ఒంగోలు, న్యూస్‌లైన్: సకల జనుల సమ్మె, విద్యార్థి జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయాయి. ఉద్యోగులంతా ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఏపీఎన్‌జీఓలతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు మొత్తం డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వ్యాపార సంస్థలూ మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ స్తంభించాయి.
విడివిడిగా...కలివిడిగా: ఉద్యోగ సంఘాల నాయకులు ఒంగోలులో విడివిడిగా తమ జిల్లా కార్యాలయాల వద్దనుంచి ర్యాలీగా బయల్దేరారు. ప్రకాశం భవనం, రిమ్స్‌లోని ఉద్యోగులంతా ప్రకాశం భవనం వద్ద బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ద్విచక్రవాహనాలు, ఆటోలను ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లించారు. ఉద్యోగులు మొత్తం సమ్మెలోకి వెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా అధికారులు మాత్రమే మిగిలారు. మండలాల్లో అటెండర్ మొదలు తహసీల్దారు వరకు సమ్మెలో పాల్గొని సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పూర్తి గా స్తంభించిపోయాయి. ఒంగోలులో ప్రభుత్వ ఉద్యోగులు ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు ర్యాలీగా చేరుకొని ఆర్టీసీ కార్మికుడు జీవీఆర్ రెడ్డి నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై ఎవరైనా ఒత్తిడి తీసుకురావడం, వారిపై చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు, 4200 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పలుచోట్ల కేసీఆర్, సోనియా గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమ్మెలో పాల్గొనలేకపోయిన ఉపాధ్యాయులు పలువురు కాగడాల ప్రదర్శన, మానవహారం వంటివాటిలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతు పలికారు.
అరకోటి ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ: సకల జనుల సమ్మె కారణంగా ఆర్టీసీ మంగళవారం రూ. 50 లక్షల ఆదాయం కోల్పోయింది. 4200 మంది కార్మికులు, 400 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. మొత్తం 850 బస్సుల్లో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. కొన్నిచోట్ల బస్సులను బయటకు తీయాలని అధికారులు యత్నించగా ఆర్టీసీ కార్మికుల ఆగ్రహంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎస్.ప్రసాదరావు, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి కేఎన్‌రావుల ఆధ్వర్యంలో కార్మికులంతా ఐక్యంగా ఒంగోలులోని సాగర్ సెంటర్‌లో కేసీఆర్, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టైర్లు కాల్చి మంటల చుట్టూ నృత్యం చేశారు. ఒంగోలు డిపోలో గ్యారేజీ వద్ద వంటావార్పు చేపట్టారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ఇదే విధంగా ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కందుకూరులో ఆర్టీసీ కార్మికుడు ఒకరు కరెంటు స్తంభం ఎక్కి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దాదాపు 20 నిముషాల అనంతరం పోలీసులు అతనిని కిందకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. కనిగిరిలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో: వైఎస్సార్‌సీపీ నాయకుడు గొట్టిపాటి భరత్ పర్చూరులో చేపట్టిన ఆమరణ దీక్ష మంగళవారానికి నాలుగోరోజుకు చేరుకుంది.భరత్‌తో పాటు మొత్తం నలుగురు ఆమరణదీక్ష చేస్తుండగా ప్రభుత్వ వైద్యులు మంగళవారం దీక్షాశిబిరానికి చేరుకొని ఇద్దరి వద్దనుంచి రక్తనమూనాలు సేకరించారు. ఈ విషయం తెలియడంతో పర్చూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలంతా పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేత రాజాల ఆదిరెడ్డి ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. కనిగిరి బల్లిపల్లి అడ్డరోడ్డులో వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలులో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జాలిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే దీక్షను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో కూడా బాలినేని పాల్గొని ఆర్టీసీ కార్మికులను, సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను అభినందించారు.
తెలుగుదేశం ఆధ్వర్యంలో: తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు అద్దంకి పాతబస్టాండు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఒంగోలులో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కొమ్మూరి రవిచంద్ర, టీడీపీ నాయకుడు చిరంజీవి తదితరులు 20 మంది పార్టీ కార్యాలయం వద్దనుంచి జెండాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలతో ర్యాలీలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు యత్నించగా ఉద్యోగ సంఘాల నాయకులు తిరస్కరించారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న పోరాటం అని స్పష్టం చేయడంతో జెండాలు తీసివేసి పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలోని వంటా వార్పు వద్ద కూడా తెలుగుదేశం విధానానికి అనుకూలంగా చిరంజీవి ప్రకటన చేయగా దానిని ఎన్‌జీఓ సంఘం నాయకులు నిర్మొహమాటంగా ఖండించారు. మార్కాపురంలో విద్యార్థులు చేస్తున్న ర్యాలీకి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
వ్యాపార లావాదేవీలు నిలిపివేత: విద్యార్థి జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లమేర లావాదేవీలు నిలిచిపోయాయి. వ్యాపార సంస్థలు మూతపడటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.10 కోట్ల మేర విక్రయాలు నిలిచి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో వైపు పెట్రోలు బంకులు మొత్తం జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రినుంచే విక్రయాలను నిలిపివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
మార్కాపురంలో టౌన్‌బాప్టిస్ట్ చర్చి యూత్ ఆధ్వర్యంలో పాత బస్టాండు సెంటర్‌లో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఒంగోలులో అభిలాష్ కార్ల స్టాండు యజమానులు, డ్రైవర్ల సంఘం కారుకు కేసీఆర్ దిష్టిబొమ్మను పెట్టి చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మ మెడలో చెప్పుల దండ, మద్యం బాటిల్స్ వేలాదదీసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి జేఏసీ చర్చిసెంటర్‌లో టైర్లు తగులబెట్టి నిరసన తెలపడంతోపాటు సినిమా థియేటర్లు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలను మూసివేయించింది. టంగుటూరులో టాక్సీ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలో నాయీబ్రాహ్మణులు రోడ్డుపై క్షవరాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పాపసాని కృష్ణారెడ్డి పొట్టి శ్రీరాములు వేషం వేసుకొని కనిగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
సోమవారం రాత్రి పామూరులో బంగారు వర్తకులు, స్వర్ణకారులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుడ్లూరులో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. చీరాలలో ఆర్టీసీ కార్మికులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీఎన్‌జీఓలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. గిద్దలూరు దేవనగరంలో కేసీఆర్ దిష్టిబొమ్మను ప్రజలు దహనం చేశారు. కంభం, బేస్తవారిపేట, కొమరోలులో కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. గిద్దలూరులో రాచర్ల గేటు వద్ద అర్ధగంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో, చీమకుర్తి మండలం బండ్లమూడిలోను రాస్తారోకోలు జరిగాయి. మద్దిపాడులో పాఠశాల విద్యార్థులు, వారికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో చేశారు.
సకలం బంద్
Published Wed, Aug 14 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement