సమైక్య ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన సమైక్యాంధ్ర జేఏసీ
సమైక్య ఉద్యమం రగులుతోంది. రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. ఇప్పటికే తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. విద్యార్థి జేఏసీ మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యి, వివిధ విషయాలపై చర్చించింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రేపటి నుంచి సమైక్య నినాదంతో గడప గడపకు పాదయాత్రలు చేస్తామని, 12న లక్షలాది మందితో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో సింహగర్జన నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే ఈనెల 18వ తేదీన బీచ్‌రోడ్‌లోని వైఎస్ విగ్రహం నుంచి ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు మిలియన్ మార్చ్ నిర్వహించాలని తలపెట్టింది.
అలాగే, రాష్ట్ర విభజన విషయంపై ఏమీ స్పందించకుండా ఊరుకున్నందుకు నిరసనగా కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు చెందని సినిమా ప్రదర్శనలన్నింటినీ నిషేధిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఏదైనా థియేటర్లో వాళ్ల సినిమాలు ప్రదర్శిస్తే.. వాటిపై దాడులు తప్పవని హెచ్చరించింది.
నేటినుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్షలు
అంతకుముందు సమైకాంధ్రకు మద్దతుగా గాజువాకలోబంద్ పాటించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నేటి నుంచి విద్యుత్తు ఉద్యోగులు అమరణ దీక్షలు చేయాలని తలపెట్టారు. విశాఖలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బంద్ అయ్యాయి. మరోవైపు ఉధ్యామాన్ని అణచివేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్కూల్, ఇంటర్ విద్యార్థులు ఉద్యమంలో పాల్గోంటే వారిపై జువనైల్ చట్టాన్ని అమలు చేస్తామని డీఈవో, ఆర్ఐవోలను హెచ్చరించారు.
గుంటూరులోనూ ఉధృతంగా కార్యాచరణ
మరోవైపు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో కూడా సమైక్యాంధ్ర జేఏసీ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించి, కార్యాచరణ ప్రటించారు. 6, 7 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 9, 10 తేదీల్లో సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో రైల్‌రోకోలు చేయాలని, 11, 12 తేదీల్లో మండలస్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తెలిపింది. అలాగే.. 13, 14 తేదీల్లో ఉద్యోగులతో కలిసి రాజీనామా చేయని నేతల ఇళ్లను ముట్టడించాలని కూడా తెలిపింది.