దేశవ్యాప్తంగా ధర పెరుగుతున్నా.. కర్నూలు యార్డులో తగ్గుదల
తీవ్ర నిరాశలో రైతన్నలు
కర్నూలు (అగ్రికల్చర్) : ఉల్లి ధరలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లికి డిమాండ్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డలకు డిమాండ్ పెరిగి ధర కూడా జోరు మీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రం ధరలు తగ్గుతున్నాయి.
మొన్నటి వరకు వర్షాల వల్ల ఉల్లి నాణ్యత దెబ్బతిని ధర లభించడం లేదు. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో గడ్డల నాణ్యత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో కర్నూలు మార్కెట్‌కు పోతే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో వస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది.
సిండికేట్‌గా మారుతున్న వ్యాపారులు
వ్యాపారులు పథకం ప్రకారం ఉల్లి ధర పెరుగకుండా జట్టు కడుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలపై ప్రభావం చూపుతున్నారు. గతంలో వేలంపాట ద్వారా కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు సైగలతో సిండికేట్ అయ్యేవారు. ప్రస్తుతం ఈ–నామ్‌లో టెండర్ ప్రాతిపదికన ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో 40 మంది వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేస్తున్నారు.
ఇందులో 30 మంది వ్యాపారులు భారీగానే ఉల్లి క్రయ, విక్రయాలు చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఉల్లి అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు తరలుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో కోల్‌కతా నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయమే వ్యాపారులు దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్డర్లు, ధరల ఆధారంగా సిండికేట్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏ ధర వరకు టెండరు వేయవచ్చనే విషయమై వ్యాపారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ–నామ్‌లో కూడా సిండికేట్‌గా మారి కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే కర్నూలు మార్కెట్‌లో కనీసం రూ.5వేల వరకు ధర పలకాలి. కానీ రూ.3,600 మించడంలేదు. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకే లభిస్తోంది. 40 శాతం లాట్లకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి 2,500 వరకు మాత్రమే ఉంటోంది. మిగిలిన అన్ని లాట్లకు రూ.1000 నుంచి రూ.2వేల మధ్యనే ధర లభిస్తోంది.
ధర తీవ్ర నిరాశకు గురి చేసింది
ఒక ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి అంతంత మాత్రంగానే వచి్చంది. మార్కెట్‌లో దిగుబడిని విక్రయానికి తీసుకెళ్తే క్వింటాకు రూ.2,000 లోపు ధర లభించింది. ఈ ధర చాలా నిరాశకు గురిచేసింది. వ్యాపారులు పథకం ప్రకారం సిండికేట్‌గా మారి ధర పెరగకుండా చేస్తున్నారు. – మద్దిలేటి, పర్ల, కల్లూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment