కాంగ్రెస్‌కు చావుదెబ్బ: సీఎం
రాష్ట్ర విభజనతో ఎన్నికల్లో జరిగే మేలు శూన్యం
నా ముందున్న ప్రత్యామ్నాయూల్లో రాజీనామా ఒకటి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయంతో ఎన్నికల పరంగా జరిగే మేలు శూన్యమేనని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇది దీర్ఘకాలం పాటు చావుదెబ్బగా పరిణమిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆదివారం సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానెల్ ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదన ద్వారా మన్మోహన్‌సింగ్, సోనియూగాంధీలు ఎంతటి తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారు? కాంగ్రెస్ ఎన్నికల అవకాశాలకు ఎంత నష్టం చేకూరుస్తుంది? అన్న ప్రశ్నలకు సీఎం పై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రపతి పంపిన బిల్లును ఉభయ సభల్లోనూ తాము తిరస్కరించామని, కేంద్రంలోని పెద్దలు, ఇతరులు దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకోవడం దురదృష్టకరమని కిరణ్ అన్నారు. ప్రజలు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. వ్యక్తికంటే పార్టీ గొప్పదని, కానీ పార్టీ కంటే ప్రజలు గొప్పవారని.. ప్రజల భావావేశాలను గౌరవించాల్సి ఉందని అన్నారు.
విభజనను అడ్డుకునేందుకు రాజీనామా సహా ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని చెప్పారు. తాను ఒంటరిని కాదని, ఇప్పుడు తనముందున్న ప్రత్యామ్నాయూల్లో రాజీనామా ఒకటని తెలిపారు. ఇంతకుమించి ఊహించడానికి సిద్ధంగా లేనన్నారు. 70-80 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలున్నారని, తామంతా చర్చించుకుని తగిన చర్య తీసుకుంటామని, సమయమొచ్చినప్పుడు తాను సరైన చర్య తీసుకుంటానని చెప్పారు. 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండటానికి కాంగ్రెస్, పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీయే కారణమని చెప్పారు. సమస్యను ఎత్తిచూపడానికే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇది వారిపై తిరుగుబాటు కాదా? అన్న ప్రశ్నకు.. ఇది ధిక్కారం కాదని ముఖ్యమంత్రి జవాబిచ్చారు. నిరసనతో పార్టీకి సంబంధం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అన్నారు.
రాష్ట్రం తిరస్కరించిన బిల్లు, ముఖ్యంగా పునర్విభజన బిల్లు దేశంలోనే లేదన్నారు. బిల్లును అడ్డుకునేందుకు పార్లమెంటును స్తంభింపజేసేందుకు సిద్ధమవుతున్నారా? అన్న ప్రశ్నకు.. తాను పార్లమెంటు సభ్యుడిని కానంటూ.. ఎంపీలు తమ తమ మార్గాల్లో రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారని చెప్పారు. హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగానని 53 ఏళ్ల తర్వాత నువ్వీ ప్రాంతానికి చెందినవాడివి కాదనడమే మమ్మల్ని, ప్రజలను బాధిస్తోందని కిరణ్ వ్యాఖ్యానించారు.