ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌లు
- ఏపీ నుంచి 204 మంది విద్యుత్ ఉద్యోగుల రాక
- అందరికీ పోస్టింగ్‌లు కేటాయించిన తెలంగాణ
- మరోవైపు రిలీవైన వారికి షోకాజ్‌లు పంపిస్తున్న ఏపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి స్వచ్ఛందంగా రిలీవైన తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌లు లభించాయి. ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో నుంచి రిలీవైన 204 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో పోస్టింగ్‌లు కేటాయించాయి. తమను తెలంగాణకు రిలీవ్ చేయాలని ఉద్యోగులు ఏడాదిగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించలేదు. దీంతో గత నెల 31న ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత స్టేట్ కేడర్ ఉద్యోగులు మూకుమ్మడిగా స్వచ్ఛందంగా రిలీవై సొంత రాష్ట్రంలో రిపోర్టు చేశారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి 151 మంది.. ఏపీ జెన్‌కో నుంచి 53 మంది రిలీవై వచ్చారు. వీరిలో దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం నుంచి రిలీవైన 28 మంది ఉద్యోగులు సైతం ఉన్నారు.
స్థానికత నిర్థారణ కోసం సర్టిఫికెట్ల పరిశీలన తదితర లాంఛనాల అనంతరం తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో వీరిని గత శుక్ర, శనివారాల్లో చేర్చుకున్నాయి. వీరంతా 2016 సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో పని చేస్తున్నట్లు పరిగణించి జీతాలు చెల్లించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలంగాణ స్థానికత కలిగిన వారేనని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అఫిడవిట్ రూపంలో స్వీకరించిన అనంతరమే వీరికి పోస్టింగ్‌లు కేటాయించారు. అఫిడవిట్ సమాచారంలో తేడాలుంటే ఉద్యోగం కోల్పోవడం తో పాటు క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అందరి నుంచి ప్రమాణ పత్రాన్ని స్వీకరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా, స్వచ్ఛందంగా రిలీవైన ఉద్యోగుల సర్వీ సు పుస్తకాలు, లాస్ట్ పే సర్టిఫికేట్(ఎల్‌పీసీ)ని ఇచ్చేందుకు ఏపీ అధికారులు అంగీకరించారని రిలీవైన ఉద్యోగులు చెపుతున్నారు. సొంత రాష్ట్రంలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు తెలంగాణ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ నుంచి షోకాజ్ నోటీసులు
ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవైన తెలంగాణ ఉద్యోగులకు ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు షోకాజ్ నోటిసులు జారీ చేస్తున్నాయి. స్వచ్ఛందంగా రిలీవ్ కావడం విభజన చట్టానికి విరుద్ధమని, భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నోటీ సుల్లో పేర్కొన్నాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం న్యాయస్థానాల పరిధిలో ఉన్న నేపథ్యంలో రిలీవ్ చేయలేకపోయామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎవరికివారుగా రిలీవై వెళ్లిపోవడం సరైంది కాదని పేర్కొన్నట్టు సమాచారం.