సాక్షి నెట్‌ర్క్: తెలుగుప్రజలంతా కలిసే ఉందామంటూ సీమాంధ్రలో ఎగసిన సమైక్య ఉద్యమం సమధికోత్సాహంతో ముందుకు సాగుతోంది. కోస్తా, రాయలసీమజిల్లాల ప్రజలు వివిధ రీతుల్లో సమైక్య భావనలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేర్పాటువాదులపై ఆగ్రహావేశాలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇరవైఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా నడుస్తున్న సమైక్యపోరు శనివారం కూడా ఉవ్వెత్తున సాగింది. పదమూడు రోజులుగా సకల జనుల సమ్మె చేపట్టిన అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఉద్యమ కారులతో కలసి రోడ్డెక్కుతున్నారు.
సమ్మెలోకి డెప్యూటీకలెక్టర్లు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆడిట్, డీఆర్‌డీఏ, ఐకేపీ, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నిరవధిక సమ్మెలోకి డెప్యూటీ కలెక్టర్లు కూడా చేరడంతో జిల్లా రెవెన్యూ అధికారి కె. ప్రభాకరరావు, డెప్యూటీ కలెక్టర్లు శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా అధికారుల సంఘం ఆధ్యక్షుడు డీఆర్వో హేమసాగర్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. పీఆర్ ఉద్యోగులు అర గుండుతో నిరసన తెలిపారు. కర్నూలు నగరంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ముట్టడించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు.
కలెక్టర్, జేసీ మినహా అందరూ ఆందోళనల్లోనే..
ప్రకాశంజిల్లా ఒంగోలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా జిల్లాఉన్నతాధికారులందరూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొ న్నా రు. డీఆర్‌ఓ రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ గంగాధర్ గౌడ్, డీపీఓ శ్రీదేవి, ఆర్‌డీఓ మురళి, డీఆర్‌డీఏ పీడీ పద్మజ తదితరులు నగరంలో వివిధసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో జిల్లా అధికారులు శనివారంనుంచి సమ్మె కు దిగడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద రెవెన్యూఉద్యోగులు చేపట్టిన నిరాహారదీక్షల శిబిరంలో ఏజేసీ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, డీఆర్‌ఓ నూర్ బాషాఖాసిం, డ్వామా తదితర శాఖల ఉన్నతాధికారులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏజేసీ రాజ్‌కుమార్ డప్పు వాయించారు.
సమైక్యఉద్యమ దీక్షలో ఖమ్మం వాసి
సమైక్య ఉద్యమ దీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన జి.సిగడాం తహశీల్దార్ టి.నర్సయ్య పాల్గొన్నారు. సమైక్యతే తనవాదమని, విభజన వల్ల అభివృద్ధి ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇతర అధికారులు సమ్మెలో ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కుమార్ హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుండగా సమైక్యవాదులు కలెక్టరేట్‌లోని ఆయన గది ఎదుట డప్పులు వాయించి నిరసన తెలిపారు.పెద్దాపురం కోర్టు ఆవరణ వద్ద న్యాయవాదులు 50 గంటల నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చీపుర్లతో రోడ్డు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల వినూత్ననిరసన
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు భీక్షాటన చేయాల్సి వస్తుం దని తెలుపుతూ ఆర్టీసీ ఉద్యోగులు విజయనగరం జిల్లాలో పలువురు ఒంటికి ఆకులు చుట్టుకుని అర్ధనగ్నంగా యాచి స్తూ నిరసనర్యాలీ నిర్వహించారు. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు, కేంద్రాస్పత్రిలో వైద్య ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యద్రోహులు సోనియా, దిగ్విజయ్, బొత్స, కేసీఆర్ మాస్కుల ధరించిన వారికి బేడీలు వేసి ప్రజాకోర్టు ఎదుట దోషులుగా నిలి పారు. ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి బొత్స ఇంటికి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి పత్రాలు అంద జేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, అల్లె ప్రభావతి పట్టణంలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. చిత్తూరులో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో కలసి ఆందోళన చేపట్టారు.
చిన్నారుల నిరాహారదీక్ష
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని జంగిల్ బెల్స్ పబ్లిక్ స్కూల్ చిన్నారులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. భీమవరంలో విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది విద్యార్థు లు అల్లూరి సీతారామరాజు వే షధారణలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా మొత్తం లక్ష నినాదాలు చేశారు.
యువకుల రక్తదానం: నరసాపురంలో ఆచరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. కొవ్వూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు, నాయకులు పరిమి హరిచరణ్ సంఘీభావం తెలిపారు.
డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో డాక్టర్ల ర్యాలీ
బుట్టాయగూడెంలో డీఎంహెచ్‌వో టి.శకుంతల ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పెనుగొండలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో రైతులు సీమాంధ్ర కేంద్ర మంత్రులను పురుగులతో పోలుస్తూ రూపొందించిన ఫ్లెక్సీలను వరిచేలల్లో ఏర్పాటుచేసి పురుగుమందు పిచికారీ చేసి నిరసన తెలిపారు. పాలకొల్లులో మాజీ ఎంపీ జోగయ్య ఆధ్వర్యంలో పాడిగేదెకు వినతిపత్రం అందజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఏయూలోని విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించగా, ఏపీఎన్జీవో సభ్యులు ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎన్జీవోస్ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో ప్రదర్శన చేపట్టారు.
సోనియాను మీ దేశానికి తీసుకుపోండి
ఇటలీ అధ్యక్షునికి చెవిరెడ్డి లేఖలు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని వెంటనే తమ దేశానికి పిలిపించుకోవాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇటలీ అధ్యక్షునికి, ప్రధానికి లేఖలు రాశారు. శనివారం తుమ్మల గుంటలోని వైఎస్‌ఆర్ విగ్రహం కూడలి వద్ద లేఖలు రాసి ఇటలీకి పంపించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, తమ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ లేఖలను పంపుతున్నట్లు తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ భారత దేశాన్ని నాశనం చేస్తున్నారని, విభజన పేరుతో తెలుగుప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఆమె కారణంగా భారత దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని, వీలైనంత త్వరగా ఆమెను వారి దేశానికి తీసుకుపోవాలని సూచించినట్టు చెవిరెడ్డి చెప్పారు.
ఆగని మృత్యుఘోష
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన భయంతో శని వారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. భవిష్యత్‌పై భయంతో ఓ పదోతరగతి విద్యార్థ్ధి బలవన్మరణానికి పాల్పడగా, గుండెపోటుతో ఏడుగురు చనిపోయారు. వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసి వైద్యశాలకు తరలించే దృశ్యాలను టీవీలో చూస్తూ శనివారం ఉదయం ప్రకాశం జిల్లా కొమరోలు మండలవాసి ముత్యాల వెంగళరెడ్డి (38) ఉద్వేగానికి లోనై కుప్ప కూలి మరణించాడు. సమైక్యఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తూర్పుగోదావరిజిల్లా అనపర్తిమండలం రామవరానికి చెందిన పదోతరగతి విద్యార్థి వి. అప్పాజీ (16) శుక్రవారం రాత్రి అందరూ పడుకున్నాక ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శుక్రవారం సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి తిరిగొచ్చిన పిఠాపురం మండలం పి.రాయవరానికి చెందిన సాదే అప్పలరాజు (24)రాత్రి టీవీలో తెలంగాణ పక్రియ కొనసాగుతుందన్న వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దేవునితోటకు చెందిన పెచ్చెట్టి పెద్దిరాజు (60) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి భవిష్యత్‌పై బెంగతో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మరణించాడు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో విభజన వార్తల్ని చూస్తూ ఆందోళనకు గురైన మడతల రాములు (58)శనివారం ఉదయం ప్రాణాలు విడిచాడు. గోపాలపురం మండలం చిట్యా ల గ్రామానికి చెందిన గంగులకుర్తి పుల్లారావు (65) శనివారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని గార్లదిన్నె గ్రామంలో గుండెపోటుతో సమైక్యవాది రాంభూపాల్ (35) శనివారం మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సమైక్యవాది సాకె నాగన్న (55) సంజీవనగర్ కాలనీవాసులు చేపట్టిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళ్లి గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
సమరోత్సాహంతో సమైక్యఉద్యమం
Published Sun, Aug 25 2013 4:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement