నేటి నుంచి మళ్లీ సమైక్య ఉద్యమం
Published Thu, Dec 5 2013 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మరోమారు ఉద్యమించనున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో గురువారం నుంచి దీక్షా శిబిరాలు నిర్వహించనున్నామని వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం తెలిపారు. స్థానిక ఎన్జీవో కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం గతంలో ఉద్యోగులు 66 రోజులు సమ్మె చేసి రూ.2,400 కోట్లు నష్టపోయారన్నారు. అయినా కేంద్రం, కాం గ్రెస్ పార్టీ పట్టించుకోకుండా రాష్ట్ర విభజన దిశగా ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఇందుకు నిరసనగా యూపీఏ చైర్‌పర్సన్ జన్మదినమైన డిసెంబర్ 9ని విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఆ రోజు జిల్లాలోని ఉద్యోగులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతారన్నారు.
రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయడమే కాకుండా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ఓటు బ్యాంకు పెంచుకోవడానికే ఆ పార్టీ పాకులాడుతోందని ధ్వజమెత్తారు. ఐదున్నర కోట్ల సీమాంధ్ర ప్రజల మనోభావాలు గుర్తించకుండా మూడున్నర కోట్లమంది తెలంగాణ ప్రజల మనోభావాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని విభజించాలని చూడడం కాంగ్రెస్ దుర్బుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ , రాయల తెలంగాణ అంటూ పూటకో పేరుతో ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. వేదిక కన్వీనర్ బుక్కూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ టీ బిల్లు పెట్టిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన కేంద్ర మంత్రి చిరంజీవి, ఆ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబును రాజీనామా చేయాలని కోరడం శోచనీయమన్నారు. మరో కన్వీనర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ విభజన పట్ల విద్యార్ధిలోకం తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు.
భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. వేదిక కో-కన్వీనర్ కొంక్యాన వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి 60 ఏళ్లు పట్టిందని, విభజన జరిగితే సీమాంధ్రలో రెండు తరాలు భవిష్యత్తును కోల్పోవలసి వస్తుందన్నారు. జాతీయ పార్టీలు జాతీయ భావజాలం కోల్పోయి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదన్నారు. కిలారి నారాయణరావు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్ర కోసం కృషి చేయాలన్నారు. దుప్పల వెంకటరావు, దిలీప్‌లు మాట్లాడుతూ దేశంలో ఎన్నో సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుండగా కేవలం ఆంధ్రప్రదేశ్ విభజనపైనే దృష్టి సారించి విభజించాలని కంకణం కట్టుకోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కమిటీ ప్రతినిధులు పూజారి జానకీరాం, పి.జయరాం, ఆర్.వేణుగోపాలరావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వై.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement