పంకాదే విజయఢంకా | YSR Congress, TDP clashes mar brisk voting in Seemandhra | Sakshi
Sakshi News home page

పంకాదే విజయఢంకా

Published Thu, May 8 2014 1:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

పంకాదే విజయఢంకా - Sakshi

పంకాదే విజయఢంకా

సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రజల పక్షాన నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న జననేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జిల్లా ఓటర్ల గురి చెక్కు చెదరలేదని, బుధవారం నాటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ‘ఫ్యాన్’ గాలి.. ప్రభంజనంగా ఈవీఎంలలో నమోదైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దివంగత, మహానేత రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జగన్ కొనసాగిస్తారన్న తిరుగులేని విశ్వాసంతో ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపించారని అంచనా. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో తీర్పు ఏకపక్షంగానే వెలువడనుందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల నిరంకుశ పాలన మదిలో   మెదులుతూనే ఉన్న ఓటర్లు ఆయన చేసిన  అమలు కాని వాగ్దానాలను నమ్మలేదు. 2009 ఎన్నికల్లో జిల్లాలో వచ్చిన నాలుగు సీట్లను తిరిగి నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి కష్టతరం కావచ్చు. ఆ పార్టీపై ప్రజల వ్యతిరేకత, సీట్ల కేటాయింపులో చేతులు కాల్చుకున్న వ్యవహారం, రెబల్స్ బెడద తదితర అంశాలు విజయావకాశాలను దెబ్బతీసే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమిని ముందుగానే అంచనా వేసిన ఆ పార్టీ పలు నియోజకవర్గాల్లో బరితెగించి  భయంతో  వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తోంది.
 
 టీడీపీ, ఇతర ప్రత్యర్థుల పోటీ రెండోస్థానం కోసమే..
 తునిలో వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. పార్టీపై వ్యతిరేకతతో పాటు అభ్యర్థి యనమల కృష్ణుడు వ్యవహారశైలి  అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాకు సానుకూలమైంది. టీడీపీకి కంచుకోట అయిన తొండంగి మండలంలో ఆ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకోనుంది. ప్రత్తిపాడులో మూడు కుటుంబాల మధ్య సాగిన  పోరులో ఓటర్లు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పక్షాన నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ తరఫున, అదే కుటుంబం నుంచి పర్వత ప్రసాద్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడంతో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు కలిగిన శంఖవరం మండలంలో ఆ పార్టీ పునాదులు కదిలిపోయాయి. మిగిలిన రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో వైఎస్సార్‌సీపీ హవా స్పష్టంగా కనిపించింది.
 
 జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు భారీ మెజారిటీ తథ్యమని పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్  అభ్యర్థులు చంటిబాబు, తోట రవి రెండో స్థానం కోసం పోటీ పడే పరిస్థితి కనిపించింది. పెద్దాపురం, పిఠాపురంలలో టీడీపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో చంద్రబాబు అనాలోచిత నిర్ణయం ఆ పార్టీ స్థానికేతర అభ్యర్థులు నిమ్మకాయల చినరాజప్ప, పోతుల విశ్వంలకు శరాఘాతంగా మారింది. పిఠాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెండెం దొరబాబుతో టీడీపీ రెబల్ ఎస్‌వీఎస్ వర్మ పోటీ పడ్డప్పటికీ గెలుపును ప్రభావితం చేయలేకపోయారని నేతలు విశ్లేషిస్తున్నారు. టీడీపీ మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్దాపురంలో చినరాజప్పకు తెలుగు తమ్ముళ్ల సహాయ నిరాకరణతో పాటు వైఎస్సార్ సీపీకి అన్ని వర్గాల్లో ఉన్న ఆదరణ ఆ పార్టీ అభ్యర్థి తోట సుబ్బారావునాయుడికి కలిసి వచ్చింది.
 
 కాకినాడ సిటీలో టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు చేసిన హంగామా, కుట్రలు, కుతంత్రాలను ఓటర్లు తిప్పికొట్టి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైపే మొగ్గు చూపారు. కాకినాడ రూరల్‌లోనూ పిఠాపురం పరిస్థితే కనిపించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణు విజయం ఖాయమని, స్వతంత్య్ర అభ్యర్థి కురసాల కన్నబాబు, టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి కేవలం రెండో స్థానం కోసం పోటీ పడతారని అంటున్నారు.
 
 అక్కసుతో బరి తెగించిన తెలుగుతమ్ముళ్లు
 చారిత్రక నగరమైన రాజమండ్రి ఓటర్లు ఈ సారి విలక్షణమైన తీర్పునిచ్చారని విశ్లేషకులు చెపుతున్నారు. టీడీపీ, బీజేపీల పొత్తు, కుమ్మలాటల నేపథ్యంలో సౌమ్యుడైన వైఎస్సార్ సీపీ అభ్యర్ధి బొమ్మన రాజ్‌కుమార్‌కు లాభించింది. చివరి నిమిషంలో సీటు మారిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్ధి ఆకుల వీర్రాజుకు మార్గం సుగమమైన విషయం క్షేత్ర స్థాయిలో ఓటర్ల మనోభావాలను బట్టి స్పష్టమైంది. రెండోసారి గెలుపు తనదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేసిన రాజానగరంలో ఆ పార్టీకి చుక్కెదురైంది. ఓటమి తప్పదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు బరి తెగించి ఒకరిని హతమార్చారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఆ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం జక్కంపూడి విజయలక్ష్మి విజయావకాశాలను మెరుగుపరచింది.
 
 గత ఎన్నికల్లో మహానేత వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్‌కు రికార్డు మెజారిటీనిచ్చిన అనపర్తిలో ఈ సారి వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి బ్రహ్మరథం పట్టేలా ఓటర్లు బారులు తీరారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారని అంచనా.ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలతో ఓటమిని చవిచూసిన రామచంద్రపురంలో ఈ సారి ఓటర్లు వైఎస్సార్ సీపీ పక్షాన నిలిచారు. చొక్కా మార్చినంత సులువుగా పార్టీని మార్చేసిన టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు ఝలక్ ఇచ్చి వైఎస్సార్ సీపీ అభ్యర్థి, వైఎస్ మరణానంతరం ఆ కుటుంబం వెన్నంటి నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు విజయం కట్టబెట్టారని అంచనా వేస్తున్నారు. టీడీపీ ఏకపక్షమని ఆశించిన మండపేటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గిరజాల వెంకట స్వామినాయుడు గట్టి పోటీ ఇచ్చారు. డబ్బు, మద్యం ఏరులై పారించినప్పటికీ టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ముమ్మిడివరంలో  వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుత్తుల సాయి నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. వివిధ వర్గాల ఆదరణ, పలు సామాజిక వర్గాల మద్దతు సాయికి సానుకూలమైందని అంచనా.
 
 కోనసీమలోనూ తిరుగులేని ‘ఫ్యాన్’
 కోనసీమ కేంద్రం అమలాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు, టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. రాజోలులో స్థానికేతర నినాదం, తమ్ముళ్ల సహాయ నిరాకరణతో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుకు చుక్కెదురైంది. అన్ని సానుకూల అంశాలు తోడవడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుకు విజయం ఖాయమైందని టీడీపీ వర్గాలే అంగీకరిస్తుండడం గమనార్హం. హోరాహోరీ పోరు సాగిన పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో లభించే భారీ ఆధిక్యతతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుకు విజయావకాశాలు బలంగా ఉన్నాయని అంచనా.
 
 ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, టీడీపీ అభ్యర్థి పి.నారాయణమూర్తి పోటీ పడేది రెండో స్థానం కోసమేనంటున్నారు. హోరాహోరీ పోరు సాగిన కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై ఉన్న వ్యతిరేకత వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డికి కలిసొచ్చింది. జిల్లాలో ఏకైక ఎస్టీ నియోజకవర్గం రంపచోడవరంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి గిరిజనులు బ్రహ్మరథం పట్టారని విశ్లేషిస్తున్నారు. లోతట్టు గ్రామం నుంచి నిరుపేద అయిన వంతల రాజేశ్వరిని జగన్ ఎంపిక చేయడంతో గిరిజనులు అక్కడి టీడీపీ సీనియర్ నేత శీతంశెట్టి వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం చవి చూపించడం ఖాయమంటున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు కనీసంగా కూడా పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి.
 
 మూడు ఎంపీ స్థానాలూ ‘ఫ్యాన్’ ఖాతాకే..
 ఇక జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ హవా కొనసాగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమలాపురంలో చివరి నిమిషంలో స్థానికేతరుడైన పండుల రవీంద్రబాబును బరిలో దింపి టీడీపీ చేతులు కాల్చుకుందని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సుపరిచితుడైన పినిపే విశ్వరూప్ పార్లమెంటులో అడుగుపెట్టాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకుంటారని అంచనా. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన చలమలశెట్టి సునీల్‌కు ఈసారి భారీ ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. చివరి నిమిషంలో పార్టీ మారి ‘సైకిల్’ ఎక్కిన తోట నరసింహంకు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని, ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు రెండో స్థానం కోసం పోటీ పడ్డారని అంచనా. రాజమండ్రిలో ఈ సారి గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న  టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌కు మరోసారి భంగపాటు తప్పదంటున్నారు. గత ఎన్నికల్లో మురళీమోహన్ ఓటమికి కారణమైన అనపర్తిలో మరోసారి గత చరిత్రే పునరావృతం కానుంది.  అనపర్తితో పాటు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొడ్డు వెంకట రమణ చౌదరి విజయతీరాలకు చేరుకోవడం ఖాయమని పోలింగ్ సరళిని బట్టి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement