రామచంద్రపురంలో «సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్న ఏపీవీవీపీ ఉద్యోగులు
సాక్షి, అమరావతి/లబ్బీపేట/రామచంద్రపురం/గుంటూరు మెడికల్/గాంధీనగర్: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చి ఎన్నో వేల కుటుంబాలకు మేలు చేకూర్చారని పేర్కొంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
13,000 మంది ఉద్యోగులకు మేలు
ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వ శాఖగా మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో 13,000 ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు చేపడతారని వెల్లడించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు.
నిరుద్యోగులకు ఎంతో ఊరట
ఏపీలోని నిరుద్యోగులకు ఊరట కలిగించేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు 10,000 పోస్టులను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. టెట్ కమ్ డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్, ఎస్‌ఐ, ఫైర్, జైల్ వార్డెన్స్, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, వర్సిటీల్లో ఉన్న బోధన,బోధనేతర సిబ్బంది భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామమన్నారు.
జీపీఎస్ అమలుపై కృతజ్ఞతలు
ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా జీపీఎస్ అమలుతో పెన్షన్ భరోసా కల్పించినందుకు ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌కు తాము మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, రామకృష్ణా రెడ్డి, హరీంద్ర, కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుభాని, పుల్లారావు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు
సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం వైఎస్ జగన్‌కు పీటీడీ(ఆర్టీసీ) వైఎస్సార్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 50 శాతం కనీస పింఛన్‌తో పాటు డీఏలు వర్తించే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా లబ్ధి చేకూరుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేఎం నాయుడు, ఉపాధ్యక్షురాలు లత తెలిపారు.
జీపీఎస్‌తో ఎంతో మేలు
కేబినెట్‌లో ఉద్యోగులకు సంబంధించి 5 అంశాలకు ఆమోదం లభించింది. డీఏ కోసం ఇచ్చిన జీవోను ర్యాటిఫై చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు సమానంగా 16% హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కొత్త పీఆర్సీ కమిషన్ వేయడం అభినందనీయం.
ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్ తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కిందకు వచ్చే వారికి చివరి పే స్కేల్‌లో 50% ఇస్తూ, దానికి అదనంగా డీఏ ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పాత పెన్షన్ స్కీమ్‌కు, జీపీఎస్‌కు మధ్య ఒకటే తేడా ఉంది. పీఆర్సీ ఒక్కటే లేదు. డీఏ కూడా ఫిక్స్ చేశారు. ప్రతీ ఆర్నెల్లకు 2% డీఏ ఇవ్వాలని నిర్ణయించారు.
హౌస్‌సైట్స్ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. జగనన్న లేఅవుట్లలో 10% కేటాయించారు. 20% డి స్కౌంట్ ఇచ్చారు. ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకూ సుముఖంగా ఉన్నారు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన అవుట్‌సోర్సింగ్ ఉ ద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.
– కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
సీఎం జగన్‌ది సంక్షేమ సంతకం
ఇచ్చిన హామీల అమల్లో పేటెంట్ రైట్ ఏదైనా ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌దే. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం జగన్ సంతకమే సంక్షేమ సంతకం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో వారంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు.
– పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు
వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ దశాబ్దాల కలను నెరవేర్చారు
కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ఈ మేలును ఎన్నటికీ మరువలేము. కేబినెట్‌లో క్రమబద్ధీకరణ తీసుకున్న క్షణం మా ఇళ్లలో పండుగ వాతావరణం కనిపించింది. సుధీర్ఘ నిరీక్షణకు సీఎం జగన్ చరమగీతం పలికారు.
– రవికుమార్, కొలకలూరి రత్నాకర్‌బాబు, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్
చాలా సంతోషంగా ఉన్నాం
సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం ఎంతో సంతోషానిచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తోన్న వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడు 1,500 మందిని క్రమబద్ధీకరిస్తారు. వీరితోపాటే మిగిలిన వారినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం.
– గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం
రుణపడి ఉంటాము
చంద్రబాబు సీఎంగా ఉండి 1994లో పోస్టుల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మా కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి.
– ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
స్వాగతిస్తున్నాం..
12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త డీఏ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్‌లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు.
–డీ శ్రీను, రాష్ట్ర అధ్యక్షుడు, డీపీఆర్టీయూ
10వేల కుటుంబాల్లో వెలుగులు
పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాము. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు.
– అరవ పాల్, అధ్యక్షుడు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్
పీఆర్సీ ఏర్పాటు హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన 12వ పేరివిజన్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్
మంచి నిర్ణయం తీసుకున్నారు
రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 7 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 నాటికి సర్వీస్‌లో ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించినట్లయితే మరో 4 వేల మందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 110 మంది రెగ్యులర్ అవుతున్నారు.
– బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment