ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ ఏడాది మే నెలలో ఆ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అదే సమయంలో టన్ను ఉల్లి ఎగుమతికి 550 డాలర్లు(రూ.46 వేలు) కనీస ధరను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు ఉల్లిని విదేశాలకు అమ్మకూడదు. దాంతో ఎగుమతులు తగ్గి దేశీయంగా ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జూన్‌లో ఉల్లి ఎగుమతులు 50 శాతానికి పైగా పడిపోయాయి. 2024-25 ఏడాదికిగాను జులై 31, 2024 వరకు 2.60 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 17.17 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు.
ఇదీ చదవండి: వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదం
మహారాష్ట్రలోని నాసిక్‌లో దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి స్థానికంగా ఓట్లు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్న ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment