payroll
-
హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..
న్యూఢిల్లీ: మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి కంపెనీ యాజమాన్యం నోరెళ్లబెట్టింది. కంపెనీ హెచ్ఆర్ కావడంతో ఎటువంటి ఉద్యోగం లేని తన భార్యకు తాను పనిచేస్తోన్న కంపెనీ నుండి జీతం వచ్చేలా చేసి పదేళ్లలో నాలుగు కోట్ల కంపెనీ సొమ్మును కొల్లగొట్టారు. ఢిల్లీకి చెందిన మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో మోసం బయటపడటానికి చాలా సమయం పట్టింది. కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నిరుద్యోగియైన తన భార్య పేరును ఎలాగోలా తన కంపెనీ పే రోల్ లో చేర్చాడు. దీంతో ఆమెకు కూడా కంపెనీలోని మిగతా ఉద్యోగుల్లాగానే నెలవారీ జీతం అకౌంట్లో జమయ్యేది. కంపెనీకి వెండర్ కు మధ్య వారధిలా ఉండే హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ పాత్రలో రాధా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ తంతు మొత్తాన్ని జాగ్రత్తగా నడిపించాడు. మొదటగా ఉద్యోగుల జీతభత్యాల వివరాల్లో తన భార్య పేరును ఎక్సెల్ షీటులో చేర్చి వెండర్ కు పంపేవాడు. వెండర్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను పైపైన చూసి సంతకం చేసి తిరిగి పంపేవాడు. అటుపై ఈ ఫైలును రాధా తన డైరెక్టర్ కు, ఆయన ఆమోదించిన తర్వాత చివరిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారికి పంపి ఆఖర్లో తాను సంతకం చేసి అకౌంట్స్ కు పంపేవాడు. అకౌంట్స్ వారు యధాప్రకారమే జీతాలు చెల్లించేవారు. ఇలా పదేళ్ల పాటు సాగిన దందాలో కంపెనీకి సుమారు రూ.4 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడటంతో కంపెనీ యాజమాన్య నివ్వెరపోయింది. రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి విస్తుపోయిన కంపెనీ వెంటనే పోలీసు కంప్లైంటు ఇచ్చి అతడిని కటకటాల వెనక్కు పంపించారు. ఇది కూడా చదవండి: కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్ పాటలు, వీడియోలు -
ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ఇక జూన్‌లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) -
తిరిగి తెలంగాణకు..!
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా ఉద్యోగం, జీతభత్యాలు లేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ‘ఏపీ స్థానికత’ విద్యుత్ ఉద్యోగులకు ఉపశమనం లభించింది. ఈ వివాదంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో విధుల్లోంచి రిలీవ్ చేసిన 1,251 మంది విద్యుత్ ఉద్యోగులను తిరిగి తాత్కాలికంగా చేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అనుమతిస్తూ బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేయగా... ఆ వెంటనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చర్యలు చేపట్టాయి. హైకోర్టు ఆదేశాల అమలుకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ.. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం సాయంత్రం ఏపీ జెన్కో సీఎండీ కావేటి విజయానంద్‌కు లేఖ రాశారు. జనాభా దామాషా ప్రకారం ఆ ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిల్లో 42 శాతం తెలంగాణ వాటాగా.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తమ 58 శాతం వాటాను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల జీతభత్యాలను తొలుత తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే... అందులో తమ రాష్ట్ర వాటాను తర్వాత ఇచ్చేస్తామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. గడువు దగ్గర పడడంతో.. విద్యుత్ ఉద్యోగుల విభజనకు పుట్టినచోటు ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ జూన్ 6న తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు 1,251 మంది ఉద్యోగులను విధుల్లోంచి రిలీవ్ చేశాయి. మరోవైపు వారిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు... ఆ ఉద్యోగులను తాత్కాలికంగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించడంతోపాటు జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారికి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో తీర్పును అమలు చేయాలని గడువు విధించింది. ఈ గడువు ఈనెల 20తో ముగియనుంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త వెనక్కితగ్గాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 52 శాతం జీతభత్యాల భారాన్ని భరించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పుపై ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది. వారు ‘సూపర్’ న్యూమరీ! రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకున్నా... వారికి గతంలో నిర్వహించిన పోస్టులను కట్టబెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి అప్పట్లోనే ఈ ఖాళీలను భర్తీచేశారు. రిలీవైన ఉద్యోగులను తిరిగి చేర్చుకోకముందే తెలంగాణ అధికారులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతలు కల్పించి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ‘రిలీవైన’ ఉద్యోగుల కోసం తాత్కాలికంగా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని నిర్ణయం తీసుకుంది. -
ట్రెజరీకి మళ్లీ తాళాలు
నిలిచిన 3,500 బిల్లులు స్తంభించిన రూ.250కోట్ల చెల్లింపులు ఆగిన రూ.50కోట్ల సామాజిక పింఛన్లు విశాఖపట్నం: ఖజానాకు మళ్లీ తాళాలు పడ్డాయి. వేలాది బిల్లులు నిలిచిపోయాయి. వందల కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ కొర్రీలు వేయడంతో వేలాది మంది చిరుద్యోగులు ఇళ్లల్లో పండగ సందడి లేకుండా పోయింది. ఒకవైపు ఉత్సవాలు..సంబరాలు అంటూ మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్న సర్కార్ ఆర్ధిక లోటు సాకుతో చెల్లింపులను నిలిపివేసింది. గత నెల 25వ తేదీ నుంచి చెల్లింపులకు బ్రేకులు పడ్డాయి. సెప్టంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు,కొద్దిమంది రిటైర్డు ఉద్యోగులకు మాత్రమే పింఛ న్లను చెల్లించారు. ఇతర బిల్లులను పూర్తిగా నిలిపి వేసింది. ట్రెజరీలో బిల్లులు పాసవుతున్నా...బ్యాంకులకు చేరకుండానే హైదరా బాద్ స్థాయిలో బ్రేకులేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులకు సామాజిక పింఛన్లతో పాటు అంగన్వాడీ టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలనుకూడా నిలిపివేసింది. సామాజిక పింఛన్ల కింద వివిధ శాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులకు రూ.50కోట్ల మేర చెల్లింపులునిలిచిపోయాయి. ఇక గత రెండు మూడు నెలల్లో రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపివేశారు. లీవ్ ఎన్‌క్యాష్ మెంట్, సరండర్ లీవ్ బిల్లులు ఆపేశారు. అంగన్వాడీ టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతభత్యాల చెల్లింపులను నిలిపివేశారు. వీరికి వేతనాల రూపంలో చెల్లించాల్సిన రూ.25కోట్ల వరకు నిలిపివేశారు. 13వ, 14వ ఆర్ధిక సంఘానికి చెందిన నిధుల చెల్లింపులు కూడా ఆపేశారు. ట్రెజరీ పరిధిలో 3,500 బిల్లులకు సంబంధించి రూ.250కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయినట్టు అంచనా. -
టీటీడీలో పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం
పాత పద్ధతిలోనే జీతభత్యాల చెల్లింపునకు మొగ్గు జూన్ ఒకటిన జీతాల చెల్లింపు అనుమానమే ఉద్యోగుల్లో ఆందోళన సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ఉద్యోగుల జీతభత్యాలను సులభంగా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం పాడుతున్నారు. ఈ విభాగాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు నిన్నటికి నిన్న అధికారులు హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లను ఆయా విభాగాల శాఖాధిపతులకు శనివారంలోగా అందజేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో టీటీడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మే మాసానికి చెందిన జీతాలు జూన్ ఒకటో తేదీన వచ్చే అవకాశాలు లేవని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల కోసం నాలుగు సంవత్సరాల కిందట ప్రత్యేకంగా పే అండ్ అకౌంట్స్ విభాగం ఏర్పాటు చేశారు. హెచ్ఆర్ మ్యాప్స్ అనే ప్రరుువేటు కంపెనీ సహకారంతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అన్ని విభాగాల సిబ్బంది, అధికారుల జీతాలు,అలెవెన్స్‌లను పే అండ్ అకౌంట్స్ విభాగం చెల్లించేది. టీటీడీలో 9,163 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా 25 కోట్ల రూపాయలను జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విభాగం ఏర్పాటు కాకముందు ఆయా శాఖల అధిపతుల కార్యాలయాల నుంచి జీతాల బిల్లులు అకౌంట్స్ విభాగానికి వెళ్లేవి. ఇదంతా పెద్ద తతంగం కావడంతో అన్ని విభాగాల సిబ్బంది జీతాలు చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు ఒక కంపెనీకి బాధ్యతలు అప్పగించి టీటీడీ పరిపాలనాభవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తగా సాంకేతిక పరికరాలు, ఖరీదైన ఫర్నీచర్ కొనుగోలు చేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విభాగంలో 187 మంది సిబ్బందిని కూడా నియమించారు. అయితే సిబ్బంది కొరత తదితర కారణాలు సాకుగా చూపి కొందరు అధికారులు ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే భావన కల్పించారు. దీంతో పాత పద్ధతిలో జీతాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించి హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. జీతభత్యాల చెల్లింపులకుగాను పాత పద్ధతిని పునరుద్ధరించడంతో వచ్చే నష్టాలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు తాజా ఆదేశాలు జారీ చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా పూర్తిగా రద్దు చేసి సర్వీసు రిజిస్టర్లు ఆయా శాఖల అధిపతులకు అప్పగిస్తే ఆయా రిజిస్టర్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్టయితే సంబంధిత ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో ఉంది. పాత పద్ధతిలో జీతభత్యాల చెల్లింపులు సక్రమంగా జరిగే వరకు పే అండ్ అకౌంట్స్ విభాగం పనిచేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశాలు ఉన్నాయనేది వారి వాదనగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు సర్వీసు రిజిస్టర్లు శాఖాధిపతులకు అప్పగిస్తే వాటిని పరిశీలించి జీతాలు చెల్లించేందుకు పదిరోజులకు పైగా సమయం పడుతుందని అంటున్నారు. ఇదే జరిగితే జూన్ మాసంలో చెల్లించాల్సిన జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం తప్పదని చెబుతున్నారు. మొత్తానికి ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల వ్యవహారంలో టీటీడీ అనుసరిస్తున్న ధోరణి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్టుగా తయారయిందనే విమర్శలు వస్తున్నాయి.