మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర జిల్లాలు ఆదివారం నాడూ మార్మోగాయి. ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు కలెక్టరేట్ వర కు ర్యాలీ తీశారు. కొత్తపేట పాతబస్టాండ్ వద్ద హాస్టల్ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఏలేశ్వరంలో వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాదచారులకు, ప్రయాణికులకు పువ్వులు పంచుతూ నిరసన తెలి పారు. ముమ్మిడివరంలో రజకులు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తాపేశ్వరంలో వ్యవసాయ అధికారులు, రైతుమిత్ర సంఘాలు, రైతులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
తుని, పెద్దాపురం పట్టణాల్లో క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో ఇంద్రజాలికుడు చారి కళ్లకు గంతలు కట్టుకుని వాహనం నడుపుతూ నిరసన ర్యాలీ చేశారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీల వేషధారణలో ఉన్న వ్యక్తులు సోనియా వేషధారిణి చుట్టూ చెక్కభజన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మునిసిపల్ ఉపాధ్యాయులు గొడుగులతో నిరసన ర్యాలీ చేయగా.. మునిసిపాలిటీ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని సమైక్యనినాదాన్ని వినిపించారు. అనంతపురం ఎస్కేయూ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆర్యవైశ్య సంఘం, ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయుల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు.
చీరాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మైనింగ్ కార్యాలయాలకు తాళాలు వేసి, విధులు బహిష్కరించాలని సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల మైనింగ్ శాఖ అధికారులు గుంటూరులో తీర్మానించారు. విజయవాడ దుర్గగుడి ఉద్యోగులూ సమైక్యం కోసం ఆందోళనబాట పట్టారు. జగ్గయ్యపేటలో బోనాలు సమర్పించి మహిళలు నిరసన వ్యక్తంచేశారు. శ్రీకాకుళంలో జెడ్పీ,రెవెన్యూ, పురపాలక సంఘ ఉద్యోగులు దీక్షల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రోడ్డుపై కూర్చొని ఐదు లక్షల సార్లు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ కాగితాలపై రాసి 1500 మంది విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. విస్సాకోడేరులో సెయింట్‌జాన్ స్కూల్ విద్యార్థులు మోకాళ్లపై నిలబడి జాతీయ జెండా చేతబూని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనతో కలిగే నష్టాలను వివరిస్తూ కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు, ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ పంపారు. ఆళ్లగడ్డలో జేఏసీ నేతలు మోకాళ్లతో నడిచి నిరసన వ్యక్తం చేశారు.
మరో 12 మంది మృతి
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయంపై కలత చెంది శనివారం రాత్రి, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు, తూర్పులో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాజాలు వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు(55), పాము మాణిక్యం(68), కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన శ్రీనివాస్(45) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరానికి చెందిన కోటిచుక్కల నాగరాజు(36) టీవీలో విభజన వార్తలు చూస్తూ ప్రాణాలు వదిలాడు. నరసాపురం రుస్తుంబాద మెరకగూడెంకు చెందిన డ్వాక్రా సభ్యురాలు సావిత్రి(65) విభజన వార్తలతో కొద్దిరోజులుగా దిగులుగా ఉన్న ఆమె మృతిచెందింది.
పెరవలి మండలం గవర్లపాలెంకు చెందిన రాంబాబు (23), నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో షేక్ మస్తాన్ (50) గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి వీఆర్‌ఏ తుడుం రమణ(42), చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన మునస్వామి(51), కర్నూలుజిల్లా జూపాడుబంగ్లా మం డలం లింగాపురానికి చెందిన వెంకటలక్ష్మయ్య(45) టీవీల్లో వీక్షిస్తూ గుండెపోటుతో మరణించాడు. కొత్తపల్లి మండలం జి.వీరాపురానికి చెందిన శివుడు(37) గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం ఎండమూరుకు చెందిన నాగమణి గుండెపోటుతో మృతిచెందింది.