తిరిగి తెలంగాణకు..!
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా ఉద్యోగం, జీతభత్యాలు లేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ‘ఏపీ స్థానికత’ విద్యుత్ ఉద్యోగులకు ఉపశమనం లభించింది. ఈ వివాదంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో విధుల్లోంచి రిలీవ్ చేసిన 1,251 మంది విద్యుత్ ఉద్యోగులను తిరిగి తాత్కాలికంగా చేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఇందుకు అనుమతిస్తూ బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేయగా... ఆ వెంటనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చర్యలు చేపట్టాయి. హైకోర్టు ఆదేశాల అమలుకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం సాయంత్రం ఏపీ జెన్‌కో సీఎండీ కావేటి విజయానంద్‌కు లేఖ రాశారు. జనాభా దామాషా ప్రకారం ఆ ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిల్లో 42 శాతం తెలంగాణ వాటాగా.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం తమ 58 శాతం వాటాను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల జీతభత్యాలను తొలుత తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే... అందులో తమ రాష్ట్ర వాటాను తర్వాత ఇచ్చేస్తామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు.
గడువు దగ్గర పడడంతో..
విద్యుత్ ఉద్యోగుల విభజనకు పుట్టినచోటు ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ జూన్ 6న తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు 1,251 మంది ఉద్యోగులను విధుల్లోంచి రిలీవ్ చేశాయి. మరోవైపు వారిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు... ఆ ఉద్యోగులను తాత్కాలికంగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించడంతోపాటు జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారికి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది.
నాలుగు వారాల్లో తీర్పును అమలు చేయాలని గడువు విధించింది. ఈ గడువు ఈనెల 20తో ముగియనుంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త వెనక్కితగ్గాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 52 శాతం జీతభత్యాల భారాన్ని భరించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పుపై ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది.
వారు ‘సూపర్’ న్యూమరీ!
రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకున్నా... వారికి గతంలో నిర్వహించిన పోస్టులను కట్టబెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి అప్పట్లోనే ఈ ఖాళీలను భర్తీచేశారు. రిలీవైన ఉద్యోగులను తిరిగి చేర్చుకోకముందే తెలంగాణ అధికారులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతలు కల్పించి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ‘రిలీవైన’ ఉద్యోగుల కోసం తాత్కాలికంగా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని నిర్ణయం తీసుకుంది.