ఈదురు గాలుల విధ్వంసం | Gusty winds of destruction | Sakshi
Sakshi News home page

ఈదురు గాలుల విధ్వంసం

Published Wed, May 28 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

Gusty winds of destruction

ఆత్మకూరు, న్యూస్‌లైన్ : పట్టణంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షంతో పాటు ఈదురు గాలుల బీభత్సానికి ఆత్మకూరు విధ్వంసం అయింది. ఒక్కసారిగా సుడిగాలి లేచి పది నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పైకప్పులు, హోర్డింగ్‌లు నేలకూలాయి. ఆర్టీసీ డిపోలో ఓ దుకాణంపై చెట్లు విరిగి పడిపోయాయి. సమీపంలోని కల్వర్టు వద్ద మరో చెట్టు విరిగి రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జ్యోతినగర్ సమీపంలో విద్యుత్ తీగలతో పాటు డిష్ తీగలు తెడిపడిపోయాయి. సమీపంలోనే గణేష్ విగ్రహాలు తయా రు చేసే శిల్పుల గుడారాలు సైతం నేలమట్టమయ్యా యి.
 
 నాగులపాడు వెళ్లే రహదారిలో హోర్డింగ్‌లు, విద్యు త్ స్తంభాలు ధ్వంసమై నేలకొరిగాయి. ఆసుపత్రి ఆవరణలో ఇనుప కమ్ములు ఎగిరిపడ్డాయి. పోలీసుస్టేషన్ ఆవరణలో ఓ చెట్టు విరిగి పోలీసు జీపుపై పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎల్‌ఆర్‌పల్లిలో చెట్లు కూలడంతో పాటు ఇళ్ల ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెరువుకట్ట సమీపంలో చెట్టు కూలి విద్యుత్ స్తంభం విరిగిపడింది. విద్యుత్ శాఖ, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద చెట్లు నేలకూలాయి.
 
 సోమశిల రోడ్ సెంటర్‌లో కొయ్యల మిల్లు పైకప్పు కూలిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో జనజీవనం స్తంభించింది. పట్టణ సమీపంలోని పొలాల్లో పని చేసుకునేవారు వర్షం, గాలికి చెట్టు కిందకు వెళ్లడంతో చెట్టు కూలి పలువురు గాయపడ్డారు. విద్యుత్ స్తంభం, వైర్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతుండగా, విద్యుత్ తీగలు, స్తంభాలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందోననే ఆందోళన నెలకొంది.

 అరటి, మామిడి చెట్లు నేలమట్టం
 వీర్లగుడిపాడులో రూ.50 లక్షలకు పైగా నష్టం  
 సంగం : ఈదురు గాలులు అన్నదాతలను అతలాకుతలం చేసింది. మంగళవారం ఒక్కసారిగా మారిన వాతావరణంతో సంగం మండలం వీర్లగుడిపాడు  గ్రామానికి చెందిన కాటంరెడ్డి జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితర రైతులకు చెందిన పది ఎకరాలకుపైగా అరటి తోటలు ఈదురుగాలులకు నేలమట్టం అయ్యాయి.
 
 మరో 40 ఎకరాల్లో మామిడి చెట్లు నేలకూలాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కంట తడిపెట్టారు. అరటి చెట్లు కూలడంతో అరటి గెలలు విరిగిపోయాయి.  సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షంతో పాటు సుడిగాలి ఒక్కసారిగా గ్రామాన్ని చుట్టడంతో పెన్నానది తీరాన ఉన్న ఆకు తోటలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement