ఇళ్లపై యమపాశాలు..! | Current Wires On Houses In Nagarkurnool | Sakshi
Sakshi News home page

ఇళ్లపై యమపాశాలు..!

Published Mon, Nov 12 2018 2:40 PM | Last Updated on Wed, Mar 6 2019 6:21 PM

Current Wires On Houses In Nagarkurnool - Sakshi

ముష్టిపల్లిలో ఇళ్లపై ఉన్న విద్యుత్‌ వైర్లు

సాక్షి, పెద్దకొత్తపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజల నివాస ఇళ్లపై 11కేవీ విద్యుత్‌ వైర్లు వేలాడుతూ చిన్నపాటి గాలి, వర్షాలకు మంటలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్‌ వైర్లను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో ఇండ్లపై విద్యుత్‌ వైర్లు ఉన్న గ్రామాలు మండల కేంద్రంతోపాటు ముష్టిపల్లి, పెద్దకారుపాముల, దేవల్‌తిర్మలాపూర్, సాతాపూర్, కల్వకోల్, చెన్నపురావుపల్లి, జొన్నలబొగుడలో ప్రజల ఇండ్లపై విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయి. రైతులు పండించిన పంటలను మేడలపై ఆరబెట్టుకునేందుకు పైకి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి.

వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పెద్దకారుపాములలో వస్త్రాలను ఆరబెట్టేందుకు మేడపైకి వెళ్లిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఆరు నెలల క్రితం చంద్రకల్‌ గ్రామంలో ఇంటిపై ఉన్న విద్యుత్‌ వైరు తగలడంతో యువకుడు చనిపోయాడు. వెన్నచర్లలో 11కేవీ విద్యుత్‌ వైరు గొర్రెలమందపై పడటంతో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇళ్లపై ఉన్న వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


ఇళ్ల మధ్యన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ 
మండలంలోని వెన్నచర్ల, సాతాపూర్, దేదినేనిపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి గ్రామాలలో ఇండ్లమధ్యన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటంతో చిన్నపాటి ఈదురు గాలులు, వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫీజులు ఎగిరిపోవడంతో పెద్ద మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  

ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలి 
గ్రామాలలో ఇండ్ల మధ్యన ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి ప్రజల ఇబ్బందులు పడకుండ చూడాలి. గ్రామాల చివర విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించేందుకు విద్యుత్‌ అధికారులు చొరవ చూపాలి.  
– జలాల్‌ శివుడు, బీజేపీ మండలాధ్యక్షులు, పెద్దకొత్తపల్లి 


ఇళ్లపై వైర్లను తొలగించాలి 
పెద్దకొత్తపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి, మరికల్, సాతాపూర్, వెన్నచర్లలో ఇండ్లపై ఉన్న విద్యుత్‌ వైర్లను తొలగించి ఇండ్లకు దూరంగా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ అధికారులు బిల్లు వసూలుపై చూపిన శ్రద్ధ వైర్లు తొలగించడంపై చూపడం లేదు. ఇండ్లపై ఉన్న వైర్లను తొలగించాలి. 
– శేఖర్, పెద్దకొత్తపల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement