ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనపై జిల్లావాసుల్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరును, ప్రజాప్రతినిధుల వైఖరిని ఖండిస్తూ బంద్‌లు, ర్యాలీలతో నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడానికి నిరసనగా ఎన్‌జీఓల పిలుపు మేరకు 48 గంటల బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, కార్మికులు, ప్రైవేటు వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంద్‌లో పాల్గొన్నారు. దీంతో రెండు రోజులుగా జిల్లాలో ఎక్కడా దుకాణం తెరుచుకున్న దాఖలాల్లేవు. వాహనాలు కూడా తిరగలేదు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాలు జన సంచారం లేక బోసిపోయాయి. మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం శనివారానికి 67వ రోజుకు చేరుకుంది.
మార్కాపురంలో సమైక్యాంధ్ర కోసం నాగిరెడ్డి రామిరెడ్డి అనే హోటల్ కార్మికుడు ఆత్మాహుతికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో దాదాపు 80 శాతం శరీరం కాలింది. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
రెండు రోజులుగా స్తంభించిన నగరం: జిల్లా నలుమూలల నుంచి రోజూ వేల సంఖ్యలో వచ్చే జన సంచారంతో అత్యంత రద్దీగా ఉండే ఒంగోలులో రెండు రోజులుగా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బంద్‌తో నగరంలోని వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, బ్యాంక్‌లు, ఏటీఎంలు, హోటళ్లు మూతపడ్డాయి. పీఆర్ ఉద్యోగులు స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి ఆందోళన వ్యక్తంచేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ జయాకర్‌ను అరెస్టు చేయడంతో ఉద్యోగులు కర్నూల్‌రోడ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు దిగివచ్చి జయకర్‌ను విడుదల చేయడంతో ఉద్యోగులు శాంతించారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కర్నూల్‌రోడ్డులోని వ్యాపార సంస్థల యజమానులు కర్నూల్‌రోడ్డులో ఆందోళనకు దిగి, మానవహారం నిర్వహించారు.
రెండో రోజు సంపూర్ణంగా బంద్..
జిల్లాలో రెండో రోజు బంద్ సంపూర్ణంగా సాగింది. అన్ని రకాల వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగుల ఆందోళనలు కొనసాగాయి. అద్దంకి పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీఓ, ఆర్టీసీ జేఏసీల నాయకులు మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. రోడ్డుపైనే టెంట్లు వేసి బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు.
మరోపక్క సమైక్యాంధ్ర దీక్షలు 48వ రోజుకు చేరాయి. మేదరమెట్లలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, మానహారం ఏర్పాటు చేశారు. చీరాలలో సమైక్యవాదులు రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించారు. రామకృష్ణాపురంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మండలంలోని గాంధీనగర్ పంచాయతీ ఏకే అండ్ కే పాఠశాల విద్యార్థులు మానవహారం చేశారు. వేటపాలెంలో బంద్ విజయవంతమైంది. జేఏసీ నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. పర్చూరులోనూ రెండో రోజు బంద్ కొనసాగింది. టీడీపీ ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకొల్లులో నిరసనలు మిన్నంటాయి. మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. దర్శిలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు చెప్పి నిరసన తెలిపారు. ఎన్‌జీఓలు రహదారులు దిగ్బంధనం చేశారు.
కందుకూరు పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు బంద్ కొనసాగింది. గుడ్లూరులో టీడీపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. జరుగుమల్లి మండలంలోని వావిలేటిపాడు అడ్డరోడ్డులో ఆర్టీసీ కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. కనిగిరిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం గృహ నిర్మాణశాఖ అధికారులు రిలే దీక్షలో కూర్చున్నారు. అలాగే స్థానిక 4వ వార్డు ముస్లిం యువకులు నిరసన ర్యాలీ చేసి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఇక పట్టణంలో రెండో రోజు బంద్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. వెలిగండ్లలో రాష్ట్ర విభజనకు నిరసనగా వెలిగండ్ల అష్ట దిగ్బంధం కార్యక్రమాన్ని సమైక్యవాదులు చేపట్టారు.
పామూరులో వైఎస్‌ఆర్ సీపీ, కాపునాడు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ చేశారు. అలాగే ముస్లిం యూత్ ఫోర్స్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలోనూ బంద్ కొనసాగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు భారీ ప్రదర్శనలు, మానవహారాలతో హోరెత్తించారు. తర్లుపాడులో సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీ నిర్వహించి పట్టణ బంద్ చేపట్టారు. కొనకనమిట్ల, గొట్లగట్టు, నాయుడుపేటల్లో నిరసన ర్యాలీలు చేశారు. గిద్దలూరులో రెండో రోజు బంద్ విజయవంతంగా సాగింది. పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణదారులు షాపులు మూసి రిలే దీక్షలు చేశారు. కంభంలో సమైక్యవాదులు భారీ ర్యాలీ చేపట్టి మానవహారం ఏర్పాటు చేశారు. యర్రగొండపాలెంలోనూ బంద్ రెండో రోజు సంపూర్ణంగా సాగింది. ఉద్యోగులు ప్రైవేట్ వాహన రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు.
వెల్లువెత్తిన ప్రజాగ్రహం
Published Sun, Oct 6 2013 4:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement