జిల్లాలో రెండో రోజు బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఎన్‌జీఓలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులకు గైర్హాజరయ్యారు.
సకల జనుల సమ్మె సంపూర్ణం
Published Thu, Aug 15 2013 6:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో రెండో రోజు బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఎన్‌జీఓలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులకు గైర్హాజరయ్యారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో ఆర్టీసీ బుధవారం రూ. 70 లక్షల రాబడిని కోల్పోయింది. వైఎస్సార్ సీపీతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు.
పర్చూరులో పట్టువదలని దీక్ష: పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీక్షను విరమించాలని ఒత్తిడి వస్తున్నా ఆయన అంగీకరించడంలేదు. భరత్‌కు సంఘీభావంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా పర్చూరులోని బొమ్మల సెంటర్‌కు చేరుకున్నారు. సమైక్యాంధ్ర జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పర్చూరులో బంద్ నిర్వహించారు. రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపైనే ఆటలాడుతూ రాష్ట్ర విభజనను నిరసించారు. భరత్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో పోలీసులు కూడా ఏదో విధంగా దీక్షను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు కార్యకర్తల దృష్టికి వచ్చింది. దీంతో 40 మంది మహిళా కార్యకర్తలు ఆయనకు సంఘీభావంగా రిలే దీక్షలో పాల్గొన్నారు. కనిగిరి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బన్నీ ఆధ్వర్యంలో మోటారు బైక్‌ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. స్థానిక పామూరు బస్టాండు వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
బస్టాండు సెంటర్ నుంచి ఆటోవర్కర్స్ యూనియన్ నిరసన ర్యాలీ చేసి, కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పామూరు మండలం కొండారెడ్డిపల్లిలో సోనియా శవయాత్ర నిర్వహించారు. హనుమంతునిపాడు, వేములపాడుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన, మానవహారం చేపట్టారు. అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్‌జీఓలు కలిసి జేఏసీగా ఏర్పడి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాల గురించి గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ తెలిసేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. జే.పంగులూరులో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారంతా సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
మార్కాపురంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ, మానవహారంలో వైఎస్సార్‌సీపీ మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా బంద్ నిర్వహించాయి. గిద్దలూరులో జరిగిన జేఏసీ మౌన ప్రదర్శనకు వైఎస్సార్ సీపీ నేత, ఎన్‌ఆర్‌ఐ రామమోహనరెడ్డి పాల్గొని మద్దతు పలికారు. బేస్తవారిపేట మండలం పోతులపాడులో విద్యార్థులు ధర్నా చేసి సమైక్యాంధ్రకు జై అంటూ నినాదాలు చేశారు. కంభంలో మాజీ సైనికులు నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకుడు చేగిరెడ్డి లింగారెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఎన్‌జీఓల వినూత్న నిరసన: ఒంగోలులో న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అనంతరం ఆట లాడుతూ రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌జీఓ సంఘ నేతలు కలెక్టరేట్ వద్ద బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోనియా చెప్పినట్టు వినేదంటూ గంగిరెద్దుకు ఆంటోని కమిటీ ప్లకార్డు కట్టారు. నిరసనల్లో ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ పాల్గొన్నారు. చీరాలలో గడియార స్తంభం సెంటర్ వద్ద రెండు వేలమంది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పొన్నలూరులో బీసీ సంఘాల నాయకులు బంద్ చేశారు. కొండపి మండలం కే.ఉప్పలపాడులో సోనియా, నేతివారిపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను విద్యార్థులు, ప్రజలు దహనం చేశారు. బల్లికురవలో ఆర్యవైశ్య సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి మూడోరోజుకు చేరుకున్నాయి. త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి రాస్తారోకో చేశారు. త్రిపురాంతకం మండలం దోర్నాల సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దారవీడులో విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి ర్యాలీ నిర్వహించారు.
దర్శిలో మాజీ ఎమ్మెల్సీ శిద్దా రాఘవరావు పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీఓ సంఘ నేతలు కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి ర్యాలీ నిర్వహించడంతోపాటు కేసీఆర్ దిష్టిబొమ్మను ద హనం చేశారు. రాచర్లలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కందుకూరులో సమైక్యపరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు ప్రారంభించారు. వైద్య విధాన పరిషత్ సిబ్బంది ఏరియా వైద్యశాల వద్ద, విద్యుత్‌శాఖ ఉద్యోగులు కందుకూరు డీఈ కార్యాలయం వద్ద, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఈఈ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించారు. కరేడులో సమైక్య గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. చీమకుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎన్‌జీఓలు అంతా కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. మద్దిపాడులో విద్యార్థులు, ఉద్యోగులు కలిసి జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. మద్దిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు గ్రామస్తులు వంటావార్పు చేపట్టారు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం, తిమ్మసముద్రంలలో నిరసన కార్యక్రమాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకులను సైతం మూసివేయించారు.
Advertisement
Advertisement