12 గ్రామ పంచాయతీల తుదిపోరుకు సమాయత్తం
Published Thu, Aug 8 2013 2:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, నరసరావుపేట: జిల్లాలోని 12 గ్రామ పంచాయతీలకు, 118 వార్డులకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాఅధికారులు సమాయత్తమయ్యారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు, కండ్లకుంట, వినుకొండ మండలం అందుగులపాడు, ఈపూరు మండలం ఊడిజర్ల, గురజాల మండలం గోగులపాడు, దాచేపల్లి మండలం సారంగపల్లిఅగ్రహారం, నరసరావుపేట మండలం ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి, నాదెండ్ల మండలం తూబాడు, గుంటూరు డివిజన్‌లోని చల్లావారిపాలెం గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి.
40 మంది సర్పంచ్ అభ్యర్థులు, 118 వార్డులకు 260 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,264మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. నేడు ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో శిరిగిరిపాడు, కండ్లకుంట, తూబాడు, రొంపిచర్ల, ముత్తనపల్లి, ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం పంచాయతీలు అత్యంత సమస్యాత్మకమైనవి కావడంతో ఈ గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో గొడవలు జరుగుతాయనే కారణంతో ఇక్కుర్రు, రొంపిచర్ల, ముత్తనపల్లి, తూబాడు, శిరిగిరిపాడు, కండ్లకుంట పంచాయతీలకు ఎన్నికలను కలెక్టర్ సురేశ్‌కుమార్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఉద్రిక్తత నెలకొని ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగ్రామం తూబాడులో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి బరిలో లేకపోవడం గమనార్హం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నరసరావుపేట, గురజాల డీఎస్పీలు వెంకటరామిరెడ్డి, పూజ తెలిపారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీలతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 968 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు.
రొంపిచర్ల: ఎన్నికలు జరుగనున్న ముత్తనపల్లి, రొంపిచర్ల గ్రామాల్లో పోలీసులు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు.
Advertisement