విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో మరో మలుపు! | Employees of the division of power case In the Another twist! | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో మరో మలుపు!

Published Sat, Sep 12 2015 2:42 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో మరో మలుపు! - Sakshi

విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో మరో మలుపు!

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద వ్యవహారం శుక్రవారం మరో మలుపు తిరిగింది. వివాద పరిష్కారానికి సంబంధించి సంయుక్త కమిటీ ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు పేర్లను సూచించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ఇదిలా ఉంటే విభజన వివాద పరిష్కార బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి షీలాభిడే నేతృత్వంలోని కమిటీకి అప్పగిస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.

అసలు ఆ కమిటీ ప్రస్తుతం ఉనికిలో ఉందో లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఏదేమైనా కూడా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
జీతాలు.. రిలీవింగ్‌పైనే వాదనలు వింటాం...: ధర్మాసనం

తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశించిన మేర నలుగురు పేర్లను సిఫారసు చేయలేకపోతున్నామని తెలిపారు. అలా అయితే తాము ఇకపై ఉద్యోగుల జీతాల చెల్లింపు, ఉద్యోగుల రిలీవింగ్‌పై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులపైనే ప్రధానంగా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా తమ తమ వాదనలను వినిపించారు.
 
టీ సర్కార్ యూటర్న్ తీసుకుంది...
తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ కమిటీ ఏర్పాటునకు అంగీకరించిన తెలంగాణ, ఆ తరువాత యూటర్న్ తీసుకుందని, ఈ విషయాన్ని కూడా తాము పలు సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు తమ వైపు నుంచి నలుగురి పేర్లను సిఫారసు చేస్తూ వారి పేర్లను ఆయన కోర్టు ముందుంచారు.

ఈ సమయంలో షీలాభిడే కమిటీ ప్రస్తావన చర్చకు వచ్చింది. దీనికి తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, అసలు ఆ కమిటీకి చట్టబద్ధత లేదని, ప్రస్తుతం ఆ కమిటీ ఉనికిలో లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మీరు ఏర్పాటు చేయని కమిటీకి ఉద్యోగుల విభజన వివాద పరిష్కార బాధ్యతలను అప్పగిస్తారని ఎలా చెబుతారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలు ఆ కమిటీ ఉనికిలో ఉందా..? లేదో..? తెలుసుకుని చెప్పాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement