కాజ కోదండ రామాలయంలో చోరీ
Published Thu, Aug 8 2013 2:46 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
కాజ(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్ : కాజ గ్రామంలోని కోదండ రామస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు చొరబడి రూ.3.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్చకుడు సత్య ప్రసాద్ ప్రతి రోజు మాదిరిగా బుధవారం ఉదయం 5 గంటలకు దేవస్థానానికి చేరుకున్నాడు. దేవస్థానం లోపల తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. ఉత్సవ విగ్రహాల వద్దకు వెళ్లి పరిశీలించగా ఆరు వెండి కిరీటాలు, నాలుగు బంగారు మంగళ సూత్రాలు, వెండి చటారి, బంగారు నెక్లెస్, స్వామి వారి వెండి పాదాలు, వెండి ధనస్సు, వెండి బాణం, రెండు ఉత్తర జంధ్యాలు, వెండి పంచపాత్రలు చోరీ అయినట్టు గుర్తించారు.
విషయాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కృపాల్‌రెడ్డికి తెలియజేసి, మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు, రూరల్ సీఐ టి.మురళీకృష్ణ, ఎస్‌ఐ వై.సత్యనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని దేవస్థాన ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించారు. వేలిముద్రల విభాగం అధికారి కె.వెంకటేశ్వరరావు, క్లూస్ ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వేలిముద్రల ఆధారాలను సేకరించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంచాయితీ కార్యాలయం వద్ద ఉన్న పడమట దేశమ్మ తల్లి, శ్రీకృష్ణుని మందిరాల్లో కూడా బుధవారం తెల్లవారుజామున దొంగలు హుండీలను పగులగొట్టి వాటిలోని నగదు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రతి రోజూ రాత్రి వేళ పోలీస్ సిబ్బంది గ్రామంలో ప్రత్యేక గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంచార జాతికి చెందిన ఓ ముఠా దేవాలయాల దోపిడీలకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారం వుందన్నారు.
Advertisement
Advertisement