samikhyandhra bandh
-
బాపూజీ బాటలో.. సమైక్య స్ఫూర్తితో..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలిపారు. మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకున్నారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్న గాంధీ బోధనలను అనుసరిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరికొంత మంది నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె 64వ రోజుకు చేరుకొంది. సాధారణ ప్రజలతోపాటు ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. జాతీయ నాయకుల వేషధారణలతో చేపట్టిన నిరసనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రక్తదాన శిబిరం.. మౌన ప్రదర్శనలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. 55 మంది రక్తదానం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నగరంలో శాంతి ర్యాలీ చేశారు. రెవెన్యూ కాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసనకారులు మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే రీతిలో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పంచాయతీ విభాగం అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హయ్యర్ బస్సు అడ్డగింత: అద్దంకి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర నిరసనల జోరు కొనసాగింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 45వ రోజుకు చేరుకున్నాయి. వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు రిలే దీక్షలకు దిగారు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆ సమయంలో నరసరావుపేట నుంచి అద్దంకి డిపోకు హయ్యర్ బస్సు రావడంతో దానిని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగితే బస్సును ఎలా నడుపుతారంటూ నిలదీశారు. మరోమారు తిరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బల్లికురవలో సమైక్యాంధ్ర సాధనకు పాదయాత్ర నిర్వహించారు. టెన్నిస్ క్రీడాకారుల దీక్షలు: గిద్దలూరులో సమైక్య నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గిద్దలూరు టెన్నిస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 మంది టెన్నిస్ క్రీడాకారులు రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దళితులు రిలే దీక్షలు చేపట్టారు. దళిత క్రిష్టియన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సాధనలో భాగంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కొండపి, మర్రిపూడి ప్రాంతాల్లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దర్శిలో ఉద్యోగస్తులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటిం చారు. మార్కాపురంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అంగన్వాడీలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలం టూ ముగ్గులు వేశారు. ఆర్టీసీ కార్మికులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. -
ఉద్యోగుల గర్జన
సాక్షి, తిరుపతి: ఉద్యమం మహోద్యమంగా మారుతోంది. రోజుకో కార్యక్రమంతో సమైక్యవాదులు వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరులో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 5వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. తిరుపతిలో వెటర్నరీ కళాశాలలో ముగ్గులువేసి నిరసన తెలిపారు. టీటీడీ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు శాప్స్ ఆధ్వర్యంలో రోడ్డుపై మాక్ స్కూల్ నిర్వహించారు. పుత్తూరులో ప్రభుత్వ వైద్యులు రోగులకు రోడ్డుపైనే వైద్యసేవలందిస్తూ నిరసన తెలిపారు. ఏపీ ఎన్జీవో, ఆర్టీసీ, అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయ ఉద్యోగులు రిలేదీక్షలు కొనసాగించారు. వీరికి పలువురు మద్దతు పలికారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మౌనప్రదర్శన నిర్వహించారు. పుత్తూరు బాలికల, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగులు రాత్రి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పలమనేరులో వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల ర్యాలీ నిర్వహించి రిలేదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి మాక్‌డ్రిల్ చేశారు. న్యాయవాదులు చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లెలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, వంటావార్పు చేపట్టారు. గంగవర ం మండలం పొనబాకులపల్లె వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలు, వంటావార్పు నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జేఏసీ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు, ఎద్దులబండి సంఘం, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగించారు. రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. జాతీయ పతాకంతో నిరసన బి.కొత్తకోటలో మోకాళ్లపై నిరసన తెలిపారు. ములకలచెరువులో 200 మీటర్లు, పుంగనూరులో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో మండలి బుద్దప్రసాద్ పాల్గొన్నారు. పౌరాణిక వేషధారణలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థులు, వివిధ సంఘాల ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. మదనపల్లెలో కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సుమారు 4వేల మందితో ర్యాలీ నిర్వహించారు. గ్రానైట్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ, సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరవధిక దీక్ష, బీటీ కళాశాల వద్ద అధ్యాపకులు, సిబ్బంది రిలేదీక్షలు చేస్తున్నారు. యాదవ, కురవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. క్రైస్తవ ఐక్యసంఘం ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పీలేరులో టీటీడీ బోర్డు సభ్యుడు జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఎంజేఆర్ ఇంజనీరింగ్, వివిధ ప్రైవేటు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో సాయంత్రం దాకా వీధినాటకం, రాత్రి ఆర్కేస్ట్రా నిర్వహించి నిరసన తెలిపారు. సత్యవేడులో ఉపాధ్యాయులు భారీ మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఆటో డ్రైవర్లు రోడ్డుపై కబడ్డీ ఆడి రిలేదీక్షలు చేశారు. పెరుమాళ్లపల్లె బాలాజీ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో ‘జె సమైక్యాంధ్ర’ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పుంగనూరులో వీరసేవ లింగాయతుల ఆధర్యంలో భారీ ర్యాలీ, రుద్రహోమం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, రిలే దీక్షలు చేశారు. -
జగన్ దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన
-
జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు వెల్లువెత్తిన సంఘీభావం
సాక్షి, నెట్వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సమైక్యవాదులు ఆమరణ దీక్షలకు దిగారు. అనేకచోట్ల రిలే నిరాహారదీక్షలు, మద్దతుగా ర్యాలీలు, మావనహారాలు జరిగాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజవర్గ సమన్వయకర్త షమీమ్ అస్లాం జగన్ దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ, మదనపల్లె నియోజకవర్గ సమన్వకర్త దేశాయి తిప్పారెడ్డి చేపట్టిన దీక్షలకు రాజంపేట పార్లమెంటు నియోజవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మద్దతు పలికారు. చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో రాజా, సయ్యద్ సర్దార్, కమలాక్షి సాయిసుజిత్, మధుసూదన్‌రాయల్, కేకే.రవి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. సత్యవేడులో వైఎస్సార్ వుండల కన్వీనర్ కె.నిరంజన్‌రెడ్డి ఆవురణదీక్ష చేపట్టారు. పుంగనూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మద్దతు పలికారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త పుణ్యమూర్తి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీలేరు సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకిపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరిలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ ఆధ్వర్యంలో రాస్తాకోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ సమన్వయకర్త, మాజీమంత్రి మహమ్మద్ షాకీర్తోపాటు రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మాధురి రాజారెడ్డి, రజనీష్కుమార్రెడ్డి, రమణారెడ్డి, అల్లాబక్ష్ ఆమరణ దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎల్ఎం మోహన్‌రెడ్డి, ఒంటిమిద్ది కిరీటియాదవ్, గుంతకల్లులో ఏపీఎస్సార్టీసీ రాష్ట్రీయ మజ్దూర్ యూనియన్ డిపో గౌరవాధ్యక్షుడు ఎండీ సందీప్‌రెడ్డి, వై.సుధాకర్, మహమ్మద్ రఫీక్, బి.రాము, వినోద్‌కుమార్‌రెడ్డి ఆమరణ దీక్షలు చేపట్టారు. కడప కలెక్టరేట్ వద్ద 55 మంది ముస్లింలు ప్రారంభించిన దీక్షలకు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు,మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, జిల్లా మున్సిపల్ పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్లో మహిళలు చేపట్టిన దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలి సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ యువ నాయకుడు జక్కంపూడి రాజా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ మలికిపురం కళాశాల కూడలి వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో రెండు గంటల పాటు జలదీక్ష చేశారు. ఆలమూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి రిలేదీక్ష చేపట్టారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన రిలే దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అమలాపురం హైస్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రిలే దీక్షా శిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రారంభించారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేతృత్వంలో బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు పగటివేషాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ద్వారకాతిరుమలతో నిర్బంధ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ చలమోలు అశోక్‌గౌడ్ అధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తీన్మార్ వాయిద్యాలతో, మోటారు సైకిళ్లతో దెందులూరు, ఏలూరు, పెదపాడు మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ రాజబాబు తగరపువలసలో, పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషా నర్సీపట్నంలో ఆమరణ దీక్షలు చేపట్టారు. తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో పాతగాజువాకలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. చోడవరంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నాయకుడు బండారు సత్యనారాయణ రిలే దీక్షలు ప్రారంభించారు. చోడవరం, రోలుగుంట మండలాల యువజన విభాగం అధ్యక్షులు అల్లం రామ అప్పారావు, బండారు శ్రీనివాసరావు, గుడాల ప్రవీణ్‌కుమార్, కార్లె గీతాకృష్ణ, కొల్లి మురళీకృష్ణ దీక్షలో కూర్చున్నారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త సీక రి సత్యవాణి ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామదేవత అసిరమ్మ తల్లికి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు ఆధ్వర్యంలో మహిళలు ముర్రాటలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. రాజాం, రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజె బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మైలవరంలో నిరవధిక నిరాహార దీక్షను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ప్రారంభించారు. జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. విజయవాడ ఐఎంఏ హాల్ వద్ద వైఎస్సార్ సీపీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఎన్ఎస్సీ బోస్‌నగర్‌లో విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు. పెడనలో పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. నడుపూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు ప్రారంభమయ్యాయి. గుంటూరులో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు నసీర్ అహ్మద్, షేక్ షౌకత్ ఆధ్వర్యంలో శంకర్ విలాస్సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయగిరిలో దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తాటి వెంకటేశ్వర్లు, కేవీ రాఘవరెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మానవహారం నిర్వహించడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పు చేశారు. సంతనూతలపాడులో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యంలో రోడ్డుపైనే వైద్యశిబిరం నిర్వహించారు. సమైక్యతతోనే సంక్షేమం : దాడి విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఆంధ్ర, తెలంగాణ , రాయలసీమ ప్రాంతాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా తగరపువలసలో వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికైనా విభజనకు వ్యతిరేకమని చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ ఇచ్చి యాత్రలు చేపడితే తామే ఆహ్వానిస్తామన్నారు. దీక్షాదక్షుడు జగన్ : భూమన సాక్షి, తిరుపతి: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే దీక్షాదక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా ఆదివారం తిరుపతి తుడా కార్యాలయం సమీపంలోని కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. గిరిజన లంబాడీ మహిళలు నృత్యం చేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ లక్ష్య దీక్ష, జల దీక్ష, ఫీజు పోరు, పోరు దీక్ష, కదనరంగం లాంటి కార్యక్రమాలను గతంలో పెద్దఎత్తున చేపట్టిన జగన్మోహన్రెడ్డి, ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. -
మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర జిల్లాలు ఆదివారం నాడూ మార్మోగాయి. ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు కలెక్టరేట్ వర కు ర్యాలీ తీశారు. కొత్తపేట పాతబస్టాండ్ వద్ద హాస్టల్ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఏలేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాదచారులకు, ప్రయాణికులకు పువ్వులు పంచుతూ నిరసన తెలి పారు. ముమ్మిడివరంలో రజకులు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తాపేశ్వరంలో వ్యవసాయ అధికారులు, రైతుమిత్ర సంఘాలు, రైతులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. తుని, పెద్దాపురం పట్టణాల్లో క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో ఇంద్రజాలికుడు చారి కళ్లకు గంతలు కట్టుకుని వాహనం నడుపుతూ నిరసన ర్యాలీ చేశారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీల వేషధారణలో ఉన్న వ్యక్తులు సోనియా వేషధారిణి చుట్టూ చెక్కభజన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మునిసిపల్ ఉపాధ్యాయులు గొడుగులతో నిరసన ర్యాలీ చేయగా.. మునిసిపాలిటీ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని సమైక్యనినాదాన్ని వినిపించారు. అనంతపురం ఎస్కేయూ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆర్యవైశ్య సంఘం, ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయుల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. చీరాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మైనింగ్ కార్యాలయాలకు తాళాలు వేసి, విధులు బహిష్కరించాలని సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల మైనింగ్ శాఖ అధికారులు గుంటూరులో తీర్మానించారు. విజయవాడ దుర్గగుడి ఉద్యోగులూ సమైక్యం కోసం ఆందోళనబాట పట్టారు. జగ్గయ్యపేటలో బోనాలు సమర్పించి మహిళలు నిరసన వ్యక్తంచేశారు. శ్రీకాకుళంలో జెడ్పీ,రెవెన్యూ, పురపాలక సంఘ ఉద్యోగులు దీక్షల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రోడ్డుపై కూర్చొని ఐదు లక్షల సార్లు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ కాగితాలపై రాసి 1500 మంది విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. విస్సాకోడేరులో సెయింట్జాన్ స్కూల్ విద్యార్థులు మోకాళ్లపై నిలబడి జాతీయ జెండా చేతబూని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనతో కలిగే నష్టాలను వివరిస్తూ కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు, ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ పంపారు. ఆళ్లగడ్డలో జేఏసీ నేతలు మోకాళ్లతో నడిచి నిరసన వ్యక్తం చేశారు. మరో 12 మంది మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయంపై కలత చెంది శనివారం రాత్రి, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు, తూర్పులో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాజాలు వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు(55), పాము మాణిక్యం(68), కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన శ్రీనివాస్(45) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరానికి చెందిన కోటిచుక్కల నాగరాజు(36) టీవీలో విభజన వార్తలు చూస్తూ ప్రాణాలు వదిలాడు. నరసాపురం రుస్తుంబాద మెరకగూడెంకు చెందిన డ్వాక్రా సభ్యురాలు సావిత్రి(65) విభజన వార్తలతో కొద్దిరోజులుగా దిగులుగా ఉన్న ఆమె మృతిచెందింది. పెరవలి మండలం గవర్లపాలెంకు చెందిన రాంబాబు (23), నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో షేక్ మస్తాన్ (50) గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి వీఆర్ఏ తుడుం రమణ(42), చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన మునస్వామి(51), కర్నూలుజిల్లా జూపాడుబంగ్లా మం డలం లింగాపురానికి చెందిన వెంకటలక్ష్మయ్య(45) టీవీల్లో వీక్షిస్తూ గుండెపోటుతో మరణించాడు. కొత్తపల్లి మండలం జి.వీరాపురానికి చెందిన శివుడు(37) గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం ఎండమూరుకు చెందిన నాగమణి గుండెపోటుతో మృతిచెందింది. -
సమరోత్సాహంతో సమైక్యఉద్యమం
సాక్షి నెట్‌ర్క్: తెలుగుప్రజలంతా కలిసే ఉందామంటూ సీమాంధ్రలో ఎగసిన సమైక్య ఉద్యమం సమధికోత్సాహంతో ముందుకు సాగుతోంది. కోస్తా, రాయలసీమజిల్లాల ప్రజలు వివిధ రీతుల్లో సమైక్య భావనలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేర్పాటువాదులపై ఆగ్రహావేశాలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇరవైఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా నడుస్తున్న సమైక్యపోరు శనివారం కూడా ఉవ్వెత్తున సాగింది. పదమూడు రోజులుగా సకల జనుల సమ్మె చేపట్టిన అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఉద్యమ కారులతో కలసి రోడ్డెక్కుతున్నారు. సమ్మెలోకి డెప్యూటీకలెక్టర్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆడిట్, డీఆర్డీఏ, ఐకేపీ, ఆర్అండ్బీ, విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నిరవధిక సమ్మెలోకి డెప్యూటీ కలెక్టర్లు కూడా చేరడంతో జిల్లా రెవెన్యూ అధికారి కె. ప్రభాకరరావు, డెప్యూటీ కలెక్టర్లు శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా అధికారుల సంఘం ఆధ్యక్షుడు డీఆర్వో హేమసాగర్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. పీఆర్ ఉద్యోగులు అర గుండుతో నిరసన తెలిపారు. కర్నూలు నగరంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ముట్టడించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్, జేసీ మినహా అందరూ ఆందోళనల్లోనే.. ప్రకాశంజిల్లా ఒంగోలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా జిల్లాఉన్నతాధికారులందరూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొ న్నా రు. డీఆర్ఓ రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ గంగాధర్ గౌడ్, డీపీఓ శ్రీదేవి, ఆర్డీఓ మురళి, డీఆర్డీఏ పీడీ పద్మజ తదితరులు నగరంలో వివిధసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో జిల్లా అధికారులు శనివారంనుంచి సమ్మె కు దిగడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద రెవెన్యూఉద్యోగులు చేపట్టిన నిరాహారదీక్షల శిబిరంలో ఏజేసీ ఆర్ఎస్ రాజ్‌కుమార్, డీఆర్ఓ నూర్ బాషాఖాసిం, డ్వామా తదితర శాఖల ఉన్నతాధికారులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏజేసీ రాజ్‌కుమార్ డప్పు వాయించారు. సమైక్యఉద్యమ దీక్షలో ఖమ్మం వాసి సమైక్య ఉద్యమ దీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన జి.సిగడాం తహశీల్దార్ టి.నర్సయ్య పాల్గొన్నారు. సమైక్యతే తనవాదమని, విభజన వల్ల అభివృద్ధి ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇతర అధికారులు సమ్మెలో ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కుమార్ హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుండగా సమైక్యవాదులు కలెక్టరేట్లోని ఆయన గది ఎదుట డప్పులు వాయించి నిరసన తెలిపారు.పెద్దాపురం కోర్టు ఆవరణ వద్ద న్యాయవాదులు 50 గంటల నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చీపుర్లతో రోడ్డు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల వినూత్ననిరసన రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు భీక్షాటన చేయాల్సి వస్తుం దని తెలుపుతూ ఆర్టీసీ ఉద్యోగులు విజయనగరం జిల్లాలో పలువురు ఒంటికి ఆకులు చుట్టుకుని అర్ధనగ్నంగా యాచి స్తూ నిరసనర్యాలీ నిర్వహించారు. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు, కేంద్రాస్పత్రిలో వైద్య ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యద్రోహులు సోనియా, దిగ్విజయ్, బొత్స, కేసీఆర్ మాస్కుల ధరించిన వారికి బేడీలు వేసి ప్రజాకోర్టు ఎదుట దోషులుగా నిలి పారు. ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి బొత్స ఇంటికి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి పత్రాలు అంద జేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, అల్లె ప్రభావతి పట్టణంలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. చిత్తూరులో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో కలసి ఆందోళన చేపట్టారు. చిన్నారుల నిరాహారదీక్ష పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని జంగిల్ బెల్స్ పబ్లిక్ స్కూల్ చిన్నారులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. భీమవరంలో విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది విద్యార్థు లు అల్లూరి సీతారామరాజు వే షధారణలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా మొత్తం లక్ష నినాదాలు చేశారు. యువకుల రక్తదానం: నరసాపురంలో ఆచరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. కొవ్వూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు, నాయకులు పరిమి హరిచరణ్ సంఘీభావం తెలిపారు. డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో డాక్టర్ల ర్యాలీ బుట్టాయగూడెంలో డీఎంహెచ్‌వో టి.శకుంతల ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పెనుగొండలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో రైతులు సీమాంధ్ర కేంద్ర మంత్రులను పురుగులతో పోలుస్తూ రూపొందించిన ఫ్లెక్సీలను వరిచేలల్లో ఏర్పాటుచేసి పురుగుమందు పిచికారీ చేసి నిరసన తెలిపారు. పాలకొల్లులో మాజీ ఎంపీ జోగయ్య ఆధ్వర్యంలో పాడిగేదెకు వినతిపత్రం అందజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఏయూలోని విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించగా, ఏపీఎన్జీవో సభ్యులు ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎన్జీవోస్ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో ప్రదర్శన చేపట్టారు. సోనియాను మీ దేశానికి తీసుకుపోండి ఇటలీ అధ్యక్షునికి చెవిరెడ్డి లేఖలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని వెంటనే తమ దేశానికి పిలిపించుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇటలీ అధ్యక్షునికి, ప్రధానికి లేఖలు రాశారు. శనివారం తుమ్మల గుంటలోని వైఎస్ఆర్ విగ్రహం కూడలి వద్ద లేఖలు రాసి ఇటలీకి పంపించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, తమ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ లేఖలను పంపుతున్నట్లు తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ భారత దేశాన్ని నాశనం చేస్తున్నారని, విభజన పేరుతో తెలుగుప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఆమె కారణంగా భారత దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని, వీలైనంత త్వరగా ఆమెను వారి దేశానికి తీసుకుపోవాలని సూచించినట్టు చెవిరెడ్డి చెప్పారు. ఆగని మృత్యుఘోష సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన భయంతో శని వారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. భవిష్యత్‌పై భయంతో ఓ పదోతరగతి విద్యార్థ్ధి బలవన్మరణానికి పాల్పడగా, గుండెపోటుతో ఏడుగురు చనిపోయారు. వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసి వైద్యశాలకు తరలించే దృశ్యాలను టీవీలో చూస్తూ శనివారం ఉదయం ప్రకాశం జిల్లా కొమరోలు మండలవాసి ముత్యాల వెంగళరెడ్డి (38) ఉద్వేగానికి లోనై కుప్ప కూలి మరణించాడు. సమైక్యఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తూర్పుగోదావరిజిల్లా అనపర్తిమండలం రామవరానికి చెందిన పదోతరగతి విద్యార్థి వి. అప్పాజీ (16) శుక్రవారం రాత్రి అందరూ పడుకున్నాక ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి తిరిగొచ్చిన పిఠాపురం మండలం పి.రాయవరానికి చెందిన సాదే అప్పలరాజు (24)రాత్రి టీవీలో తెలంగాణ పక్రియ కొనసాగుతుందన్న వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దేవునితోటకు చెందిన పెచ్చెట్టి పెద్దిరాజు (60) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి భవిష్యత్‌పై బెంగతో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మరణించాడు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో విభజన వార్తల్ని చూస్తూ ఆందోళనకు గురైన మడతల రాములు (58)శనివారం ఉదయం ప్రాణాలు విడిచాడు. గోపాలపురం మండలం చిట్యా ల గ్రామానికి చెందిన గంగులకుర్తి పుల్లారావు (65) శనివారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని గార్లదిన్నె గ్రామంలో గుండెపోటుతో సమైక్యవాది రాంభూపాల్ (35) శనివారం మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సమైక్యవాది సాకె నాగన్న (55) సంజీవనగర్ కాలనీవాసులు చేపట్టిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళ్లి గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
విభజిస్తే 64 ఏళ్లు వెనక్కి
జగ్గంపేట, న్యూస్‌లైన్ : నైసర్గిక, భౌగోళిక పరిస్థితులను బట్టి నాటి పెద్దలు అన్నీ ఆలోచించి 21 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. అయితే రాజకీయ స్వార్థంతో సోనియాగాంధీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్ర విభజన పరిస్థితి తలెత్తిందని ఆందోళన చెందారు. ‘చిన్నారులూ ఆలోచించండి... సమైక్యాంధ్రను పరిరక్షించుకోకపోతే మరో 64 ఏళ్లు వెనక్కి పోయే ప్రమాదం ఉందని ఆయన విద్యార్థులతో అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక మెయిన్ రోడ్డుపై జేఏసీ, విజయభారతి స్కూల్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను వినూత్నంగా నిర్వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు, జేఏసీ చైర్మన్ మారిశెట్టి వీరభద్రరావు ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి తెలిపారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కలిసి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి పర్చుకున్నారన్నారు. మెరుగైన విద్య, ఉద్యోగ, వైద్యావకాశాలు, కేంద్రానికి సంబంధించిన 48 సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగితే వాటిని వదులుకోవలసిన పరిస్థితి వస్తుందన్నారు. కొందరు నాయకులు పదవులు నిలుపుకొనేందుకు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని విద్యార్థులు, జేఏసీ అడ్డుకోవాలని జ్యోతుల అన్నారు. సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకు చేరుకుని పాలనను స్తంభింపచేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగివస్తాయన్నారు. పార్టీ మండల కన్వీనర్ మారిశెట్టి భద్రం, నాయకులు అత్తులూరి నాగబాబు, సోమవరం రాజు, పాలచర్ల సత్యనారాయణ, కొత్త కొండబాబు, జేఏసీ నాయకులు ఒమ్మి రఘురామ్, రెడ్డమ్మ, మాతంశెట్టి శ్రీనివాస్, ఉద్యోగులు చంద్రరావు, నరసింగరావు, ఉపాధ్యాయులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సకల జనుల సమ్మె సంపూర్ణం
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో రెండో రోజు బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఎన్జీఓలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులకు గైర్హాజరయ్యారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో ఆర్టీసీ బుధవారం రూ. 70 లక్షల రాబడిని కోల్పోయింది. వైఎస్సార్ సీపీతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. పర్చూరులో పట్టువదలని దీక్ష: పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీక్షను విరమించాలని ఒత్తిడి వస్తున్నా ఆయన అంగీకరించడంలేదు. భరత్‌కు సంఘీభావంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా పర్చూరులోని బొమ్మల సెంటర్‌కు చేరుకున్నారు. సమైక్యాంధ్ర జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పర్చూరులో బంద్ నిర్వహించారు. రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపైనే ఆటలాడుతూ రాష్ట్ర విభజనను నిరసించారు. భరత్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో పోలీసులు కూడా ఏదో విధంగా దీక్షను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు కార్యకర్తల దృష్టికి వచ్చింది. దీంతో 40 మంది మహిళా కార్యకర్తలు ఆయనకు సంఘీభావంగా రిలే దీక్షలో పాల్గొన్నారు. కనిగిరి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బన్నీ ఆధ్వర్యంలో మోటారు బైక్ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. స్థానిక పామూరు బస్టాండు వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. బస్టాండు సెంటర్ నుంచి ఆటోవర్కర్స్ యూనియన్ నిరసన ర్యాలీ చేసి, కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పామూరు మండలం కొండారెడ్డిపల్లిలో సోనియా శవయాత్ర నిర్వహించారు. హనుమంతునిపాడు, వేములపాడుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన, మానవహారం చేపట్టారు. అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్జీఓలు కలిసి జేఏసీగా ఏర్పడి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాల గురించి గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ తెలిసేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. జే.పంగులూరులో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారంతా సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ, మానవహారంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా బంద్ నిర్వహించాయి. గిద్దలూరులో జరిగిన జేఏసీ మౌన ప్రదర్శనకు వైఎస్సార్ సీపీ నేత, ఎన్ఆర్ఐ రామమోహనరెడ్డి పాల్గొని మద్దతు పలికారు. బేస్తవారిపేట మండలం పోతులపాడులో విద్యార్థులు ధర్నా చేసి సమైక్యాంధ్రకు జై అంటూ నినాదాలు చేశారు. కంభంలో మాజీ సైనికులు నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు చేగిరెడ్డి లింగారెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓల వినూత్న నిరసన: ఒంగోలులో న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అనంతరం ఆట లాడుతూ రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎన్జీఓ సంఘ నేతలు కలెక్టరేట్ వద్ద బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోనియా చెప్పినట్టు వినేదంటూ గంగిరెద్దుకు ఆంటోని కమిటీ ప్లకార్డు కట్టారు. నిరసనల్లో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ పాల్గొన్నారు. చీరాలలో గడియార స్తంభం సెంటర్ వద్ద రెండు వేలమంది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పొన్నలూరులో బీసీ సంఘాల నాయకులు బంద్ చేశారు. కొండపి మండలం కే.ఉప్పలపాడులో సోనియా, నేతివారిపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను విద్యార్థులు, ప్రజలు దహనం చేశారు. బల్లికురవలో ఆర్యవైశ్య సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి మూడోరోజుకు చేరుకున్నాయి. త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి రాస్తారోకో చేశారు. త్రిపురాంతకం మండలం దోర్నాల సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దారవీడులో విద్యార్థులు, వైఎస్సార్సీపీ నేతలు కలిసి ర్యాలీ నిర్వహించారు. దర్శిలో మాజీ ఎమ్మెల్సీ శిద్దా రాఘవరావు పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ సంఘ నేతలు కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి ర్యాలీ నిర్వహించడంతోపాటు కేసీఆర్ దిష్టిబొమ్మను ద హనం చేశారు. రాచర్లలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కందుకూరులో సమైక్యపరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు ప్రారంభించారు. వైద్య విధాన పరిషత్ సిబ్బంది ఏరియా వైద్యశాల వద్ద, విద్యుత్‌శాఖ ఉద్యోగులు కందుకూరు డీఈ కార్యాలయం వద్ద, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఈఈ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించారు. కరేడులో సమైక్య గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. చీమకుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎన్జీఓలు అంతా కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. మద్దిపాడులో విద్యార్థులు, ఉద్యోగులు కలిసి జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. మద్దిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు గ్రామస్తులు వంటావార్పు చేపట్టారు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం, తిమ్మసముద్రంలలో నిరసన కార్యక్రమాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకులను సైతం మూసివేయించారు. -
సకలం బంద్
ఒంగోలు, న్యూస్‌లైన్: సకల జనుల సమ్మె, విద్యార్థి జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయాయి. ఉద్యోగులంతా ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఏపీఎన్జీఓలతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు మొత్తం డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వ్యాపార సంస్థలూ మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ స్తంభించాయి. విడివిడిగా...కలివిడిగా: ఉద్యోగ సంఘాల నాయకులు ఒంగోలులో విడివిడిగా తమ జిల్లా కార్యాలయాల వద్దనుంచి ర్యాలీగా బయల్దేరారు. ప్రకాశం భవనం, రిమ్స్‌లోని ఉద్యోగులంతా ప్రకాశం భవనం వద్ద బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ద్విచక్రవాహనాలు, ఆటోలను ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లించారు. ఉద్యోగులు మొత్తం సమ్మెలోకి వెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా అధికారులు మాత్రమే మిగిలారు. మండలాల్లో అటెండర్ మొదలు తహసీల్దారు వరకు సమ్మెలో పాల్గొని సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పూర్తి గా స్తంభించిపోయాయి. ఒంగోలులో ప్రభుత్వ ఉద్యోగులు ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు ర్యాలీగా చేరుకొని ఆర్టీసీ కార్మికుడు జీవీఆర్ రెడ్డి నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై ఎవరైనా ఒత్తిడి తీసుకురావడం, వారిపై చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు, 4200 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పలుచోట్ల కేసీఆర్, సోనియా గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమ్మెలో పాల్గొనలేకపోయిన ఉపాధ్యాయులు పలువురు కాగడాల ప్రదర్శన, మానవహారం వంటివాటిలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. అరకోటి ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ: సకల జనుల సమ్మె కారణంగా ఆర్టీసీ మంగళవారం రూ. 50 లక్షల ఆదాయం కోల్పోయింది. 4200 మంది కార్మికులు, 400 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. మొత్తం 850 బస్సుల్లో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. కొన్నిచోట్ల బస్సులను బయటకు తీయాలని అధికారులు యత్నించగా ఆర్టీసీ కార్మికుల ఆగ్రహంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎస్.ప్రసాదరావు, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి కేఎన్రావుల ఆధ్వర్యంలో కార్మికులంతా ఐక్యంగా ఒంగోలులోని సాగర్ సెంటర్లో కేసీఆర్, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టైర్లు కాల్చి మంటల చుట్టూ నృత్యం చేశారు. ఒంగోలు డిపోలో గ్యారేజీ వద్ద వంటావార్పు చేపట్టారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ఇదే విధంగా ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కందుకూరులో ఆర్టీసీ కార్మికుడు ఒకరు కరెంటు స్తంభం ఎక్కి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దాదాపు 20 నిముషాల అనంతరం పోలీసులు అతనిని కిందకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. కనిగిరిలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో: వైఎస్సార్సీపీ నాయకుడు గొట్టిపాటి భరత్ పర్చూరులో చేపట్టిన ఆమరణ దీక్ష మంగళవారానికి నాలుగోరోజుకు చేరుకుంది.భరత్‌తో పాటు మొత్తం నలుగురు ఆమరణదీక్ష చేస్తుండగా ప్రభుత్వ వైద్యులు మంగళవారం దీక్షాశిబిరానికి చేరుకొని ఇద్దరి వద్దనుంచి రక్తనమూనాలు సేకరించారు. ఈ విషయం తెలియడంతో పర్చూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలంతా పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేత రాజాల ఆదిరెడ్డి ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. కనిగిరి బల్లిపల్లి అడ్డరోడ్డులో వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలులో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జాలిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే దీక్షను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో కూడా బాలినేని పాల్గొని ఆర్టీసీ కార్మికులను, సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను అభినందించారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో: తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు అద్దంకి పాతబస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఒంగోలులో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కొమ్మూరి రవిచంద్ర, టీడీపీ నాయకుడు చిరంజీవి తదితరులు 20 మంది పార్టీ కార్యాలయం వద్దనుంచి జెండాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలతో ర్యాలీలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు యత్నించగా ఉద్యోగ సంఘాల నాయకులు తిరస్కరించారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న పోరాటం అని స్పష్టం చేయడంతో జెండాలు తీసివేసి పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలోని వంటా వార్పు వద్ద కూడా తెలుగుదేశం విధానానికి అనుకూలంగా చిరంజీవి ప్రకటన చేయగా దానిని ఎన్జీఓ సంఘం నాయకులు నిర్మొహమాటంగా ఖండించారు. మార్కాపురంలో విద్యార్థులు చేస్తున్న ర్యాలీకి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. వ్యాపార లావాదేవీలు నిలిపివేత: విద్యార్థి జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లమేర లావాదేవీలు నిలిచిపోయాయి. వ్యాపార సంస్థలు మూతపడటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.10 కోట్ల మేర విక్రయాలు నిలిచి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో వైపు పెట్రోలు బంకులు మొత్తం జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రినుంచే విక్రయాలను నిలిపివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో... మార్కాపురంలో టౌన్బాప్టిస్ట్ చర్చి యూత్ ఆధ్వర్యంలో పాత బస్టాండు సెంటర్లో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఒంగోలులో అభిలాష్ కార్ల స్టాండు యజమానులు, డ్రైవర్ల సంఘం కారుకు కేసీఆర్ దిష్టిబొమ్మను పెట్టి చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మ మెడలో చెప్పుల దండ, మద్యం బాటిల్స్ వేలాదదీసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి జేఏసీ చర్చిసెంటర్లో టైర్లు తగులబెట్టి నిరసన తెలపడంతోపాటు సినిమా థియేటర్లు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలను మూసివేయించింది. టంగుటూరులో టాక్సీ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలో నాయీబ్రాహ్మణులు రోడ్డుపై క్షవరాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పాపసాని కృష్ణారెడ్డి పొట్టి శ్రీరాములు వేషం వేసుకొని కనిగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సోమవారం రాత్రి పామూరులో బంగారు వర్తకులు, స్వర్ణకారులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుడ్లూరులో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. చీరాలలో ఆర్టీసీ కార్మికులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీఎన్జీఓలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. గిద్దలూరు దేవనగరంలో కేసీఆర్ దిష్టిబొమ్మను ప్రజలు దహనం చేశారు. కంభం, బేస్తవారిపేట, కొమరోలులో కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. గిద్దలూరులో రాచర్ల గేటు వద్ద అర్ధగంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో, చీమకుర్తి మండలం బండ్లమూడిలోను రాస్తారోకోలు జరిగాయి. మద్దిపాడులో పాఠశాల విద్యార్థులు, వారికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. -
నగర మార్కెట్లో ఉల్లి @50!
సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో ఉల్లి ధరలు ఉరుముతున్నాయి. అన్ని వర్గాలవారు ఇళ్లలో వాడే సాధారణ (గ్రేడ్-2) ఉల్లిని రిటైల్ మార్కెట్లో కిలో రూ.50కి అమ్ముతూ వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో కర్ణాటక, కర్నూలు నుంచి రాజధానికి ఉల్లి దిగుమతి పూర్తిగా ఆగిపోయింది. వర్షాల కారణంగా మహారాష్ట్ర నుంచీ ఉల్లి దిగుమతి తగ్గిపోయినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు రోజూ 12-14 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. కానీ శనివారం కేవలం 7 వేల క్వింటాళ్ల సరుకు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కొరత కారణంగానే నగర మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని చెప్పారు. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో రూ.45-50ల వరకు వసూలు చేస్తున్నారు. తోపుడు బండ్లవారైతే.. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ణయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే స్థానికంగానే మంచి ధర పలుకుతుండటంతో రైతులు సరుకును నగరానికి పంపడం లేదు. ఫలితంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరం మరింత పెరి గింది. వీటికి తోడు కొందరు వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి కూడా దండుకుంటున్నారు. సబ్సిడీకి సరఫరా చేయలేం..! ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి కౌంటర్లను తెరిచింది. కేజీ రూ.25ల ప్రకారం ఒక్కో వినియోగదారుడికి 2 కేజీల చొప్పున విక్రయిస్తోంది. గత 15 రోజులుగా సబ్సిడీ ధరకు సరుకు అందించిన హోల్‌సేల్ వ్యాపారులు సోమవారం నుంచి సరఫరా చేయలేమంటూ చేతులెత్తేశారు. హోల్‌సేల్‌గా కేజీ రూ.38 ధర ఉంటే... తాము రూ.25లకు ఇవ్వడం వల్ల క్వింటాల్‌కు రూ.600-1000 నష్టపోతున్నామని, ఇకపై సరఫరా చేయలేమని అధికారులకు తేల్చి చెప్పారు. అయితే రైతుబజార్లకు సరఫరా చేస్తున్న సబ్సిడీ ఉల్లి కూడా అరకొరగానే ఉంది. నగరంలో 10 రైతుబజార్లు ఉండగా శనివారం 6 రైతుబజార్లకే 10 క్వింటాళ్ల చొప్పున కంటితుడుపుగా ఉల్లిని సరఫరా చేశారు. దీంతో సరుకు వచ్చిన గంటకే కౌంటర్ ఖాళీ అవుతుండటంతో వినియోగదారులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఈ సబ్సిడీ ఉల్లి కూడా అధికారులు, సిబ్బంది తాలూకు బంధువులు, వ్యాపారులకు గుట్టుగా తరలి వెళుతుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. -
విభజిస్తే విపరిణామాలే
ఏదేమైనా... ఎందాకైనా... ప్రాణాలైనా అర్పిస్తాం కానీ రాష్ట్ర విభజనను మాత్రం అంగీకరించేదిలేదంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది. రాష్ర్టం విడిపోతే ప్రాంతాలకతీతంగా అంతటా విపరిణామాలే చోటుచేసుకుంటాయని తెగేసి చెబుతోంది. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపైనా, వేర్పాటును వ్యతిరేకించకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న టీడీపీపై శివాలెత్తుతోంది. -సాక్షి నెట్వర్క్ సమైక్యాంధ్రప్రదేశ్‌నే కొనసాగించాలంటూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉద్యమం దశదిశలా వెల్లువలా సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు శనివారం కూడా హోరెత్తాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాలన్నీ నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇక సోనియాగాంధీ, రాహుల్, దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, బొత్స, కేసీఆర్‌ల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు సీమాంధ్ర జిల్లాల్లో వాడవాడలా కొనసాగుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ బంద్ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో శనివారం బంద్ పాటించారు. వందలాదిమంది మత్స్యకారులు ర్యాలీగా జగదాంబ కూడలికి తరలివచ్చి మానవహారంగా ఏర్పడి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గాజువాకలో ఉక్కు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. అనకాపల్లిలో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, మోటార్ మెకానిక్‌లు, మహిళలు, భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అచ్యుతాపురం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సెజ్ ఉద్యోగులు, ఆటో కార్మికులు రాస్తారోకో నిర్వహించి, వాహనాలను నిలిపేశారు. వికలాంగుల రాస్తారోకో విశాఖ మద్దిలపాలెం కూడలిలో వికలాంగుల జేఏసీ రాస్తారోకో చేపట్టింది. ప్రకాశం జిల్లాలో పర్చూరులో వైఎస్సార్సీపీ నేత గొట్టిపాటి నరసయ్య తనయుడు భరత్ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రి తోట సతీమణి నిరవధిక నిరాహార దీక్ష వేర్పాటు ప్రకటనను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్లో రాష్ర్ట మంత్రి తోట నరసింహం భార్య, వీరవరం సర్పంచ్ సరస్వతి (వాణి) శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రుల ఇళ్లు ముట్టడి మంత్రి పదవికి రాజీనామా చేయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య తీరును నిరసిస్తూ ఆందోళనకారులు వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఆయన ఇంటి గేటుకు గాజులు, పూలు తగిలించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. బయటకు వచ్చిన మంత్రి ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. క్రీడాకారుల ర్యాలీ కడపలో క్రీడాకారులు, క్రీడాభిమానులు ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణనిరాహారదీక్ష ఆరోరోజుకు చేరింది. పులివెందులలో భవననిర్మాణ కార్మికులు, ప్రైవేటు డాక్టర్లు నిర్వహించిన ర్యాలీలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. నేటి నుంచి అనంతలో 48గంటలు బంద్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆదివారం నుంచి 48 గంటల అనంతపురం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శన అనంతపురం నగరంలో రామ్‌నగర్ ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. గుంతకల్లు పట్టణంలో దాదాపు 150 డీజిల్ ఆటోలతో ర్యాలీ, వంటా-వార్పు చేపట్టారు. హిందూపురంలో విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ర్యాలీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగుల ప్రదర్శన, ట్రాన్స్‌కో ఉద్యోగుల దీక్ష మునిసిపల్ ఉద్యోగులు అనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించడంతో పాటు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కదిరిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఉరవకొండలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వికలాంగుల ర్యాలీ తిరుపతి బర్డ్ ఆసుపత్రి నుంచి వికలాంగ రోగులు, వారి కుటుంబీకులు టీటీడీ పరిపాలనా భవనం వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిర్వహించిన మహాధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పుంగనూరులో నిర్వహించిన రిలేదీక్షల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రజకుల వినూత్న నిరసన గుంటూరులో రజకజన సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపై ఇస్త్రీ బండ్లు పెట్టి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రజక సంఘం ఆధ్యర్యంలో సమైక్యాంధ్ర పోరాటంలో పాల్గొనని నేతలకు చాకిరేవు పెట్టారు. ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిపై వ్యాపారుల జేఏసీ చేపట్టిన రాస్తారోకోతో హైవేపై వేలాది వాహనాలు నిలిచిపోయూరుు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో రాస్తారోకో చేశారు. నెల్లూరు నగరంలో ఎన్జీవోలు భారీ ప్రదర్శన చేపట్టారు. సోనియా, రాహుల్, కేసీఆర్ బొమ్మలకు సర్పదండన సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను పాములతో కాటువేయించి సర్పదండన శిక్ష విధించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీని ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా పట్టణంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చీపురుపల్లిలో విశ్వబ్రహ్మణుల సంఘం ఆధ్వర్యంలో మూడురోడ్ల జంక్షన్లో కర్రలు కోస్తూ నిరసన వ్యక్తం చేశారు. గజపతినగరంలో నాలుగురోడ్ల జంక్షన్ వద్ద నాయీబ్రాహ్మణులు రోడ్డుపైనే క్షౌరవృత్తి చేసి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కురువ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఉద్యోగులు దండోరా కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతల నిరసన కృష్ణాజిల్లా గుడివాడలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వందకుపైగా ఎడ్లబండ్లతో చల్లపల్లిలో ర్యాలీ, జగ్గయ్యపేటలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. మచిలీపట్నం-చల్లపల్లి 216 జాతీయ రహదారిపై మూడు వేల మందికిపైగా ప్రజలు, కార్మికులు 4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై నడుచుకుంటూ ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన పాలకుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, గౌరవఅధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు చేసిన రాజీనామాలను బెజవాడ ప్రజలు హర్షించారు. జగన్, విజయమ్మలకు జేజేలు పలుకుతూ సమైక్యవాదులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. నేడు సీమాంధ్రలో రైల్‌రోకో సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆదివారం సీమాంధ్ర జిల్లాల్లో రైల్‌రోకోలు నిర్వహించాలని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధన కోసం సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకే రైల్‌రోకో చేపడుతున్నట్లు చెప్పారు. ఉదయం 6గంటల నుంచే ఎక్కడికక్కడ రైళ్లను ఆపివేయాలని విద్యార్థి, రాజకీయ జేఏసీ, ప్రజా సంఘాలనేతలకు పిలుపునిచ్చారు. -
ఊరూరా ఉద్యమం
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన ప్రకటనపై జిల్లా వాసుల ఆగ్రహం రోజురోజుకూ కట్టలు తెంచుకుంటోంది. వివిధ వృత్తుల్లో ఉన్న వారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు.. చివరకు రైతులు, కూలీలు సైతం సమైక్య ఉద్యమ బాట పట్టారు. శుక్రవారం పదవ రోజు జిల్లాలో రంజాన్ పండగ నేపథ్యంలో సైతం ఆందోళనలు కొనసాగాయి. ముస్లింలు ప్రార్థనల అనంతరం.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్ సర్కిల్లో జాక్టో ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర జేఏసీ దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జేఏసీ ఆధ్వర్యంలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఐదోరోజుకు దీక్షలకు విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్‌తో పాటు వర్సిటీకి సమీపంలోని ఆకుతోటపల్లెకు చెందిన ముస్లింలు మద్దతు ప్రకటించారు. ఈద్గాలో ప్రార్థనల అనంతరం వర్సిటీకి చేరుకున్న ముస్లింలు అక్కడ కూడా ప్రార్థనలు చేసి..రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రామాంజినేయులు కళా బృందం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గేయాలను ఆలపించి.. నృత్యాలు చేశారు. ధర్మవరం పట్టణంలో సమైక్యవాదులు శాంతియుత ర్యాలీలు చేశారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదోరోజుకు చేరుకున్నాయి. బత్తలపల్లిలో శాంతియుత ర్యాలీ చేశారు. గుంతకల్లు, పామిడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కళ్యాణదుర్గం, గుడిబండ, పెనుకొండ, కణేకల్లులో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లింలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. నల్లమాడలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మడకశిరలో వీరశైవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అమడగూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బుక్కపట్నంలో నిరసనలు కొనసాగాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ప్రదర్శన, ఉరవకొండలో రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. రామగిరిలో సమైక్య వాదులు పాదయాత్ర చేశారు. నార్పలలో రాము అనే వ్యక్తి ఆమరణ దీక్ష చేపట్టారు. పుట్లూరు, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరులో శాంతిర్యాలీలు, దీక్షలు కొనసాగాయి. బెళగుప్పలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సమైక్యవాదులు అరగుండు, అరమీసంతో నిరసన తెలిపారు.