ఓపీ సేవలు, వార్డు డ్యూటీల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్‌జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్‌పర్సన్ డాక్టర్ డి.శ్రీనా«థ్‌లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అంతా ఈ సమ్మెలో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో అనేక చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లకు తగిన పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వస్తోందని, తమ సమస్యలు సమగ్రంగా పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రోగులు, సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల తాము చింతిస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
స్టైపెండ్‌లను సకాలంలో విడుదల చేసేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment