చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధికంగా సమ్మె చేయనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం.హరిబాబు వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగసంఘ నాయకులు స్థానిక వాడరేవురోడ్డులోని డివిజన్ ఇంజినీర్ కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించేందుకు కుట్రపన్నిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు అక్షయపాత్ర ఇచ్చి, సీమాంధ్రకు భిక్షాటన చేసే పాత్ర ఇచ్చినట్లవుతుందన్నారు. తక్కువ ఆదాయంతో సీమాంధ్ర అభివృద్ధి చెందలేదన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివినా ఉపాధిలేక రోడ్లపైనే అడుక్కోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు.
సింగరేణి బొగ్గు లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు టి.జయకరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులందరూ కార్యాచరణ రూపొందించుకుని దశల వారీగా ఉద్యమించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో జరిగే అనర్థాలపై కరపత్రాల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని రంగాలకు చెందిన జేఏసీ నాయకులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. ఉద్యోగులందరూ గురువారం సామూహిక సెలవు, 6న సహాయ నిరాకరణ,7న చలో విద్యుత్ సౌధ, 8,9,10 తేదీలు సహాయ నిరాకరణ, 11న అన్ని కేడర్‌లోని విద్యుత్ ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్ సిమ్‌కార్డులు యాజమాన్యానికి
అందజేయుట, 12 నుంచి నిరవధిక సమ్మె లో పాల్గొంటున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రకటనను వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమిస్తామని, సమ్మెతో ప్రజలకు ఇబ్బంది కలిగినా ఓర్పుతో సహకరించాలని కోరారు. అనంతరం నిరవధిక సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ టి.సాంబశివరావు, కోశాధికారి రాజేంద్రప్రసాద్, చీరాల డివిజన్ కమిటీ చైర్మన్ డీఈ టి.శ్రీనివాసరావు, వేటపాలెం ఏడీఈ అశోక్‌బాబు, ఆర్.నాగభూషణం, ఎం.వెంకటరెడ్డి, లైన్‌మన్ కళ్యాణరావు, వేటపాలెం ఏఈ టి.సత్యనారాయణ, డీ-2 సెక్షన్ ఏఈ వి.భాస్కరరావు, ఏఈఓ టి.శ్రీనివాసరావు, టౌన్ ఏఈ ఉదయకిరణ్ పాల్గొన్నారు.
12 నుంచి నిరవధిక సమ్మె
Published Thu, Sep 5 2013 5:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement
Advertisement