సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెడితే.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు హెచ్చరించారు. లోక్‌సభ వెబ్‌సైట్‌లో బిల్లును లిస్టింగ్ చేసిందని, బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారో మూడు రోజుల ముందు వరకు కూడా తెలియనుందన్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా బిల్లును తెస్తే అర్ధగంటలో యావత్ దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి విద్యుదుత్పత్తి కేంద్రాలు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతారని చెప్పారు. 12 తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలతో కలసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థల ఆస్తులను దోచిపెట్టడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించారు.
లైసెన్స్ లేకుండా విద్యుత్ పంపిణీ రంగంలో వ్యాపారం చేసేందుకు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం కల్పించడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులతోపాటు విద్యుత్ సంస్థలకు ఈ బిల్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న రాయితీలు ఇక ముందు లభించవని, ప్రైవేటు కంపెనీలు మాఫియాగా ఏర్పడి విద్యుత్ చార్జీలు భారీగా పెంచేస్తాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, వ్యవసాయ పంప్‌సెట్లకు సైతం మీటర్లు బిగించనున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు
విద్యుత్ బిల్లును వ్యతిరేకించే పార్టీలకే విద్యుత్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని రత్నాకర్‌రావు తెలిపారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని విద్యుత్ ఉద్యోగులను కోరారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్, 1104 యూనియన్, 1535 యూని యన్, టీవీఈఏ, టీఈడబ్ల్యూఈఏ, బీసీ/ ఎస్సీ, ఎస్టీ/ ఓసీ/ ఎస్టీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ బిల్లు తెస్తే అర్ధగంటలో దేశం అంధకారం
Published Thu, Mar 11 2021 2:17 AM | Last Updated on Thu, Mar 11 2021 2:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment