12 అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్
విశాఖపట్నం/గుంటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ (ఈయూ) మద్దతు ప్రకటించింది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలో బస్సులు తిరగకుండా నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూనియన్ నేతలు బుధవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.రామకృష్ణను బీచ్‌రోడ్ క్యాంప్ కార్యాలయంలో కలసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ కన్వీనర్ వలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, మంగళవారం ఒంగోలులో చేసిన తీర్మానం మేరకు జోనల్ ఈడీలకు బుధవారం సమ్మె నోటీసులిచ్చినట్టు చెప్పారు.
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ఆర్టీసీలో ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే వరకూ పోరాడతామన్నారు. సమైక్యాంధ్ర సాధనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాచేసి ప్రజలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పెదమజ్జి సత్యనారాయణ, కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ, జోన్‌లో ఉన్న 27 డిపోల్లో, జోనల్ వర్క్‌షాపుల్లో నిరవధిక సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు.
బుధవారం నుంచి అన్ని డిపోల్లో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, 10న పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కాగా, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) నాయకులు ఈనెల 12 నుంచి సమైక్య ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు సీమాంధ్రలోని 13 జిల్లాల యూనియన్ నాయకులు బుధవారం గుంటూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం అన్ని జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు సమ్మె నోటీసులను అందజేయాలని నిర్ణయించారు. అదేరోజున సీమాంధ్రలోని 123 డిపోల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. 11న నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన జరపాలనీ, 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్‌జీవోలతో కలసి జేఏసీగా ఏర్పడి ఉద్యమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. ఇందుకోసం సీమాంధ్రలోని నాలుగు జోన్లలోని ఎన్‌ఎంయూ కార్యదర్శులను స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేశారు.