
తిరుపతి తుడా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నుంచి సమర శంఖారావం పూరించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు బూత్ కన్వీనర్లు, కమిటీల సభ్యులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. వచ్చే నెల 4న తిరుపతిలో సమర శంఖారావం ప్రారంభమవుతుందని తెలిపారు. సమర శంఖారావం పేరుతో నిర్వహించే జిల్లా స్థాయి సమావేశాల్లో బూత్ కన్వీనర్లు, కమిటీల సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొంటారన్నారు. శంఖారావం సభలను 13 జిల్లాల్లోనూ నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 4న చిత్తూరు, 5న వైఎస్సార్, 6న అనంతపురం జిల్లాల్లో సభలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని జిల్లాల్లో సభలు పూర్తి చేస్తామన్నారు. దేశంలో మరెవరికీ సాధ్యం కాని విధంగా 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో ఉన్న జగన్ నిత్యం ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతు
దేశవ్యాప్తంగా అన్ని సర్వేల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు స్పష్టమైందని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలు సాధించి ప్రధాని ఎంపికలో కీలకపాత్ర పోషిస్తామన్నారు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు వైఎస్సార్‌సీపీ నవరత్నాలను, టీఆర్‌ఎస్ పథకాలను, వివిధ రాష్ట్రాల పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసి 600 హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా మోసగించిన సీఎం ‘మళ్లీ బాబే రావాలి’ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తప్పుడు హామీలతో ప్రజల్ని మరోసారి మోసగించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిజ స్వరూపం తెలిసిన చిత్తూరు జిల్లా ప్రజలు ఏనాడూ ఆయనను నమ్మలేదన్నారు. సొంత ఊరు, నియోజకవర్గంలోనూ ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నైజాన్ని, మోసాన్ని గుర్తించాలని కోరారు. మీడియా సమావేశంలో పోకల అశోక్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, విశ్వనాథం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment