జగ్గంపేట, న్యూస్‌లైన్ : నైసర్గిక, భౌగోళిక పరిస్థితులను బట్టి నాటి పెద్దలు అన్నీ ఆలోచించి 21 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. అయితే రాజకీయ స్వార్థంతో సోనియాగాంధీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్ర విభజన పరిస్థితి తలెత్తిందని ఆందోళన చెందారు. ‘చిన్నారులూ ఆలోచించండి... సమైక్యాంధ్రను పరిరక్షించుకోకపోతే మరో 64 ఏళ్లు వెనక్కి పోయే ప్రమాదం ఉందని ఆయన విద్యార్థులతో అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక మెయిన్ రోడ్డుపై జేఏసీ, విజయభారతి స్కూల్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను వినూత్నంగా నిర్వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు, జేఏసీ చైర్మన్ మారిశెట్టి వీరభద్రరావు ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి తెలిపారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కలిసి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి పర్చుకున్నారన్నారు.
మెరుగైన విద్య, ఉద్యోగ, వైద్యావకాశాలు, కేంద్రానికి సంబంధించిన 48 సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగితే వాటిని వదులుకోవలసిన పరిస్థితి వస్తుందన్నారు. కొందరు నాయకులు పదవులు నిలుపుకొనేందుకు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని విద్యార్థులు, జేఏసీ అడ్డుకోవాలని జ్యోతుల అన్నారు. సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకు చేరుకుని పాలనను స్తంభింపచేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగివస్తాయన్నారు. పార్టీ మండల కన్వీనర్ మారిశెట్టి భద్రం, నాయకులు అత్తులూరి నాగబాబు, సోమవరం రాజు, పాలచర్ల సత్యనారాయణ, కొత్త కొండబాబు, జేఏసీ నాయకులు ఒమ్మి రఘురామ్, రెడ్డమ్మ, మాతంశెట్టి శ్రీనివాస్, ఉద్యోగులు చంద్రరావు, నరసింగరావు, ఉపాధ్యాయులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విభజిస్తే 64 ఏళ్లు వెనక్కి
Published Fri, Aug 23 2013 3:39 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement