షార్‌కు తగిలిన షాక్
సాక్షి నెట్‌వర్క్ : విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది నిరవధిక సమ్మె కారణంగా ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. మంగళవారం రోజూ సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. రాత్రి సమయంలో అక్కడక్కడా విద్యుత్‌ను పునరుద్ధరించినా ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ సరఫరా క్రమంగా షట్‌డౌన్ అయింది. దేశానికే తలమానికమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు సమైక్య ఉద్యమ సెగ తాకింది. విద్యుత్ ఉద్యోగులు మంగళవారం సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్నం 1.20కి మన్నూరు పోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షార్, రైల్వే, పారిశ్రామికవాడకు వెళ్లే లైన్లు ట్రిప్ అయ్యాయి. షార్ కేంద్రంలో ఈ నెల 28న అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం మార్స్‌మిషన్ ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పనికి తీవ్ర ఆటంకం కలిగింది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఉత్పాదన అందిస్తున్న విజయవాడలోని ఎన్టీటీపీఎస్‌లో ఏడు యూనిట్లు నిలిచిపోవడంతో సదరన్ పవర్ గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖలోని కేజీహెచ్, రిమ్స్, కాకినాడ జీజీహెచ్ తదితర ప్రధాన ఆస్పత్రులు, నీటి సరఫరా కేంద్రాలకు అత్యవసర కేటగిరీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో 240 మెగావాట్లు, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌లో 57మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా లోయర్ సీలేరు ఏపీజెన్‌కో ప్రాజెక్టు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికీ సమైక్య సెగ తగిలింది.
ఉద్యోగుల సమ్మెతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఈపీడీసీఎల్‌కు సుమారు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెలంగాణకు చెందిన డొంకరాయి జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ కృష్ణయ్య తమ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. అధికారులను గదిలో నిర్బంధించి సమైక్య నినాదాలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలలో 40శాతం ఉత్పత్తులు పడిపోగా, సున్నం పరిశ్రమలు మూడపడ్డాయి. గుంటూరు, గణపవరం, పేరేచర్ల ప్రాంతాల్లోని పలు స్పిన్నింగ్ మిల్లుల్లో నూలు తయారీకి తీవ్ర ఆటంకం కలిగింది.
అయోమయంలో రైల్వే అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై ప్రభావం చూపింది. ఏ రైలు నడపాలి, ఏ రైలును రద్దుచేయాలో తెలియక అధికారులు అయోమయంలో పడిపోయారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే గోదావరి, విశాఖ, గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా నిలిపివేసినట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు ఉదయం ప్రకటించగా, మధ్యాహ్నానికి అత్యవసర సర్వీసులకు విద్యుత్తును పునరుద్ధరించడంతో వాటిని తిరిగి నడిపారు. బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. విశాఖపోర్టులో విద్యుత్ కోత కారణంగా సోమవారం అర్థరాత్రి వచ్చిన నౌకలకు నావిగేషన్ చూపలేకపోవడంతో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. స్టీల్‌ప్లాంట్‌లో మాత్రం కొంచెం పురోగతి కనిపించింది.