విభజిస్తే విపరిణామాలే | seemandhra bundh goes in a big way | Sakshi
Sakshi News home page

విభజిస్తే విపరిణామాలే

Published Sun, Aug 11 2013 12:25 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

విభజిస్తే విపరిణామాలే - Sakshi

విభజిస్తే విపరిణామాలే

 ఏదేమైనా... ఎందాకైనా... ప్రాణాలైనా అర్పిస్తాం కానీ రాష్ట్ర విభజనను మాత్రం అంగీకరించేదిలేదంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది. రాష్ర్టం విడిపోతే ప్రాంతాలకతీతంగా అంతటా విపరిణామాలే చోటుచేసుకుంటాయని తెగేసి చెబుతోంది. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపైనా, వేర్పాటును వ్యతిరేకించకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న టీడీపీపై శివాలెత్తుతోంది.    -సాక్షి నెట్‌వర్క్
 
 సమైక్యాంధ్రప్రదేశ్‌నే కొనసాగించాలంటూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉద్యమం దశదిశలా వెల్లువలా సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు శనివారం కూడా హోరెత్తాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి  ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాలన్నీ నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇక సోనియాగాంధీ, రాహుల్, దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, బొత్స, కేసీఆర్‌ల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు సీమాంధ్ర జిల్లాల్లో వాడవాడలా కొనసాగుతున్నాయి.
 
 ఫిషింగ్ హార్బర్ బంద్
 సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో శనివారం బంద్ పాటించారు. వందలాదిమంది మత్స్యకారులు ర్యాలీగా జగదాంబ కూడలికి తరలివచ్చి మానవహారంగా ఏర్పడి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గాజువాకలో ఉక్కు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. అనకాపల్లిలో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, మోటార్ మెకానిక్‌లు, మహిళలు, భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అచ్యుతాపురం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సెజ్ ఉద్యోగులు, ఆటో కార్మికులు రాస్తారోకో నిర్వహించి, వాహనాలను నిలిపేశారు.
 
 వికలాంగుల రాస్తారోకో
 విశాఖ మద్దిలపాలెం కూడలిలో వికలాంగుల జేఏసీ రాస్తారోకో చేపట్టింది. ప్రకాశం జిల్లాలో పర్చూరులో  వైఎస్సార్‌సీపీ నేత గొట్టిపాటి నరసయ్య తనయుడు భరత్ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
 
 మంత్రి తోట సతీమణి నిరవధిక నిరాహార దీక్ష
 వేర్పాటు ప్రకటనను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్‌లో రాష్ర్ట మంత్రి తోట నరసింహం భార్య, వీరవరం సర్పంచ్ సరస్వతి (వాణి) శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
 
 మంత్రుల ఇళ్లు ముట్టడి
 మంత్రి పదవికి రాజీనామా చేయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య తీరును నిరసిస్తూ ఆందోళనకారులు వైఎస్‌ఆర్ జిల్లా కడపలోని ఆయన ఇంటి గేటుకు   గాజులు, పూలు తగిలించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. బయటకు వచ్చిన మంత్రి ఉపాధ్యాయులతో కలిసి  ర్యాలీలో పాల్గొన్నారు.
 
 క్రీడాకారుల ర్యాలీ
 కడపలో క్రీడాకారులు, క్రీడాభిమానులు ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణనిరాహారదీక్ష ఆరోరోజుకు చేరింది. పులివెందులలో భవననిర్మాణ కార్మికులు, ప్రైవేటు డాక్టర్లు నిర్వహించిన ర్యాలీలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.
 
 నేటి నుంచి అనంతలో 48గంటలు బంద్
 కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆదివారం నుంచి 48 గంటల అనంతపురం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
 
 ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శన
 అనంతపురం నగరంలో రామ్‌నగర్ ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. గుంతకల్లు పట్టణంలో దాదాపు 150 డీజిల్ ఆటోలతో ర్యాలీ, వంటా-వార్పు చేపట్టారు. హిందూపురంలో విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ర్యాలీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు
 
 ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగుల ప్రదర్శన, ట్రాన్స్‌కో ఉద్యోగుల దీక్ష
 మునిసిపల్ ఉద్యోగులు అనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించడంతో పాటు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కదిరిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఉరవకొండలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
 
 వికలాంగుల ర్యాలీ
 తిరుపతి బర్డ్ ఆసుపత్రి నుంచి వికలాంగ రోగులు, వారి కుటుంబీకులు టీటీడీ పరిపాలనా భవనం వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిర్వహించిన మహాధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పుంగనూరులో నిర్వహించిన రిలేదీక్షల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
 
 రజకుల వినూత్న నిరసన
 గుంటూరులో రజకజన సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపై ఇస్త్రీ బండ్లు పెట్టి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రజక సంఘం ఆధ్యర్యంలో సమైక్యాంధ్ర పోరాటంలో పాల్గొనని నేతలకు చాకిరేవు పెట్టారు. ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిపై వ్యాపారుల జేఏసీ చేపట్టిన రాస్తారోకోతో హైవేపై వేలాది వాహనాలు నిలిచిపోయూరుు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు.  నెల్లూరు నగరంలో ఎన్జీవోలు భారీ ప్రదర్శన చేపట్టారు.
 
 సోనియా, రాహుల్, కేసీఆర్ బొమ్మలకు సర్పదండన
 సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను పాములతో కాటువేయించి సర్పదండన శిక్ష విధించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీని  ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకున్నారు.   ఉపాధ్యాయ ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా పట్టణంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు.  చీపురుపల్లిలో  విశ్వబ్రహ్మణుల సంఘం ఆధ్వర్యంలో  మూడురోడ్ల జంక్షన్‌లో కర్రలు కోస్తూ నిరసన  వ్యక్తం చేశారు. గజపతినగరంలో  నాలుగురోడ్ల జంక్షన్ వద్ద నాయీబ్రాహ్మణులు రోడ్డుపైనే క్షౌరవృత్తి చేసి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కురువ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి నుంచి ఎన్‌టీఆర్ విగ్రహం వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం  జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఉద్యోగులు  దండోరా కార్యక్రమం నిర్వహించారు.
 
 అన్నదాతల నిరసన
 కృష్ణాజిల్లా గుడివాడలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.  వందకుపైగా ఎడ్లబండ్లతో చల్లపల్లిలో ర్యాలీ,  జగ్గయ్యపేటలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. మచిలీపట్నం-చల్లపల్లి 216 జాతీయ రహదారిపై మూడు వేల మందికిపైగా ప్రజలు, కార్మికులు 4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై నడుచుకుంటూ ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన పాలకుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి, గౌరవఅధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు చేసిన రాజీనామాలను బెజవాడ ప్రజలు హర్షించారు. జగన్, విజయమ్మలకు జేజేలు పలుకుతూ సమైక్యవాదులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
 
 నేడు సీమాంధ్రలో రైల్‌రోకో
 సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్
 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆదివారం సీమాంధ్ర జిల్లాల్లో రైల్‌రోకోలు నిర్వహించాలని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధన కోసం సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకే రైల్‌రోకో చేపడుతున్నట్లు చెప్పారు. ఉదయం 6గంటల నుంచే ఎక్కడికక్కడ రైళ్లను ఆపివేయాలని విద్యార్థి, రాజకీయ జేఏసీ, ప్రజా సంఘాలనేతలకు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement