♦ ఉద్యోగుల విభజన వివాదంపై జస్టిస్ ధర్మాధికారి సంప్రదింపులు నిష్ఫలం
♦ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచన
♦ ఇరు రాష్ట్రాల అభిప్రాయాలపై త్వరలో హైకోర్టుకు కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ సంప్రదింపులు విఫలమయ్యాయి. మూడు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశాలు ఎలాంటి ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ మినిట్స్ కాపీని ‘సాక్షి’ సంపాదించింది. ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కమిటీ ఈ సమావేశాల మినిట్స్‌లో పేర్కొంది. ఈ సమావేశాల వివరాలను హైకోర్టుకు అప్పగించాలని, ఈ అంశంపై నిర్ణయాన్ని హైకోర్టుకే అప్పగించాలని నిర్ణయించింది.
సుదీర్ఘంగా చర్చలు
విద్యుత్ ఉద్యోగుల వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో దఫా చర్చల్లో భాగంగా ఈ కమిటీ గత నెల 30, ఈ నెల 1, 2వ తేదీల్లో ఇరు రాష్ట్రాల అధికారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన చివరి రోజు భేటీలో కూడా ఇరు రాష్ట్రాల అధికారులూ అవే వాదనలు వినిపించారు. స్థానికత ఆధారంగానే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలన్న డిమాండ్‌ను తెలంగాణ బలంగా వినిపించింది.
ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి సీనియారిటీ ప్రకారం విభజన జరపాలని ఏపీ పట్టుబట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాల్లో తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సమావేశాల వివరాలను హైకోర్టుకు వివరించి... నిర్ణయాన్ని కోర్టుకే అప్పగించాలని జస్టిస్ ధర్మాధికారి నిర్ణయించారు. ఆయన ప్రతిపాదించిన ముసాయిదా మార్గదర్శకాలను సైతం ఇరు రాష్ట్రాలు అంగీకరించలేదు. సూపర్ న్యూమరీ పోస్టుల మంజూరుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే చెప్పారు.
ఆప్షన్లు ఇవ్వాల్సిందే: ఏపీ
సరిపడా సంఖ్యలో పోస్టులు లేని సందర్భంలో ఉద్యోగుల కేటాయింపులు జరపకూడదని కమిటీ ఎదుట ఏపీ వాదించింది. 2014 జూన్ 1 నాటికి ఉన్న ఖాళీలను మినహాయించిన తర్వాతే తుది కేటాయింపులు జరపాలంది. డిస్కంల ఉద్యోగుల విభజన చేపట్టడానికి వీల్లేదంది. ఉమ్మడి రాష్ట్రం లోని ఏపీసీపీడీసీఎల్ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయని... వాటితోపాటు ఆ జిల్లాల్లోని పోస్టులు, ఉద్యోగుల్ని ఏపీకి కేటాయించారని తెలిపింది. ఏపీఎన్పీడీసీఎల్ (ప్రస్తుత టీఎస్‌ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీకి వెళితే అక్కడి పోస్టులు, ఉద్యోగుల్నీ ఏపీకే కేటాయించారని గుర్తు చేసింది. ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న అంశంపై ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
స్థానికత ప్రాతిపదికనే: తెలంగాణ
ఉన్నత స్థాయి పోస్టుల్లో ఏపీవారే ఎక్కువగా ఉండటంతోపాటు తెలంగాణకు జరి గిన అన్యాయాల నేపథ్యంలో... ఉద్యోగుల విభజనకు, పోస్టుల లభ్యతతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. కేటాయింపుల్లో వచ్చే ఉద్యోగులకు సరిపడా ఖాళీ పోస్టుల్లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టుల్ని సృష్టిం చుకోవాలని సూచించింది. 2009కి పూర్వం డిస్కంలలో జరిగిన నియామకాల్లో ‘ఆర్టికల్ 371డి’ నిబంధనను అమలు చేయనందున డిస్కంల ఉద్యోగుల విభజన సైతం జరపాలంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం విభజన చట్టం పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది.
‘విద్యుత్’ చర్చలు విఫలం
Published Tue, May 3 2016 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement