సాక్షి, తిరుపతి: ఉద్యమం మహోద్యమంగా మారుతోంది. రోజుకో కార్యక్రమంతో సమైక్యవాదులు వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరులో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 5వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. తిరుపతిలో వెటర్నరీ కళాశాలలో ముగ్గులువేసి నిరసన తెలిపారు. టీటీడీ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు శాప్స్ ఆధ్వర్యంలో రోడ్డుపై మాక్ స్కూల్ నిర్వహించారు. పుత్తూరులో ప్రభుత్వ వైద్యులు రోగులకు రోడ్డుపైనే వైద్యసేవలందిస్తూ నిరసన తెలిపారు. ఏపీ ఎన్‌జీవో, ఆర్టీసీ, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయ ఉద్యోగులు రిలేదీక్షలు కొనసాగించారు. వీరికి పలువురు మద్దతు పలికారు.
విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మౌనప్రదర్శన నిర్వహించారు. పుత్తూరు బాలికల, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగులు రాత్రి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పలమనేరులో వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల ర్యాలీ నిర్వహించి రిలేదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి మాక్‌డ్రిల్ చేశారు. న్యాయవాదులు చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లెలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, వంటావార్పు చేపట్టారు. గంగవర ం మండలం పొనబాకులపల్లె వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలు, వంటావార్పు నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జేఏసీ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు, ఎద్దులబండి సంఘం, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగించారు. రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు.
జాతీయ పతాకంతో నిరసన
బి.కొత్తకోటలో మోకాళ్లపై నిరసన తెలిపారు. ములకలచెరువులో 200 మీటర్లు, పుంగనూరులో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో మండలి బుద్దప్రసాద్ పాల్గొన్నారు. పౌరాణిక వేషధారణలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థులు, వివిధ సంఘాల ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. మదనపల్లెలో కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సుమారు 4వేల మందితో ర్యాలీ నిర్వహించారు. గ్రానైట్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ, సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరవధిక దీక్ష, బీటీ కళాశాల వద్ద అధ్యాపకులు, సిబ్బంది రిలేదీక్షలు చేస్తున్నారు. యాదవ, కురవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి.
క్రైస్తవ ఐక్యసంఘం ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పీలేరులో టీటీడీ బోర్డు సభ్యుడు జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఎంజేఆర్ ఇంజనీరింగ్, వివిధ ప్రైవేటు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో సాయంత్రం దాకా వీధినాటకం, రాత్రి ఆర్కేస్ట్రా నిర్వహించి నిరసన తెలిపారు. సత్యవేడులో ఉపాధ్యాయులు భారీ మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఆటో డ్రైవర్లు రోడ్డుపై కబడ్డీ ఆడి రిలేదీక్షలు చేశారు. పెరుమాళ్లపల్లె బాలాజీ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో ‘జె సమైక్యాంధ్ర’ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పుంగనూరులో వీరసేవ లింగాయతుల ఆధర్యంలో భారీ ర్యాలీ, రుద్రహోమం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, రిలే దీక్షలు చేశారు.
ఉద్యోగుల గర్జన
Published Wed, Aug 28 2013 4:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement