నిలిచిన 3,500 బిల్లులు
స్తంభించిన రూ.250కోట్ల చెల్లింపులు
ఆగిన రూ.50కోట్ల సామాజిక పింఛన్లు
విశాఖపట్నం: ఖజానాకు మళ్లీ తాళాలు పడ్డాయి. వేలాది బిల్లులు నిలిచిపోయాయి. వందల కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ కొర్రీలు వేయడంతో వేలాది మంది చిరుద్యోగులు ఇళ్లల్లో పండగ సందడి లేకుండా పోయింది. ఒకవైపు ఉత్సవాలు..సంబరాలు అంటూ మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్న సర్కార్ ఆర్ధిక లోటు సాకుతో చెల్లింపులను నిలిపివేసింది. గత నెల 25వ తేదీ నుంచి చెల్లింపులకు బ్రేకులు పడ్డాయి. సెప్టంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు,కొద్దిమంది రిటైర్డు ఉద్యోగులకు మాత్రమే పింఛ న్లను చెల్లించారు. ఇతర బిల్లులను పూర్తిగా నిలిపి వేసింది. ట్రెజరీలో బిల్లులు పాసవుతున్నా...బ్యాంకులకు చేరకుండానే హైదరా బాద్ స్థాయిలో బ్రేకులేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులకు సామాజిక పింఛన్లతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలనుకూడా నిలిపివేసింది.
సామాజిక పింఛన్ల కింద వివిధ శాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులకు రూ.50కోట్ల మేర చెల్లింపులునిలిచిపోయాయి. ఇక గత రెండు మూడు నెలల్లో రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపివేశారు. లీవ్ ఎన్‌క్యాష్ మెంట్, సరండర్ లీవ్ బిల్లులు ఆపేశారు. అంగన్‌వాడీ టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతభత్యాల చెల్లింపులను నిలిపివేశారు. వీరికి వేతనాల రూపంలో చెల్లించాల్సిన రూ.25కోట్ల వరకు నిలిపివేశారు. 13వ, 14వ ఆర్ధిక సంఘానికి చెందిన నిధుల చెల్లింపులు కూడా ఆపేశారు. ట్రెజరీ పరిధిలో 3,500 బిల్లులకు సంబంధించి రూ.250కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయినట్టు అంచనా.
ట్రెజరీకి మళ్లీ తాళాలు
Published Wed, Oct 14 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM
Advertisement
Advertisement