నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ఉల్లి సేకరణను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌లో ఉల్లి కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి ఉల్లిని సేకరిస్తోంది. అయితే రైతులు దీన్ని నిలిపేయాలని కోరుతున్నారు. వీరి డిమాండ్ మరింత పెరిగితే ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకం కలిగే ప్రమాదముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాఫెడ్ బృందం ఇటీవల కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఆయా కేంద్రాల నిర్వహణ లోపాలపై చర్యలు చేపడుతోంది. దాంతోపాటు పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోంది. ప్రభుత్వం ఉల్లి సేకరణ పెంచితే ధరలు కట్టడి అవుతాయి. కానీ, అలా చేస్తే రైతుల పంటకు సరైన ధర లభించదనే ఉద్దేశంతో ఉల్లి సేకరణను నిలిపివేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఇటీవల ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’
దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment