారు. చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం నుంచి ఐదురోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణదీక్షకు సంఘీభావంగా పార్టీ కార్యకర్తలు, నేతలు వాడవాడలా పెద్దఎత్తున రిలేదీక్షలు చేపట్టారు. -
తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ టవర్లకు నిప్పు
-
తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ టవర్లకు నిప్పు
తిరుపతి : రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకంగా సీమాంధ్ర భగ్గుమంటోంది. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న తిరుపతి వాసులు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నారు. విద్యార్ది జేఏసి నాయకులు చిత్తూరు తిరుపతి ప్రధాన రహదారిపై ముళ్ల కంపలు వేసి నిప్పుపెట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కాగా అర్థరాత్రి ఆందోళనకారులు బిఎస్ఎన్ టవర్లను తగులబెట్టారు. స్విమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మరో బీఎస్ఎన్ఎల్ టవర్‌కు నిప్పంటించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
'తెలంగాణ రాష్ట్రం రాదు.... రాబోదు'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉద్యమం మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు శనివారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను వారు ఈ సందర్భంగా షిండే దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరారు. భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను మరోసారి షిండేకు తెలిపామని, తెలంగాణపై ఇంకా నోట్ తయారు కాలేదని షిండే తమతో చెప్పారన్నారు. మరి కొద్దిరోజుల్లో ఆంటోనీ కమిటీ మరిన్ని చర్చలు జరుపుతుందన్నారు. ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకు వెళ్తామని షిండే తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదు, రాబోదని సీమాంధ్ర ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రత షిండేకే ముందే తెలుసునన్నారు. -
'ముందుగా రాజీనామా ఆమోదింపచేసుకుంటా'
సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం కావడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కారణమని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించేందుకే తాము రాజీనామాలు చేయలేదని తెలిపారు. అవసరమైతే సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ముందుగా రాజీనామాను ఆమోదింపచేసుకునేది తానేనని అన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అంతకుముందు అన్నారు. సమైక్యాంధ్ర జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని పేర్కొన్నారు. సీమాంధ్రలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు. -
సమరోత్సాహంతో సమైక్యఉద్యమం
సాక్షి నెట్‌ర్క్: తెలుగుప్రజలంతా కలిసే ఉందామంటూ సీమాంధ్రలో ఎగసిన సమైక్య ఉద్యమం సమధికోత్సాహంతో ముందుకు సాగుతోంది. కోస్తా, రాయలసీమజిల్లాల ప్రజలు వివిధ రీతుల్లో సమైక్య భావనలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేర్పాటువాదులపై ఆగ్రహావేశాలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇరవైఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా నడుస్తున్న సమైక్యపోరు శనివారం కూడా ఉవ్వెత్తున సాగింది. పదమూడు రోజులుగా సకల జనుల సమ్మె చేపట్టిన అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఉద్యమ కారులతో కలసి రోడ్డెక్కుతున్నారు. సమ్మెలోకి డెప్యూటీకలెక్టర్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆడిట్, డీఆర్డీఏ, ఐకేపీ, ఆర్అండ్బీ, విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నిరవధిక సమ్మెలోకి డెప్యూటీ కలెక్టర్లు కూడా చేరడంతో జిల్లా రెవెన్యూ అధికారి కె. ప్రభాకరరావు, డెప్యూటీ కలెక్టర్లు శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా అధికారుల సంఘం ఆధ్యక్షుడు డీఆర్వో హేమసాగర్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. పీఆర్ ఉద్యోగులు అర గుండుతో నిరసన తెలిపారు. కర్నూలు నగరంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ముట్టడించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్, జేసీ మినహా అందరూ ఆందోళనల్లోనే.. ప్రకాశంజిల్లా ఒంగోలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా జిల్లాఉన్నతాధికారులందరూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొ న్నా రు. డీఆర్ఓ రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ గంగాధర్ గౌడ్, డీపీఓ శ్రీదేవి, ఆర్డీఓ మురళి, డీఆర్డీఏ పీడీ పద్మజ తదితరులు నగరంలో వివిధసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో జిల్లా అధికారులు శనివారంనుంచి సమ్మె కు దిగడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద రెవెన్యూఉద్యోగులు చేపట్టిన నిరాహారదీక్షల శిబిరంలో ఏజేసీ ఆర్ఎస్ రాజ్‌కుమార్, డీఆర్ఓ నూర్ బాషాఖాసిం, డ్వామా తదితర శాఖల ఉన్నతాధికారులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏజేసీ రాజ్‌కుమార్ డప్పు వాయించారు. సమైక్యఉద్యమ దీక్షలో ఖమ్మం వాసి సమైక్య ఉద్యమ దీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన జి.సిగడాం తహశీల్దార్ టి.నర్సయ్య పాల్గొన్నారు. సమైక్యతే తనవాదమని, విభజన వల్ల అభివృద్ధి ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇతర అధికారులు సమ్మెలో ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కుమార్ హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుండగా సమైక్యవాదులు కలెక్టరేట్లోని ఆయన గది ఎదుట డప్పులు వాయించి నిరసన తెలిపారు.