జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. ఎన్నికల ముందు ఉండవలసిన హడావుడి ఆ పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. అంతటా నిర్లిప్తత ఆవరించింది. ఎన్నికలంటేనే వారు భయపడిపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఆ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గెలిచే అవకాశం ఎలాగూ లేదు, కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేని దుస్థితిలో వారుకొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేక త వ్యక్తం కాకతప్పదని మధనపడుతున్నారు. దీంతో చాలా మంది నేతలు పోటీ చేయడానికి ముందుకురావడంలేదు. ఇంకొంతమంది పక్కచూపులు చూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
రాష్ట్ర విభజన... సమైక్యాంధ్ర ఉద్యమం... ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ విధించి న కర్ఫ్యూ... వెరసి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ దయనీయ స్థితి కి చేరింది. విజయనగరంలో ఇప్పుడా పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నేతలంతా డైలమాలో పడ్డా రు. అన్నీ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నా కాంగ్రెస్‌లో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ నేతల అభద్రతా భావం బయటపడుతోంది. ప్రజాకంటక పాలనతో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ నాయకులకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు నగరంలో విధించిన కర్ఫ్యూతో ప్రజల్లో తిరగలేని పరిస్థితి దాపురించింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ తీరును ఎండగట్టే విధంగా మాట్లాడుతుండడంతో తాము కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతున్నారు.
కర్ఫ్యూతో ఎదురైన ఇబ్బందులు, కర్ఫ్యూ అనంతరం పెట్టిన కేసులతో తీవ్ర ఆవేదనతో ఉన్న జనాలు ఎన్నికలెప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తూ వచ్చారు. నిరీక్షణకు తగ్గట్టుగానే వరుస ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. అన్నింటి కంటే ముందుగా మున్సిపల్ ఎన్నికలు సమీపించాయి. ఎన్నికలొస్తే చాలు సందడి చేసే హస్తం నేతలు మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కిమ్మనడం లేదు. పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్నీ పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్తూ, ఎన్నికల జోష్ కనబరుస్తున్నా కాంగ్రెస్‌లో మాత్రం కనీస చలనం లేదు.
ప్రజల నాడిని పసిగట్టిన ఆ పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడుతున్నారు. ఏం చేశామని ప్రజల్లోకి వెళ్లగలమని, ఏం చెప్పి ఓటు అడగగలమని ప్రశ్నించుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉండడమే మేలన్న అభిప్రాయానికొచ్చేశారు. స్వతంత్రంగా పోటీ చేస్తే గెలుపు పక్కన పెడితే కనీసం ప్రచారంలోనైనా ఆదరిస్తారన్న ఆలోచనతో ఉన్నారు. లేదంటే ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడం మంచిదనే యోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా నాయకత్వానికి కూడా అవే సంకేతాలు పంపించినట్టు తెలిసింది. దీంతో ఉలిక్కిపడిన జిల్లా నాయకులు అప్రమత్తమై మాజీ కౌన్సిలర్లు, క్రియాశీలకంగా పనిచేసిన నాయకులతో సంప్రదింపులు చేసేందుకు రంగంలోకి దిగారు. అటువంటి ఆలోచన వద్దని, పార్టీ తరఫున పోటీ చేయాలని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఒప్పిస్తున్నారు. కానీ నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ససేమిరా అంటున్నారు. అయితే అభ్యర్థి ఖర్చంతా భరిస్తానని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని కాంగ్రెస్ కీలక నేత ఒకరు భరోసా ఇస్తున్నారు. ఇంతలా చెబుతున్నా పోటీ చేసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు.
సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆ మధ్య ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినా జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి పోటీ చేసేదెవరు అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇంతవరకు ఆ పార్టీ అభ్యర్థిగా ఏ ఒక్కరూ ప్రజలకు వద్దకు వెళ్లడం లేదు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసేదెవరనేది తేలాకే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఎన్నికల జోష్ ఏ మాత్రం కన్పించకుండా కాంగ్రెస్ స్థబ్దుగా ఉంది.
బెల్టు దుకాణాలు మూసివేయూలి
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున అనధికార బెల్టు దుకాణాలు మూసివేయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీసీ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘ సూచనలతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో మద్యం విక్రయాలు, సరఫరాపై నిరంతం నిఘా ఉంచాలన్నారు. ప్రధానంగా విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల పరిధిలో బెల్టుదుకాణాలను మూసివేయించాలన్నారు. లెసైన్సు ఉన్న మద్యం దుకాణాలు నిబంధనల ప్రకారం నడిచేలా పర్యవేక్షణ చేయాలన్నారు. సరిహద్దుల వెంబడి చెక్‌పాయింట్లు, ఇంటిలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మూడు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సముద్ర తీరం నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రత్యేకంగా ఒక నిఘా బృందాన్ని తీర ప్రాంతంలో కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆనందరాజు, విజయనగరం, పార్వతీపురం ఎక్సైజ్ సూపరిండెండెంట్లు పి.శ్రీధర్, వెంకటేశ్వర్లు, పార్వతీపురం ఏఈఎస్ ప్రసాద్, ఎక్సైజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికళ తప్పిన కాంగ్రెస్!
Published Sat, Mar 8 2014 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement