current wire
-
సోదరులిద్దరికీ ఒకేసారి వివాహం.. పెళ్లైన ఆరు నెలలకే మృత్యుఒడికి
సాక్షి, హుజూర్నగర్ (నల్గొండ): వివాహమైన ఆరుమాసాలకే ఓ యువకుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చింత్రియాల గ్రామానికి చెందిన పేరుపంగు వెంకయ్య ఏసమ్మ దంపతులకు కిరణ్ (25),రవీంద్రబాబు సంతానం. సోదరులిద్దరికీ గత మే నెలలో ఒకేసారి వివాహాలు జరిగాయి. వీరు పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ (కృష్ణానది)లో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. సోదరులిద్దరూ శుక్రవారం ఉదయం చేపలు పట్టేందుకు పడవలో కృష్ణానదిలోకి వెళ్లారు. రవీంద్ర బాబు పడవ నడుపుతుండగా కిరణ్ చేపల వల విసిరాడు. వల ప్రమాదవశాత్తు నది ఒడ్డుకు సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్ వైరుకు తగిలింది. దీంతో కిరణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందగా రవీంద్ర బాబుకు గాయాలయ్యాయి. అయితే, ప్రమాదంలో రవీంద్రబాబు నదిలో పడిపోవడంతో ఈదుకుంటూ బయటికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కిరణ్ మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, వివాహమైన ఆరు మాసాలకే కిరణ్ మృతిచెందడంతో అతడి భార్య సుభాషిణి, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు రవీంద్ర బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. గుండాల మండలంలో ఒకరు.. గుండాల : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామ ంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల మల్లేష్(36) గొర్రెలను కాస్తు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మల్లేష్ గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి వస్తకొండురు గ్రామ చెరువులో కరెంట్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాగా, మల్లేష్ చెరువు ఒడ్డున ఉన్న బండపై నిలబడి కరెంట్ వైరు విసిరే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. అయితే, అతడి చేతిలో ఉన్న వైరు కూడా నీటిలో పడడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒడ్డున్న మిగతా ఇద్దరు గమనించి వెంటనే విద్యుత్ ప్రసరణ నిలిపివేసి మల్లేష్‌ను జనగామ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
గ్రేటర్ వాసులను బెంబేలెత్తించిన వాన... ధ్వంసమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు
సాక్షి, హైదరాబాద్: భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు గ్రేటర్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున గాలివానతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగి లైన్లపై పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 400పైగా 11 కేవీ ఫీడర్లు, 80కిపైగా 33 కేవీ ఫీడర్లు ట్రిప్పవగా, 60పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. మరికొన్ని చోట్ల రాత్రి అంధకారం తప్పలేదు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు కరెంట్ లేకపోవడంతో ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్ట్‌లు, మంచినీటి సరఫరా మోటార్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో 1912 కాల్ సెంటర్ మూగబోగా, కొంతమంది లైన్మెన్లు, ఇంజినీర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. 850 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్ గ్రేటర్ జిల్లాల్లో చాలా వరకు ఓవర్‌హెడ్ లైన్లే. ఈ లైన్ల కిందే చెట్టు నాటుతుండటం, అవిపెరిగి పెద్దవై ఈదురుగా లులకు విరిగి పడుతుండటంతో తెగిపడుతున్నాయి. ప్రధాన వీధులు సహా శివారు ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు విద్యుత్ లైన్లను ఆనుకుంటున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగి గాలికి ఎగిరి లైన్ల మధ్య చిక్కుకుంటున్నాయి. ఒకదానికొకటి ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సివ చ్చింది. వర్షం వెలియగానే కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరించిన్పటికీ.. చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరేడు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఆ సర్కిళ్లలోనే ఎక్కువ నష్టం ఈదురు గాలితో కూడిన వర్షానికి సరూర్‌నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు డిస్కం ఇంజినీర్లు గుర్తించారు. ఎల్బీనగర్, నాగోలు, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, బీఎన్‌రెడ్డి, పసుమాముల, తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లోనే 37 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు ఎక్కువ ఉన్న కంటోన్మెంట్, బోయిన్పల్లి, ప్యారడైజ్, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్, కాచిగూడ, ఆస్మాన్‌గడ్, ఓల్డ్‌మలక్‌పేట్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, మీర్పేట్, బాలానగర్, ఉప్పల్, బోడుప్పల్, చర్లపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఐదు 33 కేవీ, పదిహేను 11 కేవీ, 37 ఎల్టీ పోల్స్ నేలకూలాయి. అంతేకాదు సైబర్‌సిటీ సర్కిల్లో 11 ఫీడర్లు ట్రిప్పవగా, హబ్సీగూడలో 35 ఫీడర్లు, మేడ్చల్‌లో 35, రాజేంద్రనగర్‌లో 18, సరూర్‌నగర్‌లో 21, సికింద్రాబాద్‌లో 17, హైదరాబాద్ సౌత్‌లో 14, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 12, బంజారాహిల్స్‌లో ఐదు ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
ఆస్తి కోసం దారుణం! తాతను హతమార్చిన మనవడు..
నూజివీడు: ఆస్తి కోసం సొంత తాతయ్యనే మనవడు హత్య చేశాడు. ఆపై దానిని దుండగుల పనిగా చిత్రీకరించి విఫలయ్యాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కోటవారిపేటకు చెందిన జూవ్వనపూడి గంగులు(70) అలియాస్ ఆదం ఈనెల 11వ తేదీ రాత్రి ఇంట్లోనే నిద్రిస్తూ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటనపై పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మృతుడికి నలుగురు కుమారులు కాగా, భార్య, రెండు, మూడో కుమారులు గతంలో మృతిచెందారు. ఆ తర్వాత ఆస్తి పంపకాల విషయమై వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మృతుడు గంగులు తన రెండు ఇళ్లను, పెద్ద కుమారుడైన శేఖర్‌కు రాస్తూ వీలునామా రాశాడు. దీంతో తన తాతపై మూడో కుమారుని కొడుకు, మనవడైన జువ్వనపూడి వరప్రసాద్(21) కక్ష పెంచుకున్నాడు. స్నేహితుని సాయంతో.. దీంతో వరప్రసాద్ తన స్నేహితుడైన నూజివీడు మండలం ఎంఎన్పాలెంకు చెందిన వనుకూరి ప్రేమకుమార్(23)తో కలిసి ఈనెల 11న అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో గంగులు తన ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా కరెంటు వైరుతో మెడకు చుట్టి గట్టిగా లాగి చంపారు. ఆ తర్వాత రూ.70వేల నగదు, నాలుగు బంగారు ఉంగరాలు, గొలుసు, ఆస్తికి సంబంధించి రాసిన వీలునామా తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత తనకు సహకరించినందుకు గాను తన స్నేహితుడికి రూ.30వేలు నగదు, రెండు ఉంగరాలను ఇచ్చాడు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పట్టణ, రూరల్, ముసునూరు ఎస్ఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ని బట్టి కుటుంబ సభ్యులే ఈ ఘాతునికి పాల్పడి ఉంటారన్న అనుమానంతో విచారించిన పోలీసులు.. 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్ఐలు తలారి రామకృష్ణ, ఎం. లక్ష్మణ్, కె. రాజారెడ్డి, అజయ్, సిబ్బందికి రివార్డులను అందజేశారు. చదవండి: అమ్మో! చెడ్డీ గ్యాంగ్!! స్కెచ్ వేశారో.. -
ఇళ్లపై యమపాశాలు..!
సాక్షి, పెద్దకొత్తపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజల నివాస ఇళ్లపై 11కేవీ విద్యుత్ వైర్లు వేలాడుతూ చిన్నపాటి గాలి, వర్షాలకు మంటలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ వైర్లను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో ఇండ్లపై విద్యుత్ వైర్లు ఉన్న గ్రామాలు మండల కేంద్రంతోపాటు ముష్టిపల్లి, పెద్దకారుపాముల, దేవల్‌తిర్మలాపూర్, సాతాపూర్, కల్వకోల్, చెన్నపురావుపల్లి, జొన్నలబొగుడలో ప్రజల ఇండ్లపై విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. రైతులు పండించిన పంటలను మేడలపై ఆరబెట్టుకునేందుకు పైకి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పెద్దకారుపాములలో వస్త్రాలను ఆరబెట్టేందుకు మేడపైకి వెళ్లిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఆరు నెలల క్రితం చంద్రకల్ గ్రామంలో ఇంటిపై ఉన్న విద్యుత్ వైరు తగలడంతో యువకుడు చనిపోయాడు. వెన్నచర్లలో 11కేవీ విద్యుత్ వైరు గొర్రెలమందపై పడటంతో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇళ్లపై ఉన్న వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇళ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ మండలంలోని వెన్నచర్ల, సాతాపూర్, దేదినేనిపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి గ్రామాలలో ఇండ్లమధ్యన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో చిన్నపాటి ఈదురు గాలులు, వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు ఎగిరిపోవడంతో పెద్ద మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలి గ్రామాలలో ఇండ్ల మధ్యన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ప్రజల ఇబ్బందులు పడకుండ చూడాలి. గ్రామాల చివర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు విద్యుత్ అధికారులు చొరవ చూపాలి. – జలాల్ శివుడు, బీజేపీ మండలాధ్యక్షులు, పెద్దకొత్తపల్లి ఇళ్లపై వైర్లను తొలగించాలి పెద్దకొత్తపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి, మరికల్, సాతాపూర్, వెన్నచర్లలో ఇండ్లపై ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి ఇండ్లకు దూరంగా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ అధికారులు బిల్లు వసూలుపై చూపిన శ్రద్ధ వైర్లు తొలగించడంపై చూపడం లేదు. ఇండ్లపై ఉన్న వైర్లను తొలగించాలి. – శేఖర్, పెద్దకొత్తపల్లి -
చిన్నారిని నిర్బంధించి వైర్లతో కొట్టిన తండ్రి
-
కరెంటు వైరు తగిలి మత్స్యకారుడు మృతి
కృష్ణా(ఒంటిమిల్లు): రోడ్డుపై పడ్డ కరెంటు వైరు తగిలి ఓ మత్స్యకారుడుమృతిచెందిన సంఘటన ఒంటిమిల్లు మండలంలోని 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి లచ్చబండ మేజర్ డ్రైన్లో వేటకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒంటిమిల్లు మండలం ముంజులూరు గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూలడంతో ఈ సంఘటనకు కారణమైంది. -
ఈదురు గాలుల విధ్వంసం
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : పట్టణంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షంతో పాటు ఈదురు గాలుల బీభత్సానికి ఆత్మకూరు విధ్వంసం అయింది. ఒక్కసారిగా సుడిగాలి లేచి పది నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పైకప్పులు, హోర్డింగ్‌లు నేలకూలాయి. ఆర్టీసీ డిపోలో ఓ దుకాణంపై చెట్లు విరిగి పడిపోయాయి. సమీపంలోని కల్వర్టు వద్ద మరో చెట్టు విరిగి రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జ్యోతినగర్ సమీపంలో విద్యుత్ తీగలతో పాటు డిష్ తీగలు తెడిపడిపోయాయి. సమీపంలోనే గణేష్ విగ్రహాలు తయా రు చేసే శిల్పుల గుడారాలు సైతం నేలమట్టమయ్యా యి. నాగులపాడు వెళ్లే రహదారిలో హోర్డింగ్‌లు, విద్యు త్ స్తంభాలు ధ్వంసమై నేలకొరిగాయి. ఆసుపత్రి ఆవరణలో ఇనుప కమ్ములు ఎగిరిపడ్డాయి. పోలీసుస్టేషన్ ఆవరణలో ఓ చెట్టు విరిగి పోలీసు జీపుపై పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎల్‌ఆర్‌పల్లిలో చెట్లు కూలడంతో పాటు ఇళ్ల ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెరువుకట్ట సమీపంలో చెట్టు కూలి విద్యుత్ స్తంభం విరిగిపడింది. విద్యుత్ శాఖ, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద చెట్లు నేలకూలాయి. సోమశిల రోడ్ సెంటర్లో కొయ్యల మిల్లు పైకప్పు కూలిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో జనజీవనం స్తంభించింది. పట్టణ సమీపంలోని పొలాల్లో పని చేసుకునేవారు వర్షం, గాలికి చెట్టు కిందకు వెళ్లడంతో చెట్టు కూలి పలువురు గాయపడ్డారు. విద్యుత్ స్తంభం, వైర్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతుండగా, విద్యుత్ తీగలు, స్తంభాలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందోననే ఆందోళన నెలకొంది. అరటి, మామిడి చెట్లు నేలమట్టం వీర్లగుడిపాడులో రూ.50 లక్షలకు పైగా నష్టం సంగం : ఈదురు గాలులు అన్నదాతలను అతలాకుతలం చేసింది. మంగళవారం ఒక్కసారిగా మారిన వాతావరణంతో సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాటంరెడ్డి జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితర రైతులకు చెందిన పది ఎకరాలకుపైగా అరటి తోటలు ఈదురుగాలులకు నేలమట్టం అయ్యాయి. మరో 40 ఎకరాల్లో మామిడి చెట్లు నేలకూలాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కంట తడిపెట్టారు. అరటి చెట్లు కూలడంతో అరటి గెలలు విరిగిపోయాయి. సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షంతో పాటు సుడిగాలి ఒక్కసారిగా గ్రామాన్ని చుట్టడంతో పెన్నానది తీరాన ఉన్న ఆకు తోటలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.