సాక్షి, గుంటూరు:మండల పరిషత్ ఎన్నికల ఫలితాల సరళి వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ఉంది. సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినప్పటికీ సైకిల్‌కు ఫ్యాన్ గట్టి పోటీ ఇచ్చింది. 22 మండలాల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. రెండు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసింది.మంగళవారం ఉదయం జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో బాగా ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా కౌంటింగ్ సిబ్బంది ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. రాత్రి 9 గంటల వరకు ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతూనే ఉన్నాయి. జిల్లాలోని 57 మండలాల్లో 913 ఎంపీటీసీ స్థానాలకు 912 స్థానాల్లో ఎన్నికల ఫలితాలు మంగళవారం రాత్రి వెలువడ్డాయి. సాతులూరులో ఒక స్థానానికి ఎన్నిక జరగలేదు. మొత్తం 887 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, 26 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 469 స్థానాల్లో టీడీపీ గెలుపొందగా, 409 స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యత ప్రదర్శించింది. నాలుగు మండలాల్లో ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి.
అధమస్థానంలో కాంగ్రెస్
రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకును ఆ పార్టీ నేతలు టీడీపీకి బదలాయించారు. సీపీఎంకు మూడు, సీపీఐకు ఓ ఎంపీటీసీ స్థానం దక్కింది. 26 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించారు. మంగళగిరి, నరసరావుపేట నియోజకవర్గాల్లోని మండలాల్లో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మంగళగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు, నరసరావుపేట నియోజకవర్గంలో రెండు మండలాల్ని వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. తాడేపల్లి మండలంలో 13 మండల పరిషత్తు ప్రాదేశిక స్థానాలుండగా, 10 స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుపొందింది. 3 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు గెలుపొందారు. దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలుండగా, 11 స్థానాల్లో వైఎస్సార్ సీపీ, ఆరు చోట్ల టీడీపీ, ఓ స్థానంలో సీపీఎం గెలుపొందాయి. మంగళగిరి మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్ సీపీ, మిత్ర పక్షాలు కలిసి 15 స్థానాలు గెలుపొందాయి. మిగిలిన 10 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది.
నాలుగు మండలాల్లో హంగ్ దిశగా.. నరసరావుపేట రూరల్ మండలంలో 27 స్థానాలకు 17 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించి ఆధిక్యత ప్రదర్శించింది. రొంపిచర్ల మండలంలో 18 స్థానాలకు 12 స్థానాల్ని ఆ పార్టీ గెలుచుకుంది. 22 మండలాల్లో టీడీపీ కంటే వైఎస్సార్ సీపీ ఆధిక్యత కనబర్చి పట్టు సాధించింది. స్థానిక ఎన్నికలు జరిగిన రూరల్ ప్రాంతంలోని 15 నియోజకవర్గాల్లో మంగళగిరి, నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్లలో టీడీపీ కంటే మండలాలను గెలుచుకోవడంలో ముందంజలో ఉండగా, తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర, తెనాలి మండలాలు వైఎస్సార్ సీపీ, టీడీపీ చెరొకటి దక్కించుకున్నాయి. బాపట్ల, పిట్టలవానిపాలెం, ప్రత్తిపాడు, అచ్చంపేట మండలాల్లో హంగ్ దిశగా ఫలితాలు సాగుతున్నాయి.
హోరాహోరీ
Published Wed, May 14 2014 1:40 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement