ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలిపారు. మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకున్నారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్న గాంధీ బోధనలను అనుసరిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరికొంత మంది నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె 64వ రోజుకు చేరుకొంది. సాధారణ ప్రజలతోపాటు ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. జాతీయ నాయకుల వేషధారణలతో చేపట్టిన నిరసనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
రక్తదాన శిబిరం.. మౌన ప్రదర్శనలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. 55 మంది రక్తదానం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నగరంలో శాంతి ర్యాలీ చేశారు. రెవెన్యూ కాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసనకారులు మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే రీతిలో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పంచాయతీ విభాగం అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
హయ్యర్ బస్సు అడ్డగింత: అద్దంకి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర నిరసనల జోరు కొనసాగింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 45వ రోజుకు చేరుకున్నాయి. వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు రిలే దీక్షలకు దిగారు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆ సమయంలో నరసరావుపేట నుంచి అద్దంకి డిపోకు హయ్యర్ బస్సు రావడంతో దానిని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగితే బస్సును ఎలా నడుపుతారంటూ నిలదీశారు. మరోమారు తిరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బల్లికురవలో సమైక్యాంధ్ర సాధనకు పాదయాత్ర నిర్వహించారు.
టెన్నిస్ క్రీడాకారుల దీక్షలు: గిద్దలూరులో సమైక్య నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గిద్దలూరు టెన్నిస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 మంది టెన్నిస్ క్రీడాకారులు రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దళితులు రిలే దీక్షలు చేపట్టారు. దళిత క్రిష్టియన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సాధనలో భాగంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కొండపి, మర్రిపూడి ప్రాంతాల్లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దర్శిలో ఉద్యోగస్తులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటిం చారు. మార్కాపురంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అంగన్‌వాడీలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలం టూ ముగ్గులు వేశారు. ఆర్టీసీ కార్మికులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
బాపూజీ బాటలో.. సమైక్య స్ఫూర్తితో..
Published Thu, Oct 3 2013 3:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement