సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో ఉల్లి ధరలు ఉరుముతున్నాయి. అన్ని వర్గాలవారు ఇళ్లలో వాడే సాధారణ (గ్రేడ్-2) ఉల్లిని రిటైల్ మార్కెట్లో కిలో రూ.50కి అమ్ముతూ వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో కర్ణాటక, కర్నూలు నుంచి రాజధానికి ఉల్లి దిగుమతి పూర్తిగా ఆగిపోయింది. వర్షాల కారణంగా మహారాష్ట్ర నుంచీ ఉల్లి దిగుమతి తగ్గిపోయినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు రోజూ 12-14 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. కానీ శనివారం కేవలం 7 వేల క్వింటాళ్ల సరుకు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కొరత కారణంగానే నగర మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని చెప్పారు. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో రూ.45-50ల వరకు వసూలు చేస్తున్నారు. తోపుడు బండ్లవారైతే.. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ణయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే స్థానికంగానే మంచి ధర పలుకుతుండటంతో రైతులు సరుకును నగరానికి పంపడం లేదు. ఫలితంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరం మరింత పెరి గింది. వీటికి తోడు కొందరు వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి కూడా దండుకుంటున్నారు.
సబ్సిడీకి సరఫరా చేయలేం..!
ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి కౌంటర్లను తెరిచింది. కేజీ రూ.25ల ప్రకారం ఒక్కో వినియోగదారుడికి 2 కేజీల చొప్పున విక్రయిస్తోంది. గత 15 రోజులుగా సబ్సిడీ ధరకు సరుకు అందించిన హోల్‌సేల్ వ్యాపారులు సోమవారం నుంచి సరఫరా చేయలేమంటూ చేతులెత్తేశారు. హోల్‌సేల్‌గా కేజీ రూ.38 ధర ఉంటే... తాము రూ.25లకు ఇవ్వడం వల్ల క్వింటాల్‌కు రూ.600-1000 నష్టపోతున్నామని, ఇకపై సరఫరా చేయలేమని అధికారులకు తేల్చి చెప్పారు. అయితే రైతుబజార్లకు సరఫరా చేస్తున్న సబ్సిడీ ఉల్లి కూడా అరకొరగానే ఉంది. నగరంలో 10 రైతుబజార్లు ఉండగా శనివారం 6 రైతుబజార్లకే 10 క్వింటాళ్ల చొప్పున కంటితుడుపుగా ఉల్లిని సరఫరా చేశారు. దీంతో సరుకు వచ్చిన గంటకే కౌంటర్ ఖాళీ అవుతుండటంతో వినియోగదారులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఈ సబ్సిడీ ఉల్లి కూడా అధికారులు, సిబ్బంది తాలూకు బంధువులు, వ్యాపారులకు గుట్టుగా తరలి వెళుతుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.