పేరపంగు కిరణ్ (ఫైల్)
సాక్షి, హుజూర్‌నగర్ (నల్గొండ): వివాహమైన ఆరుమాసాలకే ఓ యువకుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చింత్రియాల గ్రామానికి చెందిన పేరుపంగు వెంకయ్య ఏసమ్మ దంపతులకు కిరణ్ (25),రవీంద్రబాబు సంతానం. సోదరులిద్దరికీ గత మే నెలలో ఒకేసారి వివాహాలు జరిగాయి. వీరు పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ (కృష్ణానది)లో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు.
సోదరులిద్దరూ శుక్రవారం ఉదయం చేపలు పట్టేందుకు పడవలో కృష్ణానదిలోకి వెళ్లారు. రవీంద్ర బాబు పడవ నడుపుతుండగా కిరణ్ చేపల వల విసిరాడు. వల ప్రమాదవశాత్తు నది ఒడ్డుకు సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్ వైరుకు తగిలింది. దీంతో కిరణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందగా రవీంద్ర బాబుకు గాయాలయ్యాయి.
అయితే, ప్రమాదంలో రవీంద్రబాబు నదిలో పడిపోవడంతో ఈదుకుంటూ బయటికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కిరణ్ మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, వివాహమైన ఆరు మాసాలకే కిరణ్ మృతిచెందడంతో అతడి భార్య సుభాషిణి, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు రవీంద్ర బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
గుండాల మండలంలో ఒకరు..
గుండాల : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామ ంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల మల్లేష్(36) గొర్రెలను కాస్తు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మల్లేష్ గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి వస్తకొండురు గ్రామ చెరువులో కరెంట్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లాడు.
కాగా, మల్లేష్ చెరువు ఒడ్డున ఉన్న బండపై నిలబడి కరెంట్ వైరు విసిరే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. అయితే, అతడి చేతిలో ఉన్న వైరు కూడా నీటిలో పడడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒడ్డున్న మిగతా ఇద్దరు గమనించి వెంటనే విద్యుత్ ప్రసరణ నిలిపివేసి మల్లేష్‌ను జనగామ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment