సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు | jagan record to seemandhra first cm | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు

Published Thu, May 15 2014 3:42 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు - Sakshi

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు

- కేంద్రంలోనూ జగన్ ఆధిపత్యం
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా

 పుంగనూరు, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఫలితాలను బట్టి సీమాంధ్రలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టిస్తారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లతో పలు ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ముస్లిం మైనార్టీలు పూర్తి స్థాయిలో గుణపాఠం కలిగేలా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని తెలిపారు. ముస్లిం మైనార్టీల ఓట్లు స్థానిక సంస్థల్లో లభించిన ఓట్ల శాతం కన్నా అధికంగా వైఎస్సార్ సీపీకి లభించిందని, ఫలితంగా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గల్లంతు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సుమారు 120 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఇరవైకి పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయని తెలిపారు.

జిల్లాలో కుప్పంతో సహా 14 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజంపేట లోక్‌సభ స్థానంలో అత్యధిక మెజార్టీ సాధిస్తామని, కేంద్రంలో సైతం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఆధిపత్యాన్ని చాటుతారని తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌మోహన్‌రెడ్డి అవసరం ఏర్పడుతుందని తెలిపారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయన్నారు.

 రాజశేఖరరెడ్డి కుటుంబంపై రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టనున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీస్సులు వైఎస్సార్ సీపీకే ఉన్నాయన్నారు. అలాంటి ప్రజలకు వైఎస్సార్ సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement