ఊరూరా ఉద్యమం
Published Sat, Aug 10 2013 1:58 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన ప్రకటనపై జిల్లా వాసుల ఆగ్రహం రోజురోజుకూ కట్టలు తెంచుకుంటోంది. వివిధ వృత్తుల్లో ఉన్న వారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు.. చివరకు రైతులు, కూలీలు సైతం సమైక్య ఉద్యమ బాట పట్టారు. శుక్రవారం పదవ రోజు జిల్లాలో రంజాన్ పండగ నేపథ్యంలో సైతం ఆందోళనలు కొనసాగాయి. ముస్లింలు ప్రార్థనల అనంతరం.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్ సర్కిల్‌లో జాక్టో ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర జేఏసీ దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జేఏసీ ఆధ్వర్యంలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఐదోరోజుకు దీక్షలకు విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్‌తో పాటు వర్సిటీకి సమీపంలోని ఆకుతోటపల్లెకు చెందిన ముస్లింలు మద్దతు ప్రకటించారు.
ఈద్గాలో ప్రార్థనల అనంతరం వర్సిటీకి చేరుకున్న ముస్లింలు అక్కడ కూడా ప్రార్థనలు చేసి..రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రామాంజినేయులు కళా బృందం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గేయాలను ఆలపించి.. నృత్యాలు చేశారు. ధర్మవరం పట్టణంలో సమైక్యవాదులు శాంతియుత ర్యాలీలు చేశారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదోరోజుకు చేరుకున్నాయి. బత్తలపల్లిలో శాంతియుత ర్యాలీ చేశారు. గుంతకల్లు, పామిడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కళ్యాణదుర్గం, గుడిబండ, పెనుకొండ, కణేకల్లులో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లింలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. నల్లమాడలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మడకశిరలో వీరశైవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
అమడగూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బుక్కపట్నంలో నిరసనలు కొనసాగాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ప్రదర్శన, ఉరవకొండలో రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. రామగిరిలో సమైక్య వాదులు పాదయాత్ర చేశారు. నార్పలలో రాము అనే వ్యక్తి ఆమరణ దీక్ష చేపట్టారు. పుట్లూరు, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరులో శాంతిర్యాలీలు, దీక్షలు కొనసాగాయి. బెళగుప్పలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సమైక్యవాదులు అరగుండు, అరమీసంతో నిరసన తెలిపారు.
Advertisement
Advertisement