దిగొచ్చిన ప్రభుత్వం.. నేడు ఆదేశాలు జారీ
నేడు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
అన్ని డిమాండ్లపై సానుకూల స్పందన వస్తేనే
సమ్మెపై పునరాలోచిస్తామన్న జేఏసీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనశాఖ గురువారం ఆదేశాలు జారీచేయనుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు వేర్వేరుగా వేతన కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రైవేటు విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల జీతాలతో పోల్చిచూడాలంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. వేతన కమిటీలో ప్రైవేటు వ్యక్తికి స్థానం కల్పించారు. దీనిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడ్డారు. అందరికీ ఒకే వేతన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల జీతాలతో పోలికను, కమిటీలో బయటి వ్యక్తిని నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
ఈ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్‌లతో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాహూ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే రాష్ట్రం అంధకారంగా మారుతుందనే ఆందోళన ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.
చివరకు ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదముద్ర వేయించారు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నరకు ఉద్యోగ సంఘాలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా చర్చలకు ఆహ్వానించారు. ఒకే వేతన సవరణ కమిటీ వేయనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారికంగా సమాచారం లేదని, అయినప్పటికీ గురువారం యథావిధిగా వర్క్ టు రూల్‌తో పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, నేతలు కిరణ్, కళ్లెం శ్రీనివాసరెడ్డి, వెంకన్నగౌడ్, గణేష్‌రావు, భానుప్రకాశ్, వేదవ్యాసరావు చెప్పారు. మిగిలిన డిమాండ్లపైన కూడా సానుకూలంగా స్పందన వస్తేనే సమ్మెపై పునారాలోచిస్తామన్నారు. బుధవారం విద్యుత్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, కార్యాలయాలతో పాటు విద్యుత్ సౌధలో నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. సమ్మె పిలుపు కొనసాగుతుందన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు ఒకే వేతన కమిటీ
Published Thu, Feb 13 2014 3:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement