రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు.
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు వద్ద ధర్నా నిర్వహించారు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు బైపాస్ రోడ్డులో భారీ ధర్నా చేపట్టారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. కలెక్టరేట్ నుంచి ర్యాలీగా నగరంపాలెంలోని మంత్రి నివాసం వద్దకు చేరుకున్న నేతలను పోలీసులు అడ్డగించారు. తోపులాటలో ఇద్దరు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోగా, వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నేతలందరినీ పోలీసులు అరెస్టుచేసి పట్టాభిపురం స్టేషన్‌కు తరలించారు.
బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో జల దీక్ష చేపట్టారు. వినుకొండలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిపై రాస్తారోకో, వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి కార్యకర్తలతో కలసి ధర్నా చేశారు. చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం నుంచి ఐదురోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణదీక్షకు సంఘీభావంగా పార్టీ కార్యకర్తలు, నేతలు వాడవాడలా పెద్దఎత్తున రిలేదీక్షలు చేపట్టారు.