పెద్దాపురం కోర్టు ఆవరణ వద్ద న్యాయవాదులు 50 గంటల నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చీపుర్లతో రోడ్డు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల వినూత్ననిరసన రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు భీక్షాటన చేయాల్సి వస్తుం దని తెలుపుతూ ఆర్టీసీ ఉద్యోగులు విజయనగరం జిల్లాలో పలువురు ఒంటికి ఆకులు చుట్టుకుని అర్ధనగ్నంగా యాచి స్తూ నిరసనర్యాలీ నిర్వహించారు. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు, కేంద్రాస్పత్రిలో వైద్య ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యద్రోహులు సోనియా, దిగ్విజయ్, బొత్స, కేసీఆర్ మాస్కుల ధరించిన వారికి బేడీలు వేసి ప్రజాకోర్టు ఎదుట దోషులుగా నిలి పారు. ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి బొత్స ఇంటికి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి పత్రాలు అంద జేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, అల్లె ప్రభావతి పట్టణంలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. చిత్తూరులో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో కలసి ఆందోళన చేపట్టారు. చిన్నారుల నిరాహారదీక్ష పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని జంగిల్ బెల్స్ పబ్లిక్ స్కూల్ చిన్నారులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. భీమవరంలో విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది విద్యార్థు లు అల్లూరి సీతారామరాజు వే షధారణలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా మొత్తం లక్ష నినాదాలు చేశారు. యువకుల రక్తదానం: నరసాపురంలో ఆచరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. కొవ్వూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు, నాయకులు పరిమి హరిచరణ్ సంఘీభావం తెలిపారు. డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో డాక్టర్ల ర్యాలీ బుట్టాయగూడెంలో డీఎంహెచ్‌వో టి.శకుంతల ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పెనుగొండలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో రైతులు సీమాంధ్ర కేంద్ర మంత్రులను పురుగులతో పోలుస్తూ రూపొందించిన ఫ్లెక్సీలను వరిచేలల్లో ఏర్పాటుచేసి పురుగుమందు పిచికారీ చేసి నిరసన తెలిపారు. పాలకొల్లులో మాజీ ఎంపీ జోగయ్య ఆధ్వర్యంలో పాడిగేదెకు వినతిపత్రం అందజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఏయూలోని విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించగా, ఏపీఎన్జీవో సభ్యులు ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎన్జీవోస్ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో ప్రదర్శన చేపట్టారు. సోనియాను మీ దేశానికి తీసుకుపోండి ఇటలీ అధ్యక్షునికి చెవిరెడ్డి లేఖలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని వెంటనే తమ దేశానికి పిలిపించుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇటలీ అధ్యక్షునికి, ప్రధానికి లేఖలు రాశారు. శనివారం తుమ్మల గుంటలోని వైఎస్ఆర్ విగ్రహం కూడలి వద్ద లేఖలు రాసి ఇటలీకి పంపించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, తమ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ లేఖలను పంపుతున్నట్లు తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ భారత దేశాన్ని నాశనం చేస్తున్నారని, విభజన పేరుతో తెలుగుప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఆమె కారణంగా భారత దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని, వీలైనంత త్వరగా ఆమెను వారి దేశానికి తీసుకుపోవాలని సూచించినట్టు చెవిరెడ్డి చెప్పారు. ఆగని మృత్యుఘోష సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన భయంతో శని వారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. భవిష్యత్‌పై భయంతో ఓ పదోతరగతి విద్యార్థ్ధి బలవన్మరణానికి పాల్పడగా, గుండెపోటుతో ఏడుగురు చనిపోయారు. వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసి వైద్యశాలకు తరలించే దృశ్యాలను టీవీలో చూస్తూ శనివారం ఉదయం ప్రకాశం జిల్లా కొమరోలు మండలవాసి ముత్యాల వెంగళరెడ్డి (38) ఉద్వేగానికి లోనై కుప్ప కూలి మరణించాడు. సమైక్యఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తూర్పుగోదావరిజిల్లా అనపర్తిమండలం రామవరానికి చెందిన పదోతరగతి విద్యార్థి వి. అప్పాజీ (16) శుక్రవారం రాత్రి అందరూ పడుకున్నాక ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి తిరిగొచ్చిన పిఠాపురం మండలం పి.రాయవరానికి చెందిన సాదే అప్పలరాజు (24)రాత్రి టీవీలో తెలంగాణ పక్రియ కొనసాగుతుందన్న వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దేవునితోటకు చెందిన పెచ్చెట్టి పెద్దిరాజు (60) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి భవిష్యత్‌పై బెంగతో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మరణించాడు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో విభజన వార్తల్ని చూస్తూ ఆందోళనకు గురైన మడతల రాములు (58)శనివారం ఉదయం ప్రాణాలు విడిచాడు. గోపాలపురం మండలం చిట్యా ల గ్రామానికి చెందిన గంగులకుర్తి పుల్లారావు (65) శనివారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని గార్లదిన్నె గ్రామంలో గుండెపోటుతో సమైక్యవాది రాంభూపాల్ (35) శనివారం మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సమైక్యవాది సాకె నాగన్న (55) సంజీవనగర్ కాలనీవాసులు చేపట్టిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళ్లి గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.