చిత్తూరు: అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పేరంటేనే ఉలిక్కిపడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు రాజకీయంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదని పెద్దిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారని ఆయన చెప్పారు.
ప్రజాసమస్యలపై ప్రతిపక్షం అడిగే.. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం, మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు జగన్‌మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి దిగ జారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం బాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చంద్రబాబుకు ప్రజలు సరైన సమయంలో బుద్దిచెబుతారని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులను నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకోవడం బాబు అవకాశవాద రాజకీయాలకు నిరద్శనమన్నారు.
అధికాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా దోచుకున్న కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేలకు ఎరచూపి టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగులుతోందన్న భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడం కోసం అడ్డదారులు వెతుకుతున్నారని ఆరోపించారు. బాబు చేతనైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు.