రాష్ట్ర విభజన వార్తలతో మనస్తాపం చెంది ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు గుండెపోటుతో.. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పాటికాల్వ బజారుకు చెందిన బోడపాటి నరసింహారావు(43) వృత్తి రీత్యా పెయింటర్. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయన.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనతో తీవ్ర మనోవేదన కు గురై గుండుపోటుతో మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన బొలిపో వీర్రాజు (68) రెండో కుమార్తె, అల్లుడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఆందోళనతో గుండెపోటుకు గురయ్యూడని వీర్రాజు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయనగరం జిల్లా జామిలోని బీసీ కాలనీకి చెందిన గొర్లె ఎర్నాయుడు (35) ట్రాక్టర్ డ్రైవర్. శనివారం రాత్రి యూనియన్ నేతలు, వ్యాపారులు అంతా కలసి బంద్ నిర్వహణ విషయమై చర్చించుకున్నారు. ఆదివారం టీవీలో ఉద్యమ వార్తలు చూస్తూ కుప్పకూలిపోయాడు.
కడపలోని ఇందిరానగర్ కు చెందిన చండ్రాయుడు(40) సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. ఇదిలా ఉండగా, గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీకి చెందిన వందనంబాబు(25) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వీరి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కువమంది తెలంగాణాలో కూలీ పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల తమ వారికి ఏం జరుగుతుందోనన్న భయంతో బాబు శుక్రవారం రాత్రి పురుగుమందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కాగా, కృష్ణాజిల్లా అవనిగడ్డ వాసి శ్రీనివాసరావు సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీలో పాల్గొన్న అధికారభాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ సమక్షంలోనే కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని రక్షించారు.
రాష్ట్ర విభజనతో మనస్తాపం చెంది ఐదుగురు మృతి
Published Mon, Aug 5 2013 1:03 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